Idream media
Idream media
తెలుగు రాష్ట్రాలలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బిజెపి కేంద్ర నాయకత్వం ఏపీ,తెలంగాణలకు చెందిన పలువురు నేతలకు జాతీయ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది.అందులో భాగంగా భాజపా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలకు పార్టీ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది.
బిజెపి జాతీయ నాయకత్వం తమ నూతన కార్యవర్గంలో కొత్త వారికి అవకాశం కల్పించింది.తెలంగాణకు చెందిన డీకే అరుణ, ఏపీకి పురంధేశ్వరికి జాతీయ పార్టీ కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టింది. తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ఆశించిన డీకే అరుణను జాతీయ ఉపాధ్యక్ష పదవితో సంతృప్తి పరచింది.కాగా తెలంగాణకు చెందిన బిజెపి ప్రముఖులలో ఒకరైన లక్ష్మణ్‌ను పార్టీ ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడి పదవి వరించింది.ఇక ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరికి కూడా బిజెపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో చోటు దక్కింది.అలాగే ఏపీ నుండి మరో నేత సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు.
జాతీయ కార్యవర్గంలో డీకే అరుణకి అవకాశం:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రి పదవులు చేపట్టిన డీకే అరుణ తెలంగాణ ప్రాంత కీలక నేతగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైన దశలో కూడా ఆమె పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు.గత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పరాజయం పొందడంతో 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఆమె బిజెపిలో చేరిన నాటి నుంచి రాష్ట్ర అధ్యక్ష పదవిపై కన్నేశారు.తనకు ఆ పదవిలో అవకాశం కల్పిస్తే టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొని రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేస్తానని ఆమె పార్టీ నాయకత్వానికి విన్నవిస్తూ వచ్చారు.కానీ రాష్ట్ర అధ్యక్ష పదవిని మొదటి నుంచి పార్టీ జండా మోసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు అగ్రనాయకత్వం కట్టబెట్టింది.
కాగా డీకే అరుణకు వ్రతం చెడ్డ ఫలితం దక్కలేదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. అయితే టీఆర్ఎస్ను ధీటుగా విమర్శించడంతో పాటు మంచి వాగ్దాటి ఉన్న ఆమెకు కీలక పదవి దక్కడం గమనార్హం. సోషల్ ఇంజనీరింగ్ పై దృష్టి పెట్టిన బిజెపి జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కీలక సామాజిక వర్గానికి చెందిన డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షుల జాబితాలో చోటు కల్పించింది.అయితే రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా సంతృప్తి చెందుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
పురందేశ్వరికి కీలక పదవి:
ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీ పరిస్థితి మిగతా జాతీయ పార్టీల కంటే భిన్నంగా ఏమీ లేదు.గత లోక్‌సభ ఎన్నికలలో దేశమంతా నరేంద్ర మోడీ అనుకూల పవనాలు వీచిన కనిపించిన ఏపీలో మాత్రం బిజెపి నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించింది. దీంతో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన జాతీయ నాయకత్వం రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ పై కసరత్తు చేసినట్లు కనిపిస్తుంది.. అందులో భాగంగా ఏపీ రాష్ట్ర బిజెపి అధ్యక్ష పదవిని కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు కట్టబెట్టింది.ఇక రాష్ట్రంలో మరో కీలక కమ్మ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరికి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఉండే ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత జగన్ సర్కార్‌ను విమర్శించే విషయంలో బిజెపి దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా పురంధేశ్వరికి పార్టీలో కీలక స్థానం కల్పించడంతో ఏపీ రాజకీయాలలో ఆమె కూడా ముఖ్య భూమిక పోషించే అవకాశం ఉంది.