iDreamPost
iDreamPost
బ్రిటీష్ వారి కాలంలో మహర్ధశను చవిచూసిన బందరు తీరంలో పోర్ట్ నిర్మాణం సుదీర్ఘకాలంగా ఉన్న కల. దానికి వివిధ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడమే తప్ప ఫలితాలు లేవు. చివరకు చంద్రబాబు హయంలో కేవలం శంకుస్థాపనకే పరిమితం అయ్యింది. ప్రచారమే తప్ప పనులు ముందుకు సాగలేదు. నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ పేరుతో మొబలైజేషన్ అడ్వాన్సులతోనే సరిపెట్టిందనే విమర్శలున్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వివిద ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. అందులో బాగంగా బందరు పోర్ట్ పూర్తి చేయాలని సంకల్పించింది. దానికి అనుగుణంగా ఏపీ మారిటైం బోర్డ్ ఏర్పాటు కావడంతో రామాయపట్నం నుంచి భావనపాడు వరకూ వివిధ పోర్టులపై శ్రద్ధ పెట్టి సాగుతోంది. అందుకు అనుగుణంగా బందరు పోర్ట్ డీపీఆర్ కి ఆమోదం లభించింది. రూ. 5,835 కోట్లతో పోర్ట్ నిర్మాణం కోసం పాలనపరమైన అనుమతులు లభించడంతో ఓ అడుగు పడినట్టయ్యింది.
ప్రాజెక్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా రూ. వెయ్యి కోట్లు మంజూరు చేస్తుంది. మిగిలిన మొత్తం ఏపీ మారిటైం బోర్డ్ సమకూరుస్తుంది. దానికి అనుగుణంగా రూ. 4765 కోట్లను అప్పుల రూపంలో సమీకరించేందుకు అనుమతులు లభించాయి. దానికి తగ్గట్టుగా తొలిదశలో 225 ఎకరాల భూమి అవసరం అని నిర్ణయించారు. దాని సేకరణకు రూ. 90 కోట్లను మారిటైం బోర్డ్ నుంచి కేటాయిస్తారు.
బందరు పోర్ట్ పూర్తయితే అనేక విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్ర అవసరాలు కూడా తీర్చేందుకు అందుబాటులో ఉండడంతో లాభదాయకంగా మారుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో బందరు వాసుల కల నెరవేరుతుంది. ఒకనాటి రేవు పట్టణానికి మళ్లీ పూర్వ వైభవం వస్తుంది. పారిశ్రామికంగానూ కీలక అడుగులు పడే అవకాశం ఉంటుంది. జగన్ ప్రభుత్వం సంక్షేమంతో పాటుగా అభివృద్ధికికూడా ప్రాధాన్యతనిస్తున్న తరుణంలో బందరు పోర్ట్ త్వరలోనే పూర్తయితే ఏపీ కి ఉన్న తీర ప్రాంత వనరులను సద్వినియోగం చేసుకోవడంలో మరో ముందడుగు పడినట్టవుతుంది.