Idream media
Idream media
తెలుగుదేశం పార్టీకి ఏపీలో ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. అధినేత చంద్రబాబు సహా, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ప్రయత్నిస్తున్నా ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలతో మున్సిపాల్టీల్లో ఎలాగైనా పరువు కాపాడుకోవాలని ఆ పార్టీ తహతహలాడుతోంది. చంద్రబాబు, చిన్న బాబు సహా ప్రముఖులందరూ రోడ్డెక్కి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ తమకు పట్టుఉందని చెప్పుకుంటున్న గ్రామాల్లోనూ పునాదులు కదిలిపోతున్నాయి. మైలవరం నియోజకవర్గంలోనూ అదే పరిస్థితి.
మైలవరం నియోజకవర్గంలో గుండెకాయగా ఉండే గొల్లపూడిలో అధికార పక్షంలో చేరేందుకు టీడీపీ నేతలు క్యూ కడుతున్నారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో అయోమయం నెలకొంది. ఇక్కడ గొల్లపూడి అతి పెద్ద గ్రామం. ఒక్క గ్రామంలోనే 10 ఎంపీటీసీ స్థానాలున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉండేది ఇక్కడే. టీడీపీ తరఫున ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ దాఖలు చేసిన నలుగురు అభ్యర్థులు ఇప్పుడు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ ఎఫెక్ట్ పార్టీ మీద ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవమే
అలాగే త్వరలో జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. గొల్లపూడి 1, 3, 5, 8 సెగ్మెంట్ అభ్యర్థులు చెరుకుమల్లి నరేంద్ర, దాఖర్ల కిషోర్‌బాబు, యడవల్లి శారమ్మ, పిళ్లా శివ, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం సమక్షంలో ఇటీవల వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ముందు నిలవలేమని, సీఎం పరిపాలనకు ఆకర్షితులవుతున్న కొంత మంది టీడీపీ నేతలు పార్టీ మారిపోతున్నారు.
ఒక్కప్పుడు దేవినేని ఉమాకు అండగా ఉన్న గ్రామం ఇప్పుడు సంక్షేమ ప్రభుత్వం వెంట నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర పరాభవం ఎదుర్కొన్న దేవినేని ఉమాకు తాజా పరిణామాలతో దిమ్మతిరుగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిత్యం ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియా ముందు హడావుడి చేసే ఉమాకు షాక్ తగిలింది.
Also Read:కుంభారవి,ఫలించిన పదేళ్ల నిరీక్షణ
గొల్లపూడిలో ఇటీవలే సీఎం జగన్ ప్రభుత్వం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావుల చేతుల మీదుగా 3,648 ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. ఈ పరిణామాలన్నీ స్థానికంగా టీడీపీ ప్రజలకు దూరం అయ్యేలా చేస్తున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ముందున్న తలశిల రఘురాం తన సొంత గ్రామంలో పేదలకు 3,648 ఇళ్ల పట్టాలను ఇచ్చి పాదయాత్ర కాలనీలను నిర్మించేలా పేదలకు మేలు చేశారు. దీంతో గొల్లపూడిలో రాజకీయం మొత్తం మారిపోయింది. దేవినేని ఉమా ఇప్పుడు ప్రభుత్వ పథకాల వలన తన పార్టీ అభ్యర్థులను కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది.