జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. జనగణన పూర్తయ్యేలోపు విభజనకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియను పూర్తి చేసి నోటిఫికేషన్ కు సిద్ధం కావాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అయితే జనగణన ఉన్నప్పుడు ప్రక్రియ చేపట్టడం మంచిది కాదని అధికారులు పేర్కొనడంతో ఆయన ప్రాథమిక కసరత్తు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. దీంతో పరిపాలన సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుందని చెప్పాలి. ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. జిల్లాల పునర్విభజన కోసం గతంలో ఒక రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయగా దానికి ప్రత్యేక సంఘాలు, జిల్లా కమిటీలను కూడా ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటు చేసి పలు కీలక వివరాలు సేకరించింది.
కొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు ఆస్తులు, భూముల వివరాలు సేకరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో వివిధ శాఖల ఏర్పాటుకు కావలసిన కార్యాలయాలు ఏ మేరకు సరిపోతాయని దానిపై పరిశీలన జరిపారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను ముందు 25 పార్లమెంటు స్థానాలు కలిపి 25 జిల్లాలుగా విభజించాలి అని అనుకున్నారు. కానీ 26 జిల్లాలుగా ఏర్పాటు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ముందు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో వైసీపీ ప్రకటించగా అరకు పార్లమెంటుని మరికొన్ని జిల్లాల్లో ప్రాంతాలను కలిపి రెండు జిల్లాల గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న జిల్లాలతో పాటు ఏపీలో మరో 13 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది .కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాలు చూస్తే అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు(విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా), నరసరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా) జిల్లాలుగా విభజిస్తున్నారు అని తెలుస్తుంది. అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
Also Read : Cm Jagan ,Central Government – విభజన చట్టంలో హామీ,జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సై.