జనవరి 26 న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కాగా అసాంఘిక శక్తులు రైతు ఉద్యమంలో ప్రవేశించడం వల్లనే హింసాత్మక సంఘటనలు చెలరేగాయని తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు మొగ్గు చూపామని కొందరు రెచ్చగొట్టినందువల్లనే రైతులు ఎర్రకోటను చుట్టుముట్టారని ఎర్రకోటపై నిశాన్ షాహిబ్ జెండాను ఎగురవేసారని రైతు ఉద్యమ నాయకులు తేల్చి చెప్పారు.
కాగా రైతులను రెచ్చగొట్టి ఎర్రకోటవైపు వెళ్లేలా ప్రేరేపించినట్లుగా పంజాబీ నటుడు దీప్ సిద్దూ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. రైతు ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి దీప్ సిద్దూ ప్రయత్నిస్తున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాగా ఎర్రకోటపై నిశాన్ షాహిబ్ జెండాను ఎగురవేసిన ఘటనను సమర్థించుకున్న దీప్ సిద్దూ జనవరి 26 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
దీప్ సిద్దూ ఎవరు?
పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో ఏప్రిల్ 2,1984 జిల్లాలో దీప్ సిద్ధు జన్మించాడు. సినిమాల్లోకి రాక ముందు మోడల్ గా పనిచేశాడు. అతనొక బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడా. స్కూల్ & కాలేజ్ లో చదివేటప్పుడు ఐదుసార్లు బాస్కెట్ బాల్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో ఆడాడు. అనంతరం న్యాయశాస్త్రంలో పట్టా పొందిన దీప్ సిద్దూ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించాడు.నటుడు ధర్మేంద్ర తన సొంత బ్యానర్ విజయతా ఫిల్మ్స్ నిర్మించిన “రామ్తా జోగి” చిత్రంతో ఆయన తొలిసారిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. మోడలింగ్ లో డీప్ కింగ్‌ఫిషర్ మోడల్ హంట్, గ్రాసిమ్ మిస్టర్ పర్సనాలిటీ మరియు గ్రాసిమ్ మిస్టర్ టాలెంటెడ్ అవార్డులను గెలుచుకున్నాడు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ తరపున ప్రచారం చేసిన దీప్ సిద్దూ సన్నీ డియోల్‌కు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. బీజేపీ ఎంపీగా గురుదాస్‌పుర్ లోక్‌సభ స్థానంలో సన్నీ డియోల్ గెలిచేందుకు తనవంతు కృషి చేశాడు. అనంతరం గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి తన మద్దతు తెలిపిన దీప్ సిద్దూ విశ్వసనీయతను రైతు సంఘాలు ఆదినుండి తప్పు పడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 25న రైతు సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో పంజాబ్ లోని శంభు సరిహద్దులో రైతులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న దీప్ సిద్దూ అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా ఖలిస్తానీ అంశాలతో పొత్తు పెట్టుకుని రైతులను ప్రేరేపించడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటినుండి రైతు ఉద్యమంలో అతని విశ్వసనీయతను రైతు సంఘాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులను ప్రేరేపించి అనుమతించిన రూట్లలో కాకుండా ఎర్రకోటవైపు వారిని వెళ్లేలా ప్రేరేపించాడని దీప్ సిద్దూపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఉద్యమాన్ని పెడత్రోవ పట్టించేందుకు దీప్ సిద్దూను బీజేపీ వదిలిన బాణంగా పరిగణిస్తూ కొందరు వ్యాఖ్యానించారు. దానికి బలం చేకూర్చేలా దీప్ సిద్దూ గతంలో బీజేపీ అగ్ర నాయకులైన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కలిసిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ట్రాక్టర్ల ర్యాలీని మంగళవారం తన ఫేస్‌బుక్ పేజీలో లైవ్ స్ట్రీమ్ చేసిన సిద్ధూ ఎర్రకోటపై సిక్కు మతపరమైన జెండా ఎగురవేయడాన్ని సమర్థించడం గమనార్హం.
రైతుల ఆందోళనతో ఢిల్లీలో చెలరేగిన హింసాత్మక సంఘటనల అనంతరం దీప్ సిద్దూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అల్లర్ల నేపథ్యంలో బైక్ పై వెళ్లిపోతున్న దీప్ సిద్దూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఢిల్లీలో చోటు చేసుకున్న అల్లర్లపై 22 ఎఫ్ఐఆర్లు నమోదవగా దీప్ సిద్దూపై కూడా కేసు నమోదైంది. బాలీవుడ్ పంజాబ్ చిత్రాల ద్వారా కూడా రాని గుర్తింపు రైతులను ప్రేరేపించాడన్న వార్తలతో దేశవ్యాప్తంగా దీప్ సిద్దూ పేరు మారు మ్రోగింది.
కాగా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్దూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసారు. తాను దేశ ద్రోహిని కాదని తనపై వచ్చిన ఆరోపణలు ఖండించారు. తాను దేశద్రోహినైతే రైతు నాయకులు కూడా దేశద్రోహులే అవుతారని దీప్ సిద్ధూ స్పష్టం చేశారు.తనకు ప్రజల మద్దతు లేదని గతంలో రైతు ఉద్యమ నాయకులు అన్నారని ఇప్పుడేమో మాట మార్చి నేను లక్షల మంది రైతులను ప్రేరేపించానని అంటున్నారని చెప్పుకొచ్చాడు. కాగా దీప్ సిద్దూ ఎక్కడ ఉండి ఈ వీడియో పోస్ట్ చేసారన్నది ఇంకా తెలియరాలేదు.. రైతు సంఘాల ఉద్యమ నాయకులు చెబుతున్నట్లు రైతు ఉద్యమాన్ని పలుచన చేయడానికి దీప్ సిద్దూ ఉద్యమంలోకి వచ్చాడా లేక నిజాయితీగానే ఉద్యమాన్ని సపోర్ట్ చేశాడా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..