iDreamPost
iDreamPost
తాము ఎంతో అభిమానించే స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్ళుగా కొలవడం మాములే. అలాంటిది ఏకంగా ఆ టైటిల్ తోనే సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఆ ఆలోచనే 1997లో బాలకృష్ణ సినిమాకు దేవుడు టైటిల్ పెట్టేందుకు ప్రేరేపించి ఉంటుంది. ఆ విశేషాలేంటో చూద్దాం. అదే ఏడాది బాలయ్యకు సంక్రాంతికి ‘పెద్దన్నయ్య’ రూపంలో పెద్ద హిట్టు దక్కింది. చిరంజీవి హిట్లర్ తో పోటీపడి మరీ ఘన విజయం సొంతం చేసుకుంది. అంతకు ముందు డిజాస్టర్ ‘ముద్దుల మొగుడు’ తాలూకు గాయాన్ని పూర్తిగా మాన్పింది. అప్పుడు ప్రకటించిన సినిమానే ‘దేవుడు’. జనార్దన్ మహర్షి కథను అందించగా సత్యమూర్తి(దేవిశ్రీ ప్రసాద్ తండ్రి)సంభాషణలు సమకూర్చారు.
‘పెదరాయుడు’ ఇండస్ట్రీ హిట్ తర్వాత దర్శకుడు రవిరాజా పినిశెట్టికి టైం ఏమంత కలిసి రాలేదు. అరణ్యం, సరదా బుల్లోడు తీవ్రంగా నిరాశపరచగా చిన్న తారలతో తీసిన ‘రుక్మిణి’ మంచి విజయం అందుకుంది. అందుకే స్టార్ హీరోతో మరో హిట్టు కొట్టాలనే కసితో ఉన్నారాయన. 1992లో చంటి రీమేక్ మీద బాలకృష్ణ కూడా మనసు పడ్డారు. కానీ అది దక్కలేదు. వెంకటేష్ కు వెళ్ళింది. అందుకే అలాంటి ఛాయల్లోనే హీరో ఒక స్వచ్ఛమైన మనసున్న పల్లెటూరివాడిగా కనిపించే దేవుడు కథకు ఓకే చెప్పారు. శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాణం మొదలయ్యింది. ఆ టైంలో తమిళంలో ఒక ఊపు ఊపేస్తున్న శిర్పిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు.
రమ్యకృష్ణ, రుచిత ప్రసాద్ హీరోయిన్లుగా సత్యనారాయణ, అల్లు, కోట, మహర్షి రాఘవ, శివాజీరాజా, కిట్టి, వై విజయ ఇతర తారాగణంగా ఎంపికయ్యారు. ఇందులో హీరో పేరే దేవుడు. అనాథగా పెరిగి ఊళ్ళో అందరికి తల్లో నాలుకగా మెలుగుతూ ఉంటాడు. అయితే విలనైన ఎమ్మెల్యే ఆ ఊరి ఓట్ల కోసం చేసిన కుట్ర వల్ల కథ కొత్త మలుపు తీసుకుంటుంది. అతని కూతురి జీవితం ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ. అక్టోబర్ 27న విడుదలైన దేవుడు తీవ్రంగా నిరాశపరిచింది. బాలకృష్ణ అద్భుత నటన ప్రదర్శించినప్పటికీ విలేజ్ డ్రామా శృతి మించడంతో పాటు పాటలు గ్రామీణ నేపధ్యంలో కాకుండా బీట్స్ ఎక్కువగా ఉండేలా కంపోజ్ చేయడంతో డిజాస్టర్ తప్పలేదు. రీమేక్స్ తో తిరుగులేని ట్రాక్ రికార్డు ఉన్న రవిరాజా స్ట్రెయిట్ సబ్జెక్టుకి ఆ సమయంలో న్యాయం చేకూర్చలేకపోయారు.