iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల విభజన చుట్టూ ఇప్పుడు పెద్ద చర్చ సాగుతోంది. ఇంకా చెప్పాలంటే రచ్చకు శ్రీకారం పడింది. వివిధ ప్రాంతాల్లో జిల్లాలు కావాలని, ఆయా జిల్లాలకు ఫలానా పేర్లు పెట్టాలని, తమ ప్రాంతాలను అందులో కలపాలని ఇలా వివిధ డిమాండ్లు వినిపిస్తున్నాయి. జిల్లాల విభజన అంశం మీద ఇప్పుడు హఠాత్తుగా తెరమీదకు రావడమే ఆసక్తికరమే. ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ కొందరు పాలకపక్ష నేతల వ్యాఖ్యల ఆధారంగా ప్రజల్లో కొత్త జిల్లాల అంశం వేడి రాజేస్తోంది. కొన్ని చోట్ల కార్యాచరణ కూడా మొదలయ్యింది.
ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటుపై వైఎస్సార్సీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలోనే చెప్పింది. సీఎం జగన్ కూడా ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు పాదయాత్రలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాంతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ 25 జిల్లాలుగా విభజన ఖాయమని తేలిపోయింది. దానికి అనుగుణంగా తొలి ఏడాదిలోనే కొంత కసరత్తు కూడా జరిగింది. రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన ప్రక్రియ చేపట్టారు. అయితే పాలనా వికేంద్రీకరణ కారణంగా మూడు రాజధానుల అంశం ముందుకు రావడంతో కొత్త జిల్లాల ఏర్పాటు తాత్కాలికంగా నిలిచిపోయింది.
చంద్రబాబు వెనకడుగు..
రాష్ట్ర విభజన తర్వాత తొలి ప్రభుత్వంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు అంశం ముందుకొచ్చింది. చంద్రబాబు సర్కారు కొంత ప్రయత్నం కూడా చేసింది. కానీ అనూహ్యంగా వెనక్కి తగ్గింది. ఏపీలో 13 జిల్లాల స్థానే మరో కొత్త జిల్లా ఏర్పాటు చేసి 14 జిల్లాలు చేయాలని అభిప్రాయ సేకరణకు సైతం సిద్ధపడింది. అందులో భాగంగా పోలవరం ముంపు మండలాల పేరుతో 7 మండలాలు తెలంగాణా నుంచి వచ్చి చేరడం, ఇక తూర్పు, పశ్చిమ ఏజన్సీ మండలాలను కలిపి కొత్త జిల్లా ఏర్పాటు కోసం చంద్రబాబు మొగ్గు చూపారు. దానికి అనుగుణంగా రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు అవుతుందని ఊహాగానాలు వినిపించాయి. నాటి మంత్రులు కూడా దానికి అనుగుణంగా ప్రకటనలు చేశారు. కానీ తీరా చంద్రబాబు తన నిర్ణయంపై వెనకడుగు వేశారు. అభిప్రాయ సేకరణ హఠాత్తుగా నిలిపివేశారు. దానికి అప్పట్లో జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వచ్చిన వ్యతిరేకతే కారణం. పూర్తిగా గిరిజన మండలాలతో కలిపి జిల్లా ఏర్పాటు చేస్తే వన్ ఆఫ్ సెవంటీచట్టం తమను చుట్టుముడుతుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది.
మెడికల్ కాలేజీల కోసం కొత్త జిల్లాలు..
ఏపీ ప్రభుత్వం కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రజా వైద్య రంగాన్ని బలోపేతం చేసే దిశలో సాగుతోంది. అందుకు అనుగుణంగా ప్రతీ పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే ఆశిస్తోంది.ఇ ప్పటికే కొన్ని కాలేజీలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. అయితే ఇప్పటికే మెడికల్ కాలేజీ ఉన్న జిల్లాలో కొత్త కాలేజీ ఏర్పాటు చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. మెడికల్ కాలేజీ లేని జిల్లాలో అయితే కేంద్రం నుంచి మెజార్టీ వాటా వస్తుంది. తద్వారా జగన్ ప్రభుత్వానికి అది కొంత ఊరటనిస్తుంది. దాంతో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం జిల్లాల విభజన అంశం మరోసారి ముందుకొచ్చింది. ఉదా. గుంటూరు జిల్లాలో మెడికల్ కాలేజీ ఉంది. గురజాలలో కొత్తగా కాలేజీ ఏర్పాటు కోసం ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తయ్యింది. నర్సారావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తే గురజాల మెడికల్ కాలేజీకి కేంద్రం నుంచి 70 శాతం వరకూ నిధులు వచ్చే అవకాశం ఉంది. లేదంటే రాష్ట్రప్రభుత్వమే 90శాతం వెచ్చించాలి. ఇలాంటి పరిస్థితి అన్ని జిల్లాల్లో ఉన్న తరుణంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చర్చల్లోకి వచ్చింది.
జనాభా లెక్కల పేరుతో కేంద్రం అడ్డంకులు
ప్రతీ పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన కోసం కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అందులో ప్రధానమైనది జిల్లాల సరిహద్దుల సవరణకు తాత్కాలికంగా బ్రేకులు వేయడం. జనాభా లెక్కలను జిల్లాల లెక్కన పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ప్రక్రియ మధ్యలో జిల్లాల సరిహద్దులు మారిస్తే సమస్య అవుతుందని కేంద్రం భావించింది. దానికి అనుగుణంగా వచ్చే ఏడాది అంటే 2021 ఏప్రిల్ 30 వరకూ జిల్లాల విభజనకు బ్రేకులు వేసింది. ఈ ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వ ఆశలపై నీళ్లు జల్లాయి. మెడికల్ కాలేజీల కోసం జిల్లాల విభజన అంశం ముందుకొచ్చినా అడుగు వేయలేని స్థితికి తెచ్చాయి.
వైఎస్సార్సీపీ నేతల ప్రకటనలతో ఊపందుకున్న ప్రచారం
ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి వారు జిల్లాల విభజన అంశాన్ని ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లాని విభజించే ఆలోచన ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. దానికి స్పీకర్ తమ్మినేని కూడా వంతపాడారు. ఇక ఇతర ప్రాంతాల్లో కూడ పలువురు అధికార పార్టీ నేతలు కూడా జిల్లాల విభజన విషయంలో చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. ఇక విపక్షాలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రజల్లో కదలిక వచ్చింది. అధికారికంగా ఎటువంటి ప్రకటన లేనప్పటికీ ఇలాంటి చర్చ ఊపందుకోవడం ఇప్పుడు కీలకాశం. కేంద్రం ఆదేశాలు , రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు వేరుగా ఉండడం వంటి వివిధ కారణాలతో ప్రస్తుతానికి జిల్లాల విభజన అంశం వెంటనే పూర్తయ్యే అవకాశం లేదు. రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తిగా అందరికీ ఇళ్ల పథకంలో భూసేకరణలోనే బిజీగా గడుపుతున్నారు. ఈ తరుణంలో జిల్లాల విభజన చుట్టూ చర్చ సాగడం విస్మయకరంగా మారింది.