ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి ఇప్పటికే రాష్ట్రానికి ఆశనిపాతంగా మారింది. అనేక అంశాల్లో అన్యాయం జరుగుతోందని జనం భావించాల్సి వస్తోంది. రాష్ట్రానికి నిధుల కేటాయింపులో చిన్నచూపు చూస్తున్న విషయం సామాన్యుడికి సైతం అర్థమవుతోంది. ఈ నేపధ్యంలో పోలవరం ప్రాజెక్ట్వంటి వాటిలో కూడా కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని అంతా ఆశిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం కూడా పదే పదే ఈ సమస్యని కేంద్రం దృష్టికి తీసుకొస్తోంది. 8దశాబ్దాలుగా పెండింగ్ లో ఉండడం, విభజన చట్టంలో జాతీయ హోదా కేటాయించడంతో ఇప్పటికైనా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందనే ఆశాభావం అందరిలో ఉంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనావ్యయం 2017 లెక్కల ప్రకారం సవరించాల్సి ఉంది. 2013 అంచనా ప్రకారం మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని ఆర్థికమంత్రిత్వ శాఖ చెబుతోంది. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం కూడా ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేశాయి. దానికి అనుగుణంగా రూ.55 వేలకోట్లను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాబార్డ్ నుంచి ఫండ్స్ రీఎంబర్స్ చేస్తున్నారు. 2013నాటి లెక్కలతో పోల్చితే పునరావాస వ్యయం పెరిగింది. పైగా పెరిగిన ధరలు కూడా ప్రొజెక్టు ఖర్చుని పెంచాయి.
పెంచిన అంచనా ప్రకారం నిధులు విడుదల చేయాల్సి ఉండగా దానికి క్యాబినెట్ ఆమోదం ఉండాలని మెలిక పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం లాలూచీ పడినిర్మాణ బాధ్యత రాష్ట్రప్రభుత్వం నెత్తిన పెట్టుకొని ఉండకపోతే కేంద్రమే దానిని నిర్మించాలని చట్టం చెబుతోంది. అయినప్పటికీ టీడీపీ హయాంలో చేసిన తప్పిదాలకి ఇప్పుడు పరిహారం చెల్లించాల్సి వస్తోంది. పైగా కేంద్రం ఆర్థిక శాఖ తరుపున కొర్రీలు పెట్టడం కలవరం పెడుతోంది. ప్రస్తుతం ప్రోజెక్టు స్పిల్ వే నిర్మాణం పూర్తికావస్తోంది. స్పిల్ ఛానెల్ కాంక్రీటు పనులు ముగింపు దశకు చేరుతున్నాయి. హెడ్ వర్క్స్ పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్రప్రభుత్వం అంచనాలు వేస్తోంది. కానీ కేంద్రం మాత్రం నిధుల విషయంలో క్యాబినెట్ ఆమోదానికి ముడిపెట్టడంతో జాప్యం చేటుచేస్తుందనే వాదన ఉంది.
రాబోయే ఖరీఫ్ నాటికి మూడో కాంటూర్ వరకూ పునరావాసం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని విడుదల చేయాలని భావిస్తుండగా కేంద్రం తీరు రైతుల ఆశలపై నీళ్లుజల్లేలా ఉంది.