iDreamPost
iDreamPost
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేస్తున్న వైఎస్ షర్మిలకు శుభాకాంక్షలు చెప్పి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. చెప్పింది ‘ఆల్ ది బెస్ట్’ మాత్రమే అయినా.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఆ ఒక్క మాట కూడా సంచలనంగా మారింది. పీసీసీ చీఫ్ పదవి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బుధవారం బాధ్యతలు చేపడుతుంటే కనీసం స్పందించని వెంకట్ రెడ్డి.. రాష్ట్రంలో పోటీగా వస్తున్న మరోపార్టీకి అనుకూలంగా మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాలకు తెరలేపింది.
ఆహ్వానం అందింది.. కానీ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా జులై 8న వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు వైఎస్ షర్మిల. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు పార్టీ ఆవిర్భావ సభ జరుగుతోంది. ఈ క్రమంలో ఆ దారిలో వెళ్తూ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర కోమటిరెడ్డి ఆగారు. వైఎస్సార్ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ తనకు ఆహ్వానం అందిందని ఆయన చెప్పారు. వేడుకలకు రావాలని వైఎస్ అభిమానులు కోరగా.. కోమటిరెడ్డి సున్నితంగా తిరస్కరించారు. వైఎస్ గొప్ప నేత అని కొనియాడిన ఆయన.. వైఎస్ జయంతి సందర్భంగా భువనగిరిలో పెద్దాయనకు నివాళులు అర్పించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియాలో కూడా వైఎస్ పై కోమటిరెడ్డి పోస్టు పెట్టారు. ‘‘మహానేత మీరు.. మీతో నడిచిన ప్రతి అడుగులో ఒక్కో విషయం తెలుసుకున్నాను. రైతులకు అండగా ఉండడం.. పేద ప్రజలకు ఉచితంగా ఆరోగ్యం.. మీ ఆలోచన నుంచి పుట్టినవే. అలాంటి మీరు మాకు దూరం కావడం మా దురదృష్టం. కానీ తప్పకుండా మీరు చూపిన ప్రజా సంక్షేమం కోసమే ప్రతి క్షణం కృషి చేస్తాను’’ అని ఫేస్ బుక్ లో ఆయన పోస్టు చేశారు.
శుభాకాంక్షల వెనుక మర్మమేంటి?
పీసీసీ చీఫ్ పదవి కోసం గట్టిగా ప్రయత్నించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కానీ చివరికి భంగపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పగించింది ఏఐసీసీ. దీంతో తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి.. రేవంత్ కు పీసీసీ ఇవ్వడాన్ని ఓటుకు నోటుతో పోల్చారాయన. తెలంగాణ కాంగ్రెస్.. టీటీడీపీగా మారిపోతుందని వ్యాఖ్యానించారు. దీనిపై హైకమాండ్ సీరియస్ అవ్వడం, కోమటిరెడ్డి యూ టర్న్ తీసుకోవడం జరిగిపోయాయి. కానీ ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నది మాత్రం నిజం. ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారుతారంటూ గతంలోనే వినిపించింది. బీజేపీలోకి చేరేందుకు కూడా ప్రయత్నించారు. కానీ తర్వాత వెనక్కి తగ్గారు. వైఎస్ అంటే అభిమానం ఉన్నా.. కాంగ్రెస్ లోనే ఉండిపోయారు వెంకట్ రెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన కార్యక్రమం బుధవారం జరగింది. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన ప్రోగ్రామ్ కు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క .. ఇంకా చాలా మంది హాజరయ్యారు. వెంకట్ రెడ్డి మాత్రం వెళ్లలేదు. కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. కానీ మరుసటి రోజే షర్మిలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దీంతో కోమటిరెడ్డి పార్టీ మారుతారంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లోనే ఉంటానని ఆయన చెబుతున్నా.. ఆ పార్టీని వీడే అవకాశాలు లేకపోలేదని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. షర్మిలకు విషెస్ చెప్పడం ద్వారా.. భవిష్యత్ లో అయినా వైఎస్సార్ పార్టీలో చేరుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఆయన రాష్ట్రంలో మరో రాజకీయ చర్చకు తెరలేపారన్నది మాత్రం నిజం. ఆయన పార్టీ మారితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే. ఆ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కు మంచి పట్టుంది మరి.
Also Read : వివాదాలొద్దు.. రైతే ముద్దు.. జల వివాదంపై కుండబద్ధలు కొట్టిన జగన్