iDreamPost
android-app
ios-app

పాపం అనసూయ.. నిజంగానే ఓడిందా ?గోల్ మాల్ జరిగిందా ?

పాపం అనసూయ.. నిజంగానే ఓడిందా ?గోల్ మాల్ జరిగిందా ?

ఎంతో కాలంగా చర్చనీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికకాగా ప్యానల్ లో కూడా దాదాపుగా మెజారిటీ సభ్యులు మంచు విష్ణు ప్యానల్ నుంచి గెలుపొందారు. అయితే ఎన్నికలలో అనసూయ వ్యవహారం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ భరద్వాజ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా పోటీ చేశారు. అనసూయ ఎన్నికలలో అత్యంత భారీ మెజారిటీతో గెలుపొందినట్లు ఆదివారం రాత్రి ఛానెళ్లలో స్క్రోలింగ్లు వచ్చాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి అనసూయ, కౌశిక్, సురేష్ కొండేటి, శివారెడ్డి గెలుపొందారు అని ఛానెళ్లలో స్క్రోలింగ్ వచ్చాయి. అనసూయ ఇండస్ట్రీలో పాపులర్ కాబట్టి ఆమెకు భారీగా ఓట్లు వచ్చాయి అని అందరూ అనుకున్నారు.

అయితే అనసూయ గెలిచినట్లుగా ఆదివారం నాడు ఎన్నికల అధికారి ప్రకటన మాత్రం చేయలేదు. ఇంకా ఆఫీస్ బేరర్ పదవులు అలాగే ఈసీ మెంబర్లకు సంబంధించి కౌంటింగ్ పూర్తి కాలేదు కాబట్టి రేపు ఉదయం 11 గంటల నుంచి తిరిగి లెక్కింపు ప్రక్రియ చేపడతామని చెబుతూ అప్పటికి పూర్తయిన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులకు సంబంధించిన ప్రకటన మాత్రమే ఎన్నికల అధికారి చేశారు. మీడియాలో అనసూయ గెలిచినట్లుగా కథనాలు రావడంతో ఆమె కూడా గెలిచినట్లుగా ఫిక్స్ అయిపోయింది. కానీ సోమవారం నాడు గెలిచిన వాళ్ళ లిస్టు లో అనసూయ పేరు లేదు.. దీంతో హర్ట్ అయిన అనసూయ వరుసగా ట్విట్టర్ ద్వారా వెటకారంగా ట్వీట్లు చేస్తూ వచ్చింది. ”క్షమించాలి ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వు వచ్చేస్తుంది, మీతో పంచుకుంటున్నా ఏమనుకోవద్దు, నిన్న అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీతో గెలుపు అని ఈరోజు లాస్ట్, ఓటమి అంటున్నారు రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుందబ్బా?” అని ఆమె ప్రశ్నించింది.

అలాగే అసలు సుమారు 900 ఓటర్లలో సుమారు 600 చిల్లర ఓట్ల లెక్కింపుకు రెండో రోజుకు వాయిదా వేయాల్సినంత టైం ఎందుకు పట్టిందంటారు? అహ లేదు అర్ధం కాక అడుగుతున్నానని ఆమె ప్రశ్నించింది. ఇక ఆమె అడిగిన ప్రశ్నలు సహేతుకమే అయినా సమాధానాలు వస్తాయని ఆశించలేము. ఎందుకంటే మీడియా అందరికంటే ముందు వార్త బ్రేక్ చేయడం కోసం ఒక్కోసారి ఇలా పొరపాట్లు చేస్తూ ఉంటుంది. ఇదే ఎన్నికల్లో హేమ గెలుపు విషయంలో కూడా అదే జరిగింది. హేమ గెలవకపోయినా కొన్ని ఛానెళ్లలో ఆమె గెలిచినట్లు వార్తలు వచ్చాయి, నిజానికి అక్కడ బెనర్జీ గెలిచారు. కానీ మీడియా పొరపాటుతో ఆమె గెలిచిందని ప్రచారం జరిగింది. చివరికి ఎన్నికల అధికారి చెప్పడంతో బెనర్జీ గెలిచినట్టు తేలింది. అనసూయ విషయంలో కూడా అదే జరిగి ఉండచ్చు.

Also Read : మా’ పీఠం మంచు విష్ణుదే !