iDreamPost
android-app
ios-app

ఢిల్లీ ఫలితాలు చెప్తున్న పాఠాలు

ఢిల్లీ ఫలితాలు చెప్తున్న పాఠాలు

ఎన్నికలు – అంటే మనకు నచ్చిన వారిని మన ప్రతినిధిగా ఎన్నుకోవటం ఒక్కటే కాదు, మనం ఎన్నుకున్న వారు మనకు ఎంత జవాబుదారీగా ఉన్నారు, చేసిన వాగ్ధానాలను నెరవేర్చటానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేశారా అని లెక్క అడగటం. ఈ విధంగా ఓటేసేముందు ప్రతి పౌరుడు ఇంతకు ముందు ఎన్నుకున్న నాయకుల్ని లెక్కలు అడగాల్సిన సమయం. ప్రజలిచ్చిన ఓటుతో అయిదేళ్ళు అధికారం అనుభవించిన తర్వాత అధికార పార్టీ ప్రజలకు లెక్క చెప్పాల్సిన సమయం. అధికార పార్టీ చేసిన తప్పుల్ని ఎత్తిచూపి, తాము ఎన్నికయితే ఎలా మెరుగైన పాలన అందిస్తామో అని ప్రతిపక్ష పార్టీలు ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన సమయం. ఈ విధంగా పౌరులు, రాజకీయ పార్టీలు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వర్తిస్తే ప్రజాస్వామ్యం బలపడటమే కాదు, ఒక అద్భుత సమాజాన్ని స్థాపించుకోగలుగుతాం.

Read Also: దేశానికి ఢిల్లీ దిశానిర్దేశం అవుతుందా

రాజకీయపార్టీలను ప్రశ్నించటం మాని డబ్బుకు అమ్ముడు పోతేనో, కులం-మతం భావోద్వేగంలో మునిగిపోతేనో వేసే ఓటు ఆ పౌరుడి విజ్ఞతని ప్రశ్నార్ధకం చేస్తుంది. అలాగే అధికార పార్టీ ప్రజలకు చేసింది ఏమిటో చెప్పకుండా ఎదుటివాడి వ్యక్తిత్వాన్ని ఎద్దేవా చేస్తూ ఓట్లడగటం పలాయన వాదం. ఒక విధంగా తన పాలనలో ఎటువంటి విజయాలు లేవు అని పరోక్షంగా అంగీకరించటం. అలాగే ప్రతిపక్ష పార్టీలు ప్రజల దైనందింక జీవితానికి అవసరమైన సమస్యల్ని వదిలి వారిని ఉన్మాద స్థితిలోకి నెట్టి ఓట్లడగటం ఆ రాజకీయ పార్టీ భావదారిద్రయానికి గుర్తవుతుంది. సహజంగా ఇటువంటి ఉన్మాద రాజకీయపార్టీల వలలో అర్బన్ ఓటర్లు ముందుగా పడతారు.

Read Also: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్

ప్రధానమంత్రి నుంచి కేంద్ర క్యాబినెట్ మొత్తం, అదీ చాలక సుమారు 250 మంది ఎంపీ లు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు 70 అసెంబ్లీ సీట్లు ఉన్న చిన్న రాష్ట్రంలో రోజుల తరబడి ప్రచారం చేశారు. ఇక్కడ బీజేపీ పోరాట స్వభావాన్ని మెచ్చుకోవాల్సిందే కానీ ఆ పోరాటం దారి తప్పి ప్రజలని కూడా దారి తప్పించే విధంగా జరిగింది అన్నది సుస్పష్టం. మరో పక్క నేను మీకు ఇది చెప్పాను, ఇది చేసాను అంటూ తన ప్రోగ్రెస్ కార్డు చూపిస్తూ, ఏ మాత్రం బీజేపీ ట్రాప్ లో పడకుండా అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కున్నాడు. అతను ఏ మాత్రం ప్రచారంలో గాడి తప్పినా ఫలితాలు మరో రకంగా ఉండేవి. అభివృద్ధే తారక మంత్రంగా అతను చేసిన ప్రచారం మెచ్చదగిందే.

వీటన్నిటి మధ్య నిజమైన విజేత భారతీయుడే. ప్రజాస్వామ్యంలో గెలవాల్సింది సామాన్యుడే. ఇక్కడ అదే జరిగింది కూడాను. ఎటువంటి భావోద్వేగాలకు పోకుండా విద్య, వైద్యం, విద్యుత్తు, నీరు ఇవే మాకు ముఖ్యం అంటూ విచక్షణ ప్రదర్శించిన డిల్లీ ఓటర్లకు శుభాభినందనలు. ఈ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకే కాదు ప్రతి పౌరుడికి తమ బాధ్యతని మరింత పెంచాయి. అర్ధమవుతుందా?