ఆపదలో చిక్కుకున్న వారు 100 కి డయల్ చేస్తే, సత్వరమే స్పందించి సరైన సమయంలో సేవలు అందిస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి నేరుగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళ్తే ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలు,పెరిగిపోయిన తరుణంలో డయల్ 100 కి ఫోన్ చేస్తే పోలీసు సిబ్బంది ఎంత సమయంలో స్పందిస్తున్నారో తెలుసుకోవడానికి ఆకస్మిక చర్యలు చేపట్టారు. డయల్ 100 కంట్రోల్ రూమ్ విభాగాన్ని పరిశీలించారు. పోలీస్ సిబ్బంది పనితీరు స్వయంగా పరిశీలించడానికి, నవదీప్ సింగ్ వేరే ఫోన్ నుండి 100 కి డయల్ చేసి ఇండోర్ స్టేడియం పక్కనే ఉన్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ దగ్గర గొడవ జరుగుతుందని త్వరగా రావాలని కోరారు.
పోలీసులు ఎంత సమయంలో వస్తారో తెలుసుకోవడానికి ముందుగానే అక్కడికి చేరుకున్నారు. 4.40 కి కాల్ చేస్తే 4.45 కే అక్కడికి ఇద్దరు పోలీసులు చేరుకున్నారు. 5 నిమిషాల్లో అక్కడికి పోలీసులు రావడం పట్ల జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ సంతృప్తిని వ్యక్తం చేసారు. పోలీసు సిబ్బందికి ఫిట్నెస్ ప్రధానమని అందుకు తగినవిధంగా వ్యాయామం చేయాలనీ సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో ఏఆర్ సిబ్బంది పనితీరును ఎస్పీ నవదీప్ సింగ్ పరిశీలించారు.