iDreamPost
android-app
ios-app

తెలంగాణ నుంచి మ‌రొక‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వి..?

తెలంగాణ నుంచి మ‌రొక‌రికి కేంద్ర మంత్రి ప‌ద‌వి..?

తెలంగాణ‌లో దూకుడు మీదున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇదే అదునుగా వ‌చ్చే అసెంబ్లీ నాటికి టీఆర్ఎస్ కు దీటుగా నిల‌బ‌డాల‌ని ఉవ్వి‌ళ్లూరుతోంది. దక్షిణాదిలో పాగా వేయటానికి ఉత్సాహంగా కదులుతున్న కమలదళం.. దానికి తగినట్టే రాష్ట్ర నేతలకు ప్రోత్సాహాన్నిచ్చే ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల కేంద్ర పెద్ద‌ల‌ను క‌లిసిన రాష్ట్ర నేత‌ల మ‌ధ్య ఈ మేర‌కు కీల‌క చ‌ర్చ జ‌రిగిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. జీహెచ్ఎంసీ లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా గ‌ట్టిగా దృష్టి పెడితే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌నే భావ‌న ఆ పార్టీ వ‌ర్గాల్లో ఉంది. అది జ‌ర‌గాలంటే ఇప్ప‌టి నుంచే పార్టీని విస్త‌రించ‌డంతో పాటు తెలంగాణ‌కు త‌గిన స్థానం క‌ల్పించాల‌నే యోచ‌న‌లో ఢిల్లీ పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు రాష్ట్ర నేత‌ల‌కు ఓ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలంగాణ నుంచి మ‌రొక‌రికి మంత్రి ప‌ద‌వి ఇచ్చే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లో ఎంపీల్లో ఒక‌రికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మో లేదా, కొత్త వారిని రాజ్య‌స‌భ‌కు పంపించి మంత్రిని చేయ‌డ‌మో చేస్తార‌ని చ‌ర్చ న‌డుస్తోంది.

ఆ రెండు ఫ‌లితాల‌తో రెట్టింపైన ఉత్సాహం

ప్రస్తుతం కేంద్ర మంత్రి వర్గం లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరు మాత్రమే ఉన్నారు. గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సికింద్రాబాద్ నుంచి ఎన్నికైన కిష‌న్ రెడ్డికి హోం శాఖ స‌హాయ మంత్రిగా అవ‌కాశం ద‌క్కింది. ఆయ‌న మాత్ర‌మే ఇప్పుడు కేంద్ర మంత్రి హోదాలో కొన‌సాగుతున్నారు. తెలంగాణ‌లో బీజేపీ నేత‌ల‌ను ఉత్సాహ‌ప‌ర‌చాలంటే కిష‌న్ రెడ్డికి శాఖ మార్చి ప్ర‌మోష‌న్ ఇవ్వ‌డంతో పాటు.. కొత్తగా ఇంకొక‌రికి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. గతంలో ఎన్డీయే హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి పలువురికి మంత్రి పదవులు దక్కాయి. బీజేపీకి మిత్రపక్షం గా ఉన్న టీడీపీకి కూడా కేంద్రం లో చోటు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మిత్ర పక్షాలు లేవు. జనసేన ఉన్నా ఆ పార్టీ కి ఎంపీలు లేరు.. అయిన‌ప్ప‌టికీ దుబ్బాక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కొత్త ఉత్సాహం తో కేడ‌ర్ ను మ‌రింత ఉత్సాహ ప‌రిచి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి గ‌ట్టి పోటీ ఇచ్చేలా సంసిద్ధం చేయాలంటే తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రాముఖ్యం ఇవ్వాలనే ఆలోచన ఆ పార్టీ చేస్తోందని ప్రచారం నడుస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ నుండి మరొకరికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఎవ‌రికి ఆ అవ‌కాశం..?

ఈ విష‌యం ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్పటి నుంచీ ఆ అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుంద‌న్న పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది. ఓ దశలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి పదవి ఇస్తారని ప్రచారం కూడా సోషల్ మీడియాలో పుష్కలంగా జరుగుతోంది. అయితే పార్టీ అధ్యక్షులుగా ఉన్న వారిని మంత్రి వర్గం లోకి తీసుకోరు. సంజయ్ కి మంత్రి పదవి ఇస్తే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పు కోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో కమలదళం దూకుడుగా పోతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మ‌రో వైపు పార్టీ పదవుల్లో తెలంగాణ బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో మంచి అవకాశమే దక్కింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ‌ , ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడిగా లక్ష్మణ్ కి అవకాశం ఇచ్చిన పార్టీ, డీకే అరుణని కర్ణాటక రాష్ట్ర సహా ఇంచార్జ్ గా, పొంగులేటి సుధాకర్ రెడ్డిని తమిళనాడు సహఇంచార్జి గా, సీనియర్ నేత మురళీధర్ రావు ను మధ్య ప్రదేశ్ ఇంచార్జి గా నియమించింది. ఇదే క్ర‌మంలో కీల‌క‌మైన నేత‌ల‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ద్వారా రాష్ట్రానికి బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని ఇటు పార్టీలోను, అటు ప్ర‌జ‌ల‌లోను క‌లిగించే ఆలోచ‌న‌లో అధిష్ఠానం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో..? బీజేపీలో ఎటువంటి మార్పులు జ‌ర‌గ‌నున్నాయో వేచి చూడాల్సిందే.