పైకేదో సులభంగా వారసత్వ పోకడనో మరొకటనో అనేస్తాం కానీ నిజానికి సినిమా పరిశ్రమలో గొప్ప స్థాయికి చేరుకున్నవాళ్లందరి పిల్లలు తండ్రుల పేరు నిలబెట్టేంత ఎత్తులు చేరుకోలేదన్నది వాస్తవం. అది కొందరికి మాత్రమే సాధ్యమయ్యింది. అందులోనూ హీరోల విజయ గాధలే ఎక్కువ కనిపిస్తాయి కానీ సుప్రసిద్ధ దర్శకుల కొడుకులు ఆశించిన శిఖరాలు అందుకోలేకపోవడం మాత్రం విచిత్రమే అనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలు చూద్దాం. 150 సినిమాలకు దర్శకత్వం వహించి చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న దాసరి నారాయణరావు గారు వారబ్బాయి అరుణ్ కుమార్ ని హీరోగా సెటిల్ చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు.
స్వంత బ్యానర్ మీద 1998లో గ్రీకువీరుడుతో లాంచ్ చేస్తే అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. బయటి నిర్మాతలు కూడా చెప్పుకోదగ్గ సినిమాలు తీశారు కానీ ఏవీ కనీస స్థాయిలో ఆడలేదు. చిన్నా, పెళ్ళివారమండి, ఒరేయ్ తమ్ముడి లాంటివి కొన్ని చిత్రాలు తీశారు కానీ అన్నీ ఫ్లాపే. ఆ మధ్య విలన్ గా ట్రై చేద్దామని అల్లు శిరీష్ ఒక్క క్షణం, శైలజారెడ్డి అల్లుడులో నటిస్తే వాటి ఫలితాలు కూడా అంతంతే. ఇక రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ ని ఉషాకిరణ్ బ్యానర్ పై 2002లో నీతో అనే సినిమాతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అది వచ్చిన విషయం కూడా ఎవరికీ గుర్తు లేదు. దర్శకుడిగా బొమ్మలాట, అనగనగా ఒక ధీరుడు, సైజ్ జీరో సినిమాలు ఘోరంగా దెబ్బ కొట్టాయి.
రెండేళ్ల క్రితం కంగనా రౌనత్ తో తీసిన జడ్జ్ మెంటల్ హై క్యా కూడా సోసోగానే పోయింది. ఇక తను నాన్న లెగసిని కొనసాగించడం జరగని పనని అర్థమవుతోంది. కమర్షియల్ సినిమాలతో చిరంజీవి లాంటి అగ్ర హీరోలకు ఖైదీలాంటి బ్రేక్ ఇచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించిన కోదండరామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ కూడా తెలుగులో తన ఉనికిని చాటుకోలేకపోయాడు. గొడవ అనే సినిమా అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. కాస్కోని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఉన్నంతలో ఇతనికి తమిళంలో మంచి కెరీర్ దక్కింది. ఇలా టాలీవుడ్ హిస్టరీలో గొప్ప పేజీలు రాసుకున్న డైరెక్టర్ల వారసులకు ఇలా జరగడం విచిత్రమే.