iDreamPost
iDreamPost
ఎయిడెడ్ విద్యాసంస్థల విషయమై టీడీపీకి ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తోంది. నారా లోకేష్ నుంచి చంద్రబాబు వరకూ రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఎయిడెడ్ విద్యావ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని కూడా అంటున్నారు. కానీ చంద్రబాబు తీరు మళ్లీ గురివిందలా మారడమే ఇక్కడ గమనించాల్సిన విషయం. అసలు ఎయిడెడ్ విద్యాసంస్థల కష్టాలకు మూలమే చంద్రబాబు. ఆయన సీఎంగా ఉన్న సమయంలోనే 2003లో ఎయిడెడ్ విద్యావ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం మొదలెట్టారు. ఎయిడ్ కోత విధించారు. 10 శాతం చొప్పున తగ్గించి ఎయిడెడ్ విద్యాసంస్థలకు నిధులు కేటాయించే ప్రక్రియను మొదలుపెట్టిన మహానుభావుడు చంద్రబాబు అన్నది లోకానికి తెలిసిన సత్యం.
ప్లెయిన్ స్పీకింగ్ అంటూ తను రాసిన పుస్తకంలో ఎయిడెడ్ విద్యా సంస్థలన్నీ ప్రైవేటు పరం చేయాలన్నది ఆయన మనసులో మాట. దానిని బయటపెట్టడమే కాకుండా మొత్తం ప్రభుత్వ విద్యారంగమే నాశనం చేసేందుకు పూనుకున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్సుడు కోర్టులు పెట్టి ఫీజులు గుంజడం అప్పుడే మొదలయ్యింది. హిస్టరీ వంటి సబ్జెక్టులు తీసేసి అసలు వాటితో అవసరం లేదని చెప్పిన సమర్థుడు చంద్రబాబు. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో నియామకాలు నిలిపివేసింది చంద్రబాబు. ఎయిడెడ్ సంస్థలకు బదులుగా ప్రైవేటు కార్పోరేట్ విద్యాసంస్థలను చంద్రబాబు ప్రోత్సహించిన తీరు లోకానికి బాగా ఎరుకే.
ప్రస్తుతం మాత్రం చంద్రబాబు నంగనాచిలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అదే సమయంలో నారా లోకేష్ అయితే అమ్మ ఒడి వద్దు- బడి ముద్దు అంటూ ఎవరో మాట్లాడిన వీడియో లు కూడా పోస్ట్ చేస్తున్నారు. అసలు అమ్మ ఒడి వద్దు అని టీడీపీ విధానంగా చెప్పగలుగుతుందా అనేది ఆయన సూటిగా స్పందిస్తే బాగుంటుంది. అమ్మ ఒడి వద్దు అని టీడీపీ చెప్పాలనుకుంటే దానిని స్పష్టంగా వెల్లడిస్తే అందరికీ అర్థమవుతుంది. కానీ ఇలా పరోక్షంగా ప్రజలకు మేలు చేసే పథకాలను తక్కువ చేయడం టీడీపీ నేతల తీరుని చాటుతోంది. అదే సమయంలో బడుల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నిమార్లు స్పష్టం చేసినా బాబు, ఆయన పుత్రుడితో పాటుగా దత్తపుత్రుడుగా పలువురు అభివర్ణిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా అదే పంథాలో స్పందించడం కూడా సాధారణ విషయంగానే భావించాలి.
Also Read : Galla Jayadev -గల్లా జయదేవ్ ఏమయ్యారు.?టీడీపీ శిబిరంలో కనిపించడం లేదెందుకు?
వాస్తవానికి ఎయిడెడ్ విద్యాసంస్థలకు బాబు ప్రభుత్వంలో మొదలయిన నిధులు కేటాయింపులో కోత రానురాను తీవ్రమయ్యింది. సిబ్బంది నియామకాలు నిలిపివేయడంతో సమర్థులైన ఉపాధ్యాయుల లేమి ఏర్పడింది. ఈపరిస్థితుల్లో ఎయిడెడ్ విద్యాసంస్థలను సరిదిద్దాలని ఏపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. వాటిని పూర్తిగా ప్రభుత్వ సంస్థలుగా మార్చి సకల సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పింది.
అయినప్పటికీ భూముల పేరుతో కొందరు ససేమీరా అంటే అన్ ఎయిడెడ్ గా మార్చుకునే ఆప్షన్ కూడా ఇచ్చింది. ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం బలవంతం చేయడం లేదని సీఎం పలుమార్లు స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సంస్థలు ప్రభుత్వ సంస్థలుగా రూపాంతరం చెందాయి. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. కొందరు మాత్రం అన్ ఎయిడెడ్ గా మార్చాలని చూస్తుండగా ప్రజల్లో అపోహలు పెరుగుతున్నాయి. దానిని సవరించి, జనాలకు నచ్చజెప్పే ప్రయత్నం ఆయా యాజమాన్యాలు చేయాల్సి ఉంటుంది.ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ కాదని, తామే ప్రైవేటుగా మారుస్తున్నామని చెప్పాల్సి ఉంది.విపక్ష నేతలు మాత్రం ప్రభుత్వ బడులను తీసేస్తున్నారన్నంతగా ప్రచారానికి పూనుకుంటున్నాయి.
ఎయిడెడ్ వ్యవస్థను నాశనం చేసింది పోగా, ఇప్పుడేదో వాటిని తొలగిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాటిని నామమాత్రపు ఫీజులు కూడా లేకుండా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థలుగా మార్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. పలు సంస్థలు స్వాధీనం కూడా చేసుకుంది. అది గిట్టని వారి ప్రచారం విష ప్రచారమే వాస్తవం కాదన్నది జనాలు గ్రహించకపోరు. విపక్షాల వాదననలో వాస్తవం లేదని తెలుసుకున్న సామాన్యులు సైతం చంద్రబాబు మొసలికన్నీటిని గుర్తించక మానరు.
Also Read : Dhulipalla Narendra Ponnur -ధూళిపాళ్లకు షాక్.. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో చెప్పండి?