iDreamPost
android-app
ios-app

ఇన్‌ఛార్జిలకు సహకరించేదెవరు..?

  • Published Oct 02, 2020 | 5:17 AM Updated Updated Oct 02, 2020 | 5:17 AM
ఇన్‌ఛార్జిలకు సహకరించేదెవరు..?

హమ్మయ్య ఓ పనైపోయింది.. టీడీపీ పార్లమెంటరీ ఇన్‌ఛార్జులను నియమించేసారు. ఇక రాష్ట్రాధ్యక్ష పదవి కూడా ప్రకటించేస్తే ఆ పనికూడా పూర్తయిపోతుంది.. ఓకే అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా పదవుల్లోకొచ్చిన వాళ్ళకు క్షేత్రస్థాయిలో సహకరించేదెవరు? అన్న ప్రశ్నే కొత్తగా పదవులు పొందిన వాళ్ళ మెదళ్ళను తొలిచేస్తోందట. రాష్ట్రంలో ఏఏ వర్గాలకు ప్రాధాన్యమిచ్చారన్న ప్రశ్న జనం నుంచి ఎదురవుతున్న నేపథ్యంలో సామాజికవర్గ ప్రయోగాన్నే చంద్రబాబు కూడా చేపట్టారు. అందులో భాగంగానే ఈ ఇన్‌ఛార్జి పదవులు కూడా కేటాయించినట్టు చెప్పుకొచ్చేసారు. అయితే ఇలా నియామకాలు పొందిన వాళ్ళు క్షేత్రస్థాయిలోకెళ్ళి ఏదైనా కార్యక్రమం చేద్దాముంటూ కలిసొచ్చే పరిస్థితులు కన్పించడం లేదన్న టాక్‌ విన్పిస్తోంది.

స్వయంగా పార్టీ అధినేత సెలవిస్తేనే కేడర్‌ లైట్‌ తీసుకుంటోందని, ఇక తమనెవరు పట్టించుకుంటారన్న భావనలో ఉన్నారట. గతంలో చంద్రబాబు సై్టల్‌ ఆఫ్‌ మోనటరింగ్‌ ఎలా ఉండేదో వారంతా గుర్తు చేసుకుంటున్నారట. తాను చెప్పిన టాస్క్‌లను ఎప్పటికప్పుడు పక్కాగా పూర్తి చేసి, ఆ ఫోటోలను పార్టీ సైట్‌లోకి అప్‌డేట్‌ చేయాలి. వాటిని పరిశీలించి ర్యాంకులు కేటాయిస్తుండేవారు. తద్వారా నాయకుల మధ్య పోటీ సృష్టించేవారు. దీంతో మీ నియోజకవర్గం వెనుకబడిందంటే మీ నియోజకవర్గం వెనుకబడిందంటూ నాయకుల మద్య జోరుగా చర్చలు జరుగుతుండేవి. ఇప్పుడు కూడా ఇటువంటిదేదైనా అమలు చేస్తే ర్యాంకుల కాదు కదా కనీసం పాస్‌మార్కులు కూడా రావని కొత్త ఇన్‌ఛార్జిలే వ్యాక్యానించడం ఇక్కడ గమనార్హం.

ఎక్కడో హైదరాబాదులో కూర్చుని బిగ్‌బాస్‌ మాదిరిగా ఆన్‌లైన్‌లోనుంచి మాత్రమే చంద్రబాబు ఆదేశాలిస్తున్నారు. వాటిని ఆయా ప్రాంతాల్లోని నాయకులు అమలు చేసేయాలంటూ సూచిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని కొత్త ఇన్‌ఛార్జిలు రాజధానిగా అమరావతినే ఉంచాలని ఆందోళనలూ గట్రా చేపడితే అక్కడి జనం నుంచి వచ్చే రియాక్షన్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం చంద్రబాబు తన అమరావతికే కట్టుబడి ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పిలుపులే ఇవ్వొచ్చు. అంటే కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇన్‌ఛార్జిలకు కత్తిమీద సామేనన్న వాదన విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమనించి అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని వారెంతగా నిలబెట్టుకుంటారో వేచి చూడాల్సిందే.