Idream media
Idream media
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌పై వివాదం నెలకొంది. స్వస్తిక్ గుర్తుతోపాటు పోలింగ్ కేంద్రం నంబర్ సూచించే గుర్తు, పెన్నుతో గీచినా కౌటింగ్‌లో పరిగణలోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్ ముగిసన తర్వాత నిర్వహించిన సమావేశంలో పలు కౌటింగ్ కేంద్రాలలో పొరపాటున స్వస్తిక్ ముద్రకు బదులు పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని పోలింగ్ సిబ్బంది ఈసీకి తెలియజేశారు. దీనికి పరిష్కారంగా ఏ గుర్తుతో ఓటు వేసినా పరిగణలోకి తీసుకోవాలని ఈసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముద్ర మారినా ఓటర్ల ఎంపిక మారదంటూ ఈసీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
అయితే ఈసీ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అధికార టీఆర్‌ఎస్‌తో ఈసీ కుమ్మక్కయిందంటూ ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. న్యాయస్థానాలను ఆశ్రయించే సమయం లేకుండా అర్థరాత్రి సర్కూలర్ జారీ చేశారంటూ మండిపడ్డారు. పోలింగ్ రోజు సాయంత్రం 4–5 గంటల మధ్య బూత్‌లలో అక్రమాలు జరిగాయని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అందుకే పోలింగ్ తుది శాతాన్ని ఆలస్యంగా ప్రకటించారన్నారు.
ఈసీ నిర్ణయంపై బీజేపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ జారీ చేసింది. నిబంధనల ప్రకారం స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లనే లెక్కింపులో పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఏ ముద్రతో వేసినా ఓట్లను లెక్కింపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని, ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమంటూ బీజేపీ తన పిటిషన్‌లో పేర్కొంది.
ఓ వైపు కౌటింగ్ ప్రారంభం అయింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. బ్యాలెట్ ఓట్లను కట్టలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్రలతో వేసిన ఓట్లను కూడా పరిగణలోకి తీసుకోవాలన్న ఈసీ నిర్ణయంపై బీజేపీ కోర్టును ఆశ్రయించడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది.