2007లో తొలి టీ-20 వరల్డ్ కప్‌ను భారత యువ జట్టు కైవసం చేసుకుంది. అయితే ఆ టోర్నీలో భారత దిగ్గజ బ్యాట్స్‌మన్‌లు ఆడక పోవడానికి ఒక క్రికెటర్ ప్రధాన సూత్రధారి అని అప్పటి జట్టు కోచ్ కమ్ మేనేజర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ వెల్లడించి సంచలనం రేకెత్తించాడు.
2007 వన్డే ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్లతో కూడిన భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రారంభ పొట్టి ఫార్మేట్ ప్రపంచకప్‌కు బీసీసీఐ యువఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
కాగా మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని యువజట్టు టీ-20 ప్రపంచకప్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్‌లో దాయాది పాకిస్థాన్‌ను చిత్తు చేసిన ధోనీ సేన పొట్టి ఫార్మేట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. ప్రపంచకప్ గెలుచుకున్న జట్టులో ‘బిగ్ త్రీ’గా పిలవబడే సచిన్ టెండూల్కర్,సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లేరు.వీరి స్థానంలో అప్పటి యువ ఆటగాళ్లు అయిన రోహిత్ శర్మ, రాబిన్ ఉతప్ప, యూసుఫ్ పఠాన్, జోగిందర్ శర్మ వంటి వారికి జట్టులో స్థానం లభించింది. కాగా జట్టు నుంచి సచిన్, సౌరవ్, ద్రావిడ్ తప్పుకోవడం వెనక మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ పాత్ర ఉందని భారత మాజీ కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తెలపడంతో ఆ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆనాటి జట్టు కోచ్ లాల్‌చంద్ రాజ్‌పుత్ ‘స్పోర్ట్స్‌కీడా’క్రికెట్ ఫేస్‌బుక్ పేజ్ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ,”2007 టీ-20 ప్రపంచకప్ నుంచి తప్పుకునేలా టెండూల్కర్, గంగూలీని ద్రవిడ్ ఒప్పించాడు. అప్పుడు ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు కొందరు ఆటగాళ్లు నేరుగా ఇంగ్లండ్ నుంచి జొహన్నెస్‌బర్గ్ చేరుకున్నారు. అయితే యువకులకు ఆడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో వారిద్దరితో మాట్లాడిన రాహుల్ జట్టు నుండి తప్పుకునేందుకు వారిని ఒప్పించాడు. కానీ టీమిండియా టీ-20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత వారు తప్పకుండా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు’’ అని ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
ఇంకా నాటి చిరస్మరణీయమైన విజయం గురించి మేనేజర్ రాజ్‌పుత్ తెలుపుతూ “ఈ టోర్నీలో పాల్గొన్న భారత జట్టును అందరూ అండర్ డాగ్స్ గా పరిగణించారు. ఇక టీ-20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడింది ఒకే ఒక టీ-20 మ్యాచ్. అలాగే మెగా టోర్నీ కోసం భారత జట్టు ప్రాక్టీస్ చేసింది కూడా ఏమీ లేదు. అప్పటికే ఇతర జట్లు ఈ మెగాటోర్నీ కోసం చాలా మ్యాచ్‌లు ఆడాయి. ఐసీసీ కప్ గెలవడానికి మేం పెద్దగా ప్రణాళికలు కూడా రచించలేదు. కానీ మా యువ ఆటగాళ్లలో కసి, అద్భుత ప్రదర్శనతో మంచి పేరుతేచ్చుకోవాలనే తపన, జట్టులో స్థానాన్ని పదిలం చేసుకోవాలనే సీనియర్ ఆటగాళ్ల కోరికనే మమ్మల్ని విజేతగా నిలిపింది. కోచ్‌గా నాకు, కెప్టెన్‌గా ధోనీకి అదే తొలి టోర్నీ. కానీ మేం బాగా కలిసిపోయాం. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో జట్టు సమతూకంగా ఉండటం కూడా కలిసి వచ్చింది” అని అభిప్రాయపడ్డాడు.
భారత్‌కు ఏళ్ల తరబడి ఆడుతున్న ఒక్క ప్రపంచకప్‌ను గెలవలేకపోయానని సచిన్ తరుచూ అనేవాడు. చివరకు 2011 గెలిచినా దాని కోసం అతను చాలా శ్రమించాడు. అయితే యువ భారత జట్టు మాత్రం తొలి ప్రయత్నంలోనే సాధించిందని లాల్ చంద్ పేర్కొన్నాడు.