iDreamPost
iDreamPost
ప్రభుత్వ వ్యవస్ధల పనితీరుపై ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం రాసే కొత్తపలుకులో విపరీతంగా బాధపడిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కీలకమైన పోస్టింగుల కోసం ఐఏఎస్, ఐపిఎస్ ఉన్నతాధికారులు కూడా స్వామి భక్తిని ప్రదర్శించటంలో పోటి పడుతున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. నియమ, నిబంధనలను కాలరాసైనా సరే అధికారపార్టీ చెప్పినట్లు నడుచుకోవాలన్న ఉద్దేశ్యంతో చివరకు రూల్సుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు రాధాకృష్ణ వాపోవటమే విచిత్రంగా ఉంది.
జగన్ హయాంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు గులాంగిరీ చేస్తున్నారని చెప్పిన ఇదే రాధాకృష్ణ తెలుగుదేశంపార్టీ హయాంలో చంద్రబాబునాయుడుకు ఎలా సాగిలపడ్డారో మరచిపోయినట్లున్నాడు. టిడిపి ప్రభుత్వంలో డిజిపిలుగా పనిచేసిన నలుగురిలో ఇద్దరి పనితీరు అత్యంత వివాదాస్పదమైన విషయం మరచిపోయినట్లున్నాడు. టిడిపి ఐదేళ్ళ కాలంలో జేవి రాముడు, సాంబశివరావు, మాలకొండయ్య, ఆర్పి ఠాకూర్ డిజిపిలుగా పనిచేశారు. వీరిలో జేవి రాముడు, ఠాకూర్ వ్యవహారశైలితో పోలీసు శాఖ ఏ విధంగా గబ్బు పట్టిందో అందరూ చూసిందే.
రాముడు, ఠాకూర్ పోలీసులు బాసులుగా కాకుండా దాదాపు పార్టీ నేతలుగానే చెలామణయ్యారు. వైజాగ్ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం జరిగితే ఠాకూర్ స్పందించిన విధానాన్ని ఎవరైనా మరచిపోగలరా ? ఘటన జరిగిన అర్ధగంటలోనే తనపై హత్యాయత్నాన్ని జగనే చేయించుకున్నాడనే అర్ధం వచ్చేట్లుగా ఠాకూర్ మీడియాతో చెప్పటం సంచలనమైంది. నిందితుడు శ్రీనివాస్ జేబులోని మడత నలగని లేఖలోని అంశాలను కూడా ఠాకూర్ మీడియాకు చదివి వినిపించాడు.
ఇక రాముడు వ్యవహారం కూడా అత్యంత వివాదాస్పదమైంది. అనంతపురం జిల్లాలోని ధర్మవరం అసెంబ్లీకి టిడిపి తరపున పోటి చేయటానికి రాముడు ప్రయత్నాలు చేసుకున్నట్లు అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. రాముడుది కూడా అనంతపురం జిల్లాలోనే కావటంతో మంత్రి, ఎంఎల్ఏలు, ఎంపి మాటకన్నా రాముడు ఈయన మాటకే చంద్రబాబు ఎక్కువ విలువిచ్చేవాడనే గోల పార్టీలో అప్పట్లో బాగా జరిగింది. జిల్లాలోని రాప్తాడు మండలంలో వైసిపి నేత ప్రసాద్ రెడ్డి హత్య జరిగింది. అలాగే కృష్ణా జిల్లాలోని ముసునూరు ఎంఎఆర్వోగా పనిచేసిన వనజాక్షిపై అప్పటి ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ దాడి ఘటన కానీ రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. పై రెండు ఘటనల్లో కూడా టిడిపి నేతలపై ఎటువంటి చర్యలు లేవంటే కారణం ఎవరో అందరికీ తెలిసిందే.
అలాగే సాంబశివరావు విషయం కూడా వివాదాస్పమైంది. ఉద్దేశ్యపూర్వకంగానే వైసిపి నేతలను ఇబ్బందులు పెడుతున్నాడంటూ మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇటు సాంబశివరావు, అటు ఠాకూర్ పై ఎన్నిసార్లు ఆరోపణలు చేశాడో లెక్కేలేదు. డిజిపి పోస్టులకు రాజీనామాలు చేసి నేరుగా టిడిపిలోనే చేరిపోమ్మంటూ వైసిపి నేతలు చాలాసార్లు మండిపడిన విషయం కూడా తెలిసిందే.
వీళ్ళ వ్యవహారం ఇలాగుంటే ఇంటెలిజెన్స్ ఐజిగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు పనితీరు గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుంది. చంద్రబాబు కుడిభుజంగా వ్యవహరించి అప్పటి 23 మంది వైసిపి ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించటంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలకు కొదవే లేదు.అప్పటి వైసిపి ఎంఎల్ఏల ఫోన్లను ట్యాపింగ్ లో పెట్టి వేధించేవాడంటూ వైసిపి నేతలు ఎంతగా గోల చేశారో అందరూ చూసిందే. ఇవన్నీ అప్పటి ఐపిఎస్ లు ఎందుకు చేశారు ? కేవలం పోస్టింగును కాపాడుకోవటానికే అన్న విషయం రాధాకృష్ణకు తెలీదా ?
టిడిపి హయాంలో ఎంతమంది ఎంఎల్ఏలు, నేతల మీద కూడా ఎన్నో కేసులు బుక్ చేశారు. అవన్నీ చంద్రబాబునాయుడును సంతోషపెట్టటానికి మాత్రమే చేశారు. అలాగే ఎన్నికల సమయంలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనీల్ చంద్ర పునేతను ఎన్నికల సంఘం ఎందుకు హఠాత్తుగా బదిలి చేసింది ? ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా తాను చెప్పినట్లు కాకుండా కేవలం చంద్రబాబు ఆదేశాలను మాత్రమే పాటిస్తున్న కారణంగా మాత్రమే బదిలీ చేసిన విషయాన్ని ఎల్లోమీడియా మరచిపోయినట్లుంది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఇసి ఆదేశాలను మాత్రమే పాటించాలన్న కనీసం ఇంగితాన్ని పునేత ఎందుకు మరచిపోయాడు ? ఎందుకంటే మళ్ళీ చంద్రబాబే సిఎం అవుతాడన్న నమ్మకంతోనే ఇసిని కూడా ధిక్కరించి చివరకు దెబ్బ తిన్నాడు.
పోలీసులపై నమ్మకం లేదని ఇపుడు హై కోర్టు చెప్పినట్లే గతంలో వైసిపి నేతలు కూడా చెప్పేవారంటూ తప్పుడు అంశాన్ని రాశాడు రాధాకృష్ణ. ఏపి పోలీసులపై నమ్మకం లేదు కాబట్టే తెలంగాణా పోలీసులకే ఫిర్యాదులు ఇచ్చేవారట. ఏపి భూభాగం మీద నేరం జరిగితే ఎవరైనా తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు ఇస్తారా ? ఒకవేళ ఇచ్చిన తెలంగాణా పోలీసులు ఫిర్యాదును ఎలా తీసుకుంటారు ? తెలంగాణా భూభాగం మీద నేరాలు జరిగినపుడు సదరు కేసులను ఏపికి బదిలీ చేయవద్దని వైసిపి నేతలు కోరి ఉంటారంతే. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై జరిగిన హత్యాయత్నం, పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఎవరు దర్యాప్తు జరిపారో బహుశా రాధాకృష్ణ మరచిపోయాడామో?
మొత్తం మీద రాధాకృష్ణ మరచిపోయిన విషయం ఏమంటే టిడిపి హయాంతో పోల్చుకుంటే వైసిపి హయాంలోనే పోలీసులు స్వేచ్చగా పనిచేస్తున్నారని. ఎలాగంటే చంద్రబాబు హయాంలో ధౌర్జన్యాలకు దిగిన టిడిపి ఎంఎల్ఏలు, నేతలపై ఎక్కడా కేసులు నమోదు కాలేదు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే ఎంఎల్ఏలు కోటంరెడ్డి శ్రీధరెడ్డి, దాటిశెట్టి రాజా, దాక్టర్ శీదిరి అప్పలరాజు లాంటి అనేకమందిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులపై నిజంగానే ఒత్తిళ్ళుంటే అధికారపార్టీ ఎంఎల్ఏలు, నేతలపై కేసులు నమోదయ్యేవేనా ? ఏదో బురద చల్లాలన్న అత్యుత్సాహమే కానీ వాస్తవాలను దాచేయాలని ఎల్లీమీడియా ప్రయత్నిస్తే దాగేవి కాదని రాధాకృష్ణ మరచిపోయినట్లున్నాడు.