iDreamPost
iDreamPost
పంచర్ అయిన ‘సైకిల్’ను ఏడేళ్లు తొక్కి తొక్కి అలసిపోయిన టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ మొత్తానికి ‘కారు’ ఎక్కారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎల్.రమణపై కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. పార్టీలో చేనేత వర్గ నేత వెలితి ఉండేదని, రమణ రాకతో అది తీరిపోయిందని చెప్పారు. 25 ఏళ్లుగా రమణ తనకు స్నేహితుడని, ఏ పార్టీలో ఉన్నా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే వ్యక్తి అని కొనియాడారు. చేనేత వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పిన కేసీఆర్.. రమణకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామన్నారు. మంచి పదవి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఇది కాస్తా హాట్ టాపిక్ అయంది. రమణకు ఇచ్చే పదవి ఏంటన్న చర్చ టీఆర్ఎస్ లో మొదలైంది.
మంత్రి పదవి వరించనుందా?
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో సీఎంతో సహా 17 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం శాసన సభలోని మొత్తం సీట్ల సంఖ్యలో 15 శాతం వరకు కేబినెట్ లో మంత్రులు ఉండొచ్చు. అంటే 18 మంది దాకా ఉండొచ్చు. ఆ లెక్క ప్రకారం చూస్తే.. మరొకరిని కేబినెట్ లోకి చేర్చుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో ఏర్పడ్డ ఖాళీ మాత్రమే. దీంతో ఆ మంత్రి పదవి ఎల్.రమణకే వస్తుందని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. చేనేతకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని లీడర్లు గుర్తు చేసుకుంటున్నారు. రమణను కేబినెట్ లోకి తీసుకునేందుకే అలా చెప్పారని అంటున్నారు.
టెస్కో చైర్మన్ గిరీనా?
ఇక రమణకు తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంఘం (టెస్కో) చైర్మన్ గిరీ ఇచ్చే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. విభజన చట్టం ప్రకారం ఆప్కో నుంచి విడిపోయి 2016లో టెస్కో ఏర్పాటయ్యింది. తెలంగాణలోని చేనేత రంగ అభివృద్ధి కోసం దీన్ని ఏర్పాటు చేశారు. దీని కింద 380 ప్రాథమిక చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, కరీంనగర్ లలో ప్రధాన చేనేత క్లస్టర్లు ఉన్నాయి. వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు ఎల్.రమణను నియమించవచ్చని తెలుస్తోంది. కష్టాల్లో ఉన్న నేతన్నలను ఆదుకునేందుకు చేనేత వర్గానికి చెందిన వ్యక్తికే బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉందని నేతలు చర్చించుకుంటున్నారు. అయితే అంతిమంగా కేసీఆర్ నిర్ణయమేంటనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read : తాను ఏ పార్టీలో ఉన్నానో తనకే తెలియదంటున్న డీఎస్