iDreamPost
android-app
ios-app

డీహెచ్ ఎఫ్ ఎల్ కుంభకోణం తెలుసా ?

  • Published Mar 29, 2021 | 3:16 PM Updated Updated Mar 29, 2021 | 3:16 PM
డీహెచ్ ఎఫ్ ఎల్ కుంభకోణం తెలుసా ?

అల్పాదాయా వర్గాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కేంద్రం అమలు చేస్తున్న ఇంటి రుణాలపై వడ్డీ రాయితీ పథకం దుర్వినియోగమవుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అమలు చేస్తున్న ఈ రాయితీ పథకంలో ఏకంగా 2.60 లక్షల నకిలీ హోమ్ లోన్ అకౌంట్లను గుర్తించారు. వీటి విలువ రూ. 14,046 కోట్లు కాగా.. ఇందులో రూ.11,755.79 కోట్ల మేరకు చెలమణీలో లేని బాంద్రా బుక్ ఫర్మ్ వంటి సంస్థలకు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అకౌంట్లకు వడ్డీ రాయితీ కింద రూ. 1,887 కోట్లు క్లెయిమ్ చేశారు.

వడ్డీ రాయితీ ఇలా..

దేశంలో అందరికీ ఇళ్ళు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా కేంద్రం పీఎం ఏవై పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హమైన ఇళ్ల నిర్మాణదారులకు వారు తీసుకునే ఇంటి రుణంపై చెల్లించాల్సిన వడ్డీపై సబ్సిడీ ఇస్తోంది. గృహ నిర్మాణ కేతగిరీని బట్టి ఈ రాయితీ ప్రతి ఏటా చెల్లించాల్సిన వడ్డీలో 3 నుంచి 6.5 శాతం వరకు ఉంటుంది. అంటే కనీసం 2.30 లక్షల నుంచి గరిష్టంగా 2.67 లక్షల వరకు ప్రతి ఏటా సబ్సిడీ లభిస్తుంది. గృహనిర్మాణ ఆర్థిక సంస్థలు నిర్మాణదారుల దరఖాస్తులను పరిశీలించి నేషనల్ హౌసింగ్ బ్యాంకుకు సిఫార్సు చేస్తే.. అది మంజూరు చేస్తుంది. బడ్జెటరీ కేటాయింపుల నుంచి కేంద్రం ఆ నిధులను బ్యాంకుకు రీయింబర్స్ చేస్తుంది.

డీహెచ్ ఎఫ్ ఎల్ ఉల్లంఘనలు

గృహనిర్మాణ రుణాలు మంజూరు చేస్తున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ ఎఫ్ ఎల్) సుమారు 89 వేల రుణ దరఖాస్తులను క్రెడిట్ లింక్డ్ వడ్డీ రాయితీపై అర్హమైనవిగా పేర్కొంటూ క్లెయిమ్ చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెలుగు చూసింది. దీనిపై సీబీఐ ఈ నెల 15నే కేసు నమోదు చేసింది. డీహెచ్ ఎఫ్ ఎల్ ప్రమోటర్లు కపిల్ వాద్వాన్, ధీరజ్ వాద్వాన్, కొందరు ప్రభుత్వ అధికారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాధమిక నివేదికలో పేర్కొన్నారు.

దరఖాస్తుదారుల ఆధార్ తదితర వివరాల పరిశీలనలో నిర్లక్ష్యం, వైఫల్యమే ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. కాగా యెస్ బ్యాంక్ కుంభకోణంలో డీహెచ్ ఎఫ్ ఎల్ మాజీ సీఈవో రాణా కపూర్ ప్రమేయం ఉందంటూ ఇదివరకే ఈ సంస్థపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.