ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైద్య భరోసా కల్పించడంలో జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. డిసెంబర్ 1 నుంచి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5 వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోనే ఇది నేరుగా వారి అకౌంట్‌లో జమ కానుంది. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఇందుకోసం ఏడాదికి రూ. 268.13 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజా ఆరోగ్యం పై సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు. తన తండ్రి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పధకాన్ని సమర్ధవంతంగా అమలు చేస్తానని పేర్కొన్నారు. అందులో భాగంగా అనేక మార్పులు చేశారు. ఇతర రాష్ట్రాలలో గతంలో ఉన్న వైద్య సదుపాయాన్ని తిరిగి పునరుద్దరించారు. తెలంగాణ లోని హైద్రాబాద్, తమిళనాడు లోని చెన్నై, కర్ణాటక లోని బెంగుళూరు నగరాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 1 వ తేదీ నుంచి ఇది అమలులోకి వచ్చింది.
ఆరోగ్యశ్రీ లో మరిన్ని వ్యాధులకు చోటు కల్పించనున్నారు. నూతన ఏడాదిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డు జారీ చేయనున్నారు. అప్పటి నుంచి జబ్బు ఏదైనా వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేయనున్నారు. ఆరోగ్యశ్రీ అర్హత కూడా పెంచారు. 5 లక్షల ఆదాయం ఉన్న వారు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు.