iDreamPost
android-app
ios-app

AIADMK Disputes – అన్నాడీఎంకే పరిస్థితి ఇలా తయారైందేంటి…?

  • Published Nov 06, 2021 | 1:36 PM Updated Updated Nov 06, 2021 | 1:36 PM
AIADMK Disputes – అన్నాడీఎంకే పరిస్థితి ఇలా తయారైందేంటి…?

ఒకప్పుడు అధికార వైభవం అనుభవించిన తమిళనాడు ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే పరిస్థితి మూడుముక్కలాట చందంగా తయారైంది. పార్టీలో ఒకవైపు ఆధిపత్య పోరు, మరోవైపు శశికళ ముప్పు, ఇంకోవైపు హైకోర్టు డెడ్ లైన్ ఇరకాటంలోకి నెట్టాయి. అంతర్గత సంక్షోభం కారణంగానే మూడేళ్లుగా సంస్థాగత ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే డిసెంబరు 31లోగా ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు డెడ్ లైన్ విధించడంతో పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఎన్నికలు నిర్వహిస్తే గొడవలు జరుగుతాయని భయం.. నిర్వహించకపోతే కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుంది.

ఏడేళ్లుగా ఎన్నికల్లేవు

అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికలు ఐదేళ్లకోకసారి నిర్వహించాల్సి ఉంది. చివరిసారి 2014లో జరిగాయి. ఆ ఎన్నికల్లో జయలలిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. లెక్క ప్రకారం 2019లో మళ్లీ ఎన్నికలు జరగాలి. జయ తదనంతరం పార్టీలో తలెత్తిన విభేదాలు, గోడవలను దృష్టిలో ఉంచుకుని నిర్వహించలేదు. 2020లో కరోనా, 2021లో కరోనా సెకండ్ వేవ్, అసెంబ్లీ ఎన్నికల కారణంతో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు జరిపించాలని కోరుతూ పార్టీ నాయకుడొకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన కోర్టు డిసెంబర్ 31లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది.

Also Read : Indian Navy – AP Executive Capital : ఏపీ కార్యనిర్వాహక రాజధాని విశాఖ.. గుర్తించిన ఇండియన్‌ నేవీ

అగ్రనేతలకు శిరోభారం.. 

పార్టీ ఇప్పటికే రెండు గ్రూపులుగా విడిపోయింది. ఆధిపత్యం కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. గతంలో ఇవి కోర్టుకెక్కడంతోనే న్యాయస్థానం ఆదేశాలతో సమన్వయ కమిటీని వేశారు. సమన్వయకర్త, ఉప సమన్వయకర్తలుగా ఉన్నా పన్నీరు సెల్వం, పళనిస్వామిలకు అనుకూలంగా పార్టీ విడిపోయింది. ఇప్పుడు ఆ రెండు పదవులతోపాటు.. ఇతర కిందిస్థాయి పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే పార్టీ నాయకులు తీవ్రంగా పోటీ పడి గొడవలు జరిగే పరిస్థితి ఉంది.

మరోవైపు శశికళ విషయంలోనూ విభేదాలు ఉన్నాయి. ఆమెను పార్టీలోకి రానిచ్చేదిలేదని పళనిస్వామి వర్గం స్పష్టం చేస్తుంటే.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని పన్నీరుసెల్వం వర్గం అంటోంది. అటు చూస్తే శశికళ రాష్ట్ర పర్యటన చేస్తూ జిల్లాల్లో అన్నాడీఎంకే కార్యకర్తలతో మంతనాలు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగత ఎన్నికల నిర్వహణ కత్తి మీద సాముగా పరిణమించింది. కానీ కోర్టు డెడ్ లైన్ ఉన్నందున వాయిదా వేసే అవకాశం లేకపోవడంతో ఈ నెల పదో తేదీన ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలను ప్రకటించేందుకు పన్నీరు, పళనిస్వామిలు సిద్ధం అవుతున్నారు.

Also Read : UP Elections – ప్రచార సారధుల పోటీపై సందిగ్ధత!