iDreamPost
android-app
ios-app

కరోనా వేళ కరువైన Dolo-650.. మీమ్స్ తో చెలరేగుతున్న నెటిజన్లు

  • Published Jan 23, 2022 | 12:10 PM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
కరోనా వేళ కరువైన Dolo-650.. మీమ్స్ తో చెలరేగుతున్న నెటిజన్లు

కోవిడ్ వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాలను చిదిమేసింది. సమాజ ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేసింది. కానీ హెల్త్ కేర్, ఔషధ రంగానికి మాత్రం కాసులు కురిపించింది. ముఖ్యంగా పారాసిటమాల్ కాంబినేషన్ ఉన్న మందులకు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది. కోవిడ్ లక్షణాల్లో జ్వరం, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నందున.. ఈ లక్షణాలు ఉన్నవారికి పారాసిటమాల్ కంటెంట్ ఉన్న కాల్పాల్, డోలో తదితర బ్రాండ్ల ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తాయని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దాంతో ఈ మందుల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. వీటిలోనూ డోలో-650 ఎంజీ ఆమ్మకాలైతే వందల రెట్లు పెరిగి ఉత్పత్తిదారులైన బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ టర్నోవరును ఆకాశమంత ఎత్తుకు జెట్ స్పీడ్ లో చేర్చాయి.

650 ఎంజీ మోతాదుతోనే ఆదరణ

సాధారణంగా కాల్పాల్ కాంబినేషన్ ఉన్న వివిధ రకాల ట్యాబ్లెట్లను గరిష్టంగా 500 ఎంజీ మోతాదుతోనే తయారు చేస్తుంటారు. కానీ డోలో ఉత్పత్తిదారులు మోతాదు పెంచి 650 ఎంజీ ట్యాబ్లెట్లు తయారు చేయడం కలిసి వచ్చింది కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ఈ మోతాదు సరిగా సరిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు వైరస్ లక్షణాలు ఉన్నవారికి అందజేస్తున్న హోమ్ కిట్లలోనూ డోలో 650ని చేర్చడంతో ఈ మాత్రలకు మరింత ఆదరణ పెరిగింది. ఫలితంగా అమ్మకాలు రెండేళ్లలోనే ఊహించనంత పెరిగాయి. ప్రముఖ హెల్త్ కేర్ రీసెర్చ్ సంస్థ ఐక్యూవీఐఏ అధ్యయనం ప్రకారం ఒక్క మనదేశంలోనే 350 కోట్ల డోలో 650 ఎంజీ ట్యాబ్లెట్ల విక్రయాలు జరిగాయి. అదే 2019లో కేవలం 7.5 కోట్ల స్ట్రిప్ ల అమ్మకాలు మాత్రమే జరిగాయి. 2020లో మన దేశంలో డోలో విక్రయాల టర్నోవర్ రూ.28 కోట్లు కాగా 2021లో అది రూ.560 కోట్లకు ఎగబాకడం విశేషం.

సోషల్ మీడియాలో మీమ్స్

డోలో ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. సాధారణంగా అస్వస్థత చేసినా మందులు వేసుకోవడానికి ఒక పట్టాన ఇష్టపడనివారు సైతం.. శరీరం కొంచెం వేడెక్కినట్లు కనిపిస్తే చాలు నేరుగా మెడికల్ షాపునకు వెళ్లి డోలో650 ట్యాబ్లెట్లు కొని వేసేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో దీని వినియోగంపై ఫన్నీ మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. శివాజీ సినిమాలో రజనీకాంత్ చూయింగ్ గమ్ స్టైల్ గా నోట్లో వేసుకునే సీన్లు ఉంటాయి. చూయింగ్ గమ్ స్థానంలో డోలో ట్యాబ్లెట్ పెట్టి మీమ్స్ వదులుతున్నారు. దేశంలో అమ్ముడుపోయిన 350 కోట్ల డోలో ట్యాబ్లెట్లను నిలువుగా పేర్చుకుంటు వెళితే ఎవరెస్టు కంటే 6వేల రెట్లు, బూర్జ్ ఖలీఫా కంటే 63 వేల రెట్లు ఎక్కువ ఎత్తుకు వెళ్తాయని అంచనా వేస్తున్నారు. ఏమైనా ఒకప్పుడు సాధారణ జ్వరం టాబ్లెట్ గా ఉన్న డోలో కోవిడ్ పుణ్యాన ప్రజలకు దివ్య ఔషధంగా, ఉత్పత్తిదారులకు కల్పతరువుగా మారింది.