Idream media
Idream media
1965లో వచ్చిన దొరికితే దొంగలు తెలుగు మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా చెప్పుకోవచ్చు. గాలిలో స్కూటర్, జీపు, మనుషులు మాయం కావడం, రహస్య కెమెరాలు, ట్రూత్ టెల్లర్, రోబోలు ఇలాంటి విచిత్రాలన్నీ ఉన్నాయి. కథలో విషయం లేక సినిమా స్లోగా వుంటుంది. అప్పటి ప్రేక్షకులకి కొత్తగా వుండి ఆదరణ పొందింది.
NTR ప్రత్యేకత ఏమంటే మారువేషాలు లేకుండా ఆయన సినిమాలుండవు. దీంట్లో మరీ ఎక్కువ సేపు మారువేషంలో వుంటాడు. ఎందుకుంటాడో తెలియదు. NTR ఒక టోపీ, మందమైన మీసం పెట్టుకుంటే జమున గుర్తు పట్టదు. జమున తల మీద తెల్ల వెంట్రుకల పాయ, కళ్లకు అద్దాలు వుంటే NTR గుర్తు పట్టలేడు. వీళ్లిద్దరూ సీఐడీ అధికారులు. వీళ్లద్దర్నీ కమిషనర్ గుమ్మడి గుర్తు పట్టలేడు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ స్థితిలో వుంటే దొంగలు బరి తెగించక ఏం చేస్తారు?
అల్లు రామలింగయ్య , సత్యనారాయణ , రాజనాల వీళ్లు ముగ్గురు పైకి పెద్ద మనుషులు, లోపల విలన్లు. సినిమా మొత్తం మీద వీళ్లు చాలా భయంకరులని అంటూ వుంటారు కానీ, ఒక మార్వాడీని దోచుకోవడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. అయితే వీళ్ల దగ్గరున్న టెక్నాలజీ మామూలుది కాదు. విమానాన్ని పేల్చగలరు, ఎయిర్‌హోస్టెస్‌తో కెమెరాలో చూస్తూ మాట్లాడగలరు.
అసలు కథ కాంతారావుతో మొదలవుతుంది. ఆయనో సైంటిస్ట్. మనుషుల్ని మాయం చేసే మందుని కనుక్కుంటాడు. దాన్ని Improve చేసుకోడానికి విలన్ల సాయంతో అమెరికా వెళ్లి పరిశోధనలు చేస్తారు. తిరిగి వస్తున్నప్పుడు విమానాన్ని పేల్చేసి అతన్ని పారాచుట్‌లో దించి విలన్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటారు.
ఈ సినిమాలో వున్న రెండు పాయింట్లు తర్వాతి రోజుల్లో రెండు పెద్ద సినిమా కథలుగా మారాయి.
గుమ్మడి కొడుకు ఎన్టీఆర్ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్తాడు. తర్వాత గుమ్మడి ఇంటికొస్తాడు. తండ్రిని గుర్తు పడతాడు. తానే కొడుకని చెప్పడు. ఇదే ట్రాక్ SVR , NTR మధ్య దేవుడు చేసిన మనుషులులో వాడారు. అలవైకుంఠపురంలో కూడా Same.
పోలీస్ కమిషనర్ గుమ్మడికి తన కొడుకు కాంతారావు చెడు మార్గంలో వున్నాడని తెలిసి చివరికి కాలుస్తాడు. కొండవీటి సింహం కథ ఇదే. అయితే అంతకు ముందు బంగారు పతకం (డబ్బింగ్) శివాజీ గణేశన్ సినిమా ఇదే కథతో వచ్చింది.
ఎస్.రాజేశ్వరరావు సంగీతంలో “ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి”, “ఎవరన్నారివి కన్నులని” రెండు సూపర్‌హిట్ సాంగ్స్ ఉన్నాయి. ట్రిక్ ఫొటోగ్రఫీ అంతా రవికాంత్ నగాయిచ్ తీసాడు. ఏరియల్ వ్యూలో హైదరాబాద్‌ని చూసినప్పుడు 1965లో సిటీలో ఎన్ని చెట్లు , తోటలు ఉన్నాయో కనిపిస్తుంది.
డైరెక్టర్ పి.సుబ్రమణ్యం తర్వాత ఇంకే సినిమా తీయలేదు. శారద, జయంతి చిన్నపాత్రలు వేశారు. రాజశ్రీది డబుల్‌రోల్. రమణారెడ్డి, పేకేటి, సూర్యకాంతం వున్నారు. హీరో రోబోలతో ఫైట్ చేయడం ఒక విశేషం.