iDreamPost
iDreamPost
భారతీయ సినిమా చరిత్రలో హీరోలు వేసే మాఫియా డాన్ క్యారెక్టర్లకు ఒక రోల్ మోడల్ గా 1978లో వచ్చిన బాలీవుడ్ మూవీ ‘డాన్’ ని చెప్పుకోవచ్చు. అందులో అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ కి, రెండు విభిన్న పాత్రల్లో ఆయన చూపించిన విశ్వరూపానికి బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిసింది. డాన్ కు వచ్చిన ఆదాయం తమ కుటుంబం తరతరాలు తిన్నా తరిగిపోనంత సంపదను సృష్టించిందని నిర్మాత నారిమన్ ఇరానీ పలు సందర్భాల్లో చెప్పేవారు. చంద్ర బారోట్ దర్శకత్వం డాన్ ని క్లాసిక్ గా తీర్చిదిద్దింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క వేయడం కష్టం. ప్రతి హీరో తన కెరీర్లో ఒక్కసారైనా ఇలాంటి పవర్ ఫుల్ పాత్ర చేయాలని కోరుకోవడం అతిశయోక్తి కాదు.
డాన్ వచ్చాక దీని మీద వచ్చినన్ని రీమేకులు బహుశా ఎందులోనూ వచ్చి ఉండవు. 1979లో నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు ఏరికోరి మరీ ఇందులో నటించారు. కమర్షియల్ గా ‘యుగంధర్’ ఇక్కడ కూడా బాగా ఆడింది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఎన్టీఆర్ చిత్రం ఇదొక్కటే. యాక్షన్ జానర్ ని అద్భుతంగా డీల్ చేసే కెఎస్ఆర్ దాస్ దీనికి దర్శకత్వం వహించారు. జయసుధ హీరోయిన్ గా నటించగా సత్యనారాయణ, జగ్గయ్య, ప్రభాకర్ రెడ్డి, జయమాలిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మరుసటి సంవత్సరం 1980లో రజినీకాంత్ తమిళ్ లో ‘జానీ’గా డాన్ ని రీమేక్ చేస్తే అక్కడ ఘనవిజయం సొంతం చేసుకుంది
మళ్ళీ 2009లో ప్రభాస్ ఇదే కథలో ‘బిల్లా’గా నటించి మెప్పించాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రికార్డులు తిరగరాయకపోయినా మేకింగ్ పరంగా మెప్పులు పొందింది. దీనికన్నా ముందు అజిత్ ఇదే పేరుతో 2007లో ‘బిల్లా’గా చేయగా షారుఖ్ ఖాన్ 2006లో ‘డాన్’గా సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అజిత్, షారుఖ్ లు సీక్వెల్స్ తీసి చేతులు కాల్చుకోవడం వేరే ముచ్చట. ఇలా ఒకే కథతో ఇన్నేసి సినిమాలు రావడం ఒక ఎత్తైతే దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని వచ్చాయో లెక్కబెడితే మాత్రం ఆ కౌంట్ కి మతులు పోవడం ఖాయం. అందుకే డాన్ ఎప్పటికీ మర్చిపోలేని ఒక ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.