ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. నేను చెప్పిందే వేదం..అనే వితండ వాదంతో దుడుకుగా వ్యవహరిస్తున్నారు. ఎవరేమనుకున్నాం ఫరవాలేదు..నేను సీతయ్యను ..ఎవరి మాటా వినను అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సగటు మనిషికి సవాలక్ష సందేహాలు కల్గుతున్నాయి. ఏదో పొలిటికల్ మోటోతో నిమ్మగడ్డ దూకుడు పెంచాటన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకునేది లేదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై అనంతపురం, కర్నూలులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల పర్యవేక్షణ కోసం కొత్త యాప్ ‘జియో’ తయారు చేశామని, గ్రామాల నుంచి నేరుగా రికార్డింగ్ మెసేజ్‌లతో పాటు సందేశాలు కూడా పంపవచ్చని తెలిపారు. యాప్, కాల్‌సెంటర్‌లను డ్యాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షిస్తామంటూ కొత్తపల్లవి అందుకున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు ఏపీ పంచాయితీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటే.ఈ కొత్తయాప్ ఎవరు రూపొందించారు? ఎప్పుడు రూపొందించారు? అన్న కొత్త సందేహం కల్గుతోంది.
2. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవాలైన చోట్ల సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించాలని ఆదేశించారు. ఏకగ్రీవాలకు ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదని, అది గతం నుంచే ఉందన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర వాతావరణం ఉందని విపక్ష పార్టీల నాయకులు ఏకగ్రీవాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. సమాచార శాఖ కమిషనర్‌ను సంజాయిషీ కోరానని, ఆయనపై చర్యలు కూడా తీసుకోబోతున్నానన్నారు. ఇప్పటివరకూ ఎన్నికల కమిషనర్లు నాలుగు గోడల మధ్య పిచ్చాపాటి కబుర్లతో కాలక్షేపం చేశారని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల సందర్భంగా షాడో టీంలను విధిగా ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దీంతో.. ప్రస్తుతం జరుగుతున్నవి పంచాయితీ ఎన్నికలా? లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడానా? నోటిఫికేషన్ పంచాయతీకి మాత్రమే ఇచ్చి..ఏకగ్రీవాల పేరుతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఏకగ్రీవాలను నిమ్మగడ్డ తెరమీదికి ఎందుకు తెచ్చినట్లు?
3. అనేక తర్జనభర్జనలు తర్వాత స్థానిక ఎన్నికలు ఏపీలో జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ముందు ఎన్నికల కమిషనర్ కు అధికార పార్టీకి మధ్య రాజకీయ వైరం ఎలా ఉన్నదో ప్రక్రియ మొదలయిన తరవాత ఇంకా ఎక్కువ అవుతుంది. ఎన్నికల సంఘం గత మార్చిలో ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికలను వాయిదా వేసింది. అక్కడ ప్రారంభమయిన వైరం నేటికి సాగుతోంది.
నాడు సుప్రీంకోర్టు తదుపరి ఎన్నికలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వంతో సంప్రదించాలని ఆదేశించినది. ప్రభుత్వంతో సంప్రదించడం అంటే కేవలం సమాచారం ఇవ్వడం మాత్రమే కాదు. హేతు బద్ధమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం కూడా. కానీ నిమ్మగడ్డ మాత్రం అలా కాకుండా నేనే సర్వాధికారిని అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించడం లేదంటూ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఇది కోర్టు దిక్కారం కాదా? ఎస్ఈసీ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రవర్తించ వచ్చని రాజ్యాంగంలో ఉందా?
5. గత ఏడాది ఎన్నికల సంఘం వాయిదా వేసినప్పుడు ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తదుపరి ఎన్నికలను మొదలు పెడుతాము అని అధికారిక ప్రకటన విడుదల చేసారు. మరి ఇప్పుడు అందుకు భిన్నంగా కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. పైగా అప్పుడు వాయిదా వేసింది గ్రామపంచాయతీ తో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. మరి ప్రస్తుంత కేవలం గ్రామపంచాయతీ ఎన్నికలకు మాత్రం కొత్తగా నోటిఫికేషన్ జారీచేయడంలో ఆంతర్యం ఏమిటి? ఇందులో ఉన్న మతలబు ఏమిటి? పైగా తన పర్యటనలో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఏకగ్రీవాలను తెరమీదికి తేవడంలో ఆంతర్యం ఏమిటి? ఇదంతా చూస్తుంటే వైసీపీ ఆరోపించినట్లు నిమ్మగడ్డ కావాలనే కయ్యానిక కాలుదువ్వుతున్నట్లు కాదా?
6. వాస్తావనికి పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరగాలి. కానీ టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోను (పల్లె ప్రగతికి పంచ సూత్రాలు పేరుతో ఈ ప్రణాళికను) రిలీజ్ చేస్తే.. నిమ్మగడ్డ ఎందుకు స్పందించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది. పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేయడంపై వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి సీహెచ్ సాయిరామ్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా మేనిఫెస్టోను విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరి ఈ విషయంలో నోరు విప్పితే రాజ్యాంగం..రాజ్యాంగం అంటు మాట్లాడే నిమ్మగడ్డ టీడీపీ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? చంద్రబాబు ఏది చేసినా అది రాజ్యాంగ విరుద్దం కాదా?
ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం ఏపీలో నిమ్మగడ్డ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు సగటు మనిషికి సవాలక్ష సందేహలు కల్గిస్తున్నాయి. మరి వీటికి ఘనత వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డగారి సమాధానం ఏమిటో?