iDreamPost
android-app
ios-app

Yanamala Ramakrishnudu – యనమల వెళ్లిపోతున్నారు, స్థానభ్రంశం అనివార్యం అంటున్న అనుచరులు

  • Published Oct 25, 2021 | 4:40 AM Updated Updated Oct 25, 2021 | 4:40 AM
Yanamala Ramakrishnudu – యనమల వెళ్లిపోతున్నారు, స్థానభ్రంశం అనివార్యం అంటున్న అనుచరులు

యనమల రామకృష్ణుడు..టీడీపీలో చంద్రబాబు తర్వాత కీలకంగా వ్యవహరించే నేత. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ప్రస్థానం దశాబ్దంన్నర క్రితమే ముగిసిపోయింది. కానీ ఆయన స్థానంలో సోదరుడు యనమల కృష్ణుడిని వరుసగా రెండు ఎన్నికల్లో బరిలో దింపి పరాభవాలు ఎదుర్కొన్నారు. 2009లో యనమల రామకృష్ణుడు తొలిసారిగా ఓటమి పాలయ్యారు. 1983 తర్వాత ఆయన తుని అసెంబ్లీ నియోజకవర్గంలో ఆరు సార్లు గెలిచి 2009లో ఓడిపోయారు. ఆయనపై రాజా అశోక్ బాబు గెలిచారు.

గడిచిన రెండు ఎన్నికల్లోనూ దాడిశెట్టి రాజా వైఎస్సార్సీపీ తరుపున విజయం సాధించారు. యనమల కృష్ణుడు ఆయన చేతిలో పరాభవం పాలయ్యారు. దాంతో యనమల ప్రస్థానం ఇక తునిలో సురక్షితం కాదనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. తునిలో మూడు ఓటముల తర్వాత యనమల కుటుంబం భవితవ్యమే గందరగోళంలో పడింది తునిలో మళ్లీ పట్టు సాధించడం ఇక సాధ్యం కాదనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది.

దాంతో యనమల కుటుంబం కన్ను ఇప్పుడు సమీపంలోని ప్రత్తిపాడు నియోజకవర్గంపై పడినట్టు తెలుస్తోంది. సహజంగా కాపు కులస్తులకు నిలయంగా ఉండే ఈ నియోజకవర్గంలో యాదవుల ఓటర్లు కూడా భారీగానే ఉన్నాయి. అదే సమయంలో రౌతులపూడి, శంఖవరం మండలాల్లో యనమల కుటుంబీకులు కూడా ఉన్నారు. ఇతర బీసీ వర్గాలతో కలిస్తే తమకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లోనే ఈ ఆలోచన వచ్చినప్పటికీ మూడోసారి కూడా తునిలో ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు.

ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైఎస్సార్సీపీ తరుపున పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు చాలాకాలంగా నియోజకవర్గంలో అనుభవం ఉంది. సొంత మండలం శంఖవరంతో పాటుగా ఏలేశ్వరంలో కూడా గట్టిపట్టుంది దాంతో ఆయన్ని ఢీకొట్టడం కూడా టీడీపీకి పెద్ద సమస్య అవుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన వరుపుల రాజా వ్యవహారం ఊగిసలాటలో ఉంది. ఎన్నికల ఫలితాలు రాగానే ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు. కానీ మళ్లీ ఇటీవల క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యనమల కుటుంబం గట్టిగా పట్టుబడితే టీడీపీ అధినేత ఆలోచించే అవకాశం ఉంది.

యనమల కుటుంబం తునిని వీడితే ఆ నియోజకవర్గం రాజకీయాల్లో కూడా కీలక మార్పులు ఖాయం అనే చెప్పవచ్చు. మొదటి నుంచి తుని పట్టణంలో పెద్దగా పట్టు లేకపోయినా తొండంగి, తుని రూరల్ లో ఉన్న అనుకూలతతో యనమల గట్టెక్కేవారు. కోటనందూరు లో కూడా టీడీపీకి ఎదురుదెబ్బలు తగలడంతో ఇక అక్కడ యనమల హవాకి అడ్డుకట్ట పడిపోయింది. ఈ నేపథ్యంలో తుని టీడీపీలో యనమల తర్వాత ఎవరూ అనేది కూడా ఆసక్తికరమే. రాజకీయంగా ఇది కీలక పరిణామంగానే చెప్పాలి.

Also Read : Kakinada Corporation – కాకినాడ మేయర్‌గా శివప్రసన్న ?