iDreamPost
android-app
ios-app

క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అవతరించిన రోజు

క్యూబాలో కమ్యూనిస్టు ప్రభుత్వం అవతరించిన రోజు

1959 జనవరి ఒకటిన ప్రపంచమంతా పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉంటే క్యూబా ప్రజలు నియంత పాలనకు వీడ్కోలు చెప్పి, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడు ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని సాయుధ దళానికి స్వాగతం పలికారు.

క్యూబా చరిత్ర

1492లో క్రిస్టఫర్ కొలంబస్ క్యూబాలో అడుగుపెట్టే నాటికి అక్కడ రెండు ప్రధాన తెగలు ఉండేవి. క్రమేపీ స్పెయిన్ దేశం అక్కడ తన కాలనీలు ఏర్పాటు చేసి, స్థానికులను తమకు చెందిన వ్యవసాయ క్షేత్రాలలో కూలీలుగా మార్చి దోపిడీ మొదలుపెట్టారు. స్పెయిన్ వారి దోపిడీని చూసి, దానిలో తమకూ వాటా దొరుకుతుందేమో అన్న ఆశతో బ్రిటిష్ వారు 1762లో క్యూబా కోసం యుద్ధం మొదలుపెట్టారు. సంవత్సరం పాటు ఎటూ తేలని యుద్ధాన్ని 1763లో పారిస్ సంధితో ముగించారు. ఈ సంధి ప్రకారం ఉత్తర అమెరికాలో స్పెయిన్ వారి అధీనంలో ఉన్న ఫ్లోరిడాని బ్రిటిష్ వారికిచ్చి, క్యూబా మీద పూర్తి హక్కులు స్పెయిన్ దక్కించుకుంది.

ఆ తరువాత స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోసం క్యూబాలో అనేక సంవత్సరాల నుంచి స్ధిరపడ్డ వాళ్ళు చాలా సార్లు సాయుధ పోరాటాలు చేసి, ఎట్టకేలకు 1902లో అమెరికా సహాయంతో స్పెయిన్ నుంచి పాక్షిక స్వాతంత్య్రం సంపాదించుకున్నారు. అంతర్గత వ్యవహారాలు స్థానిక ప్రభుత్వం చూసుకునేలా, ఆర్థిక, విదేశాంగ వ్యవహారాలు మాత్రం అమెరికా ప్రభుత్వం చూసుకునేలా ఒప్పందం కుదిరింది. స్పెయిన్ ఆధీనంలో ఉన్నప్పుడే క్యూబాని కొనుగోలు చేసి, తమ దేశంలో కలిపేసుకోవాలని, స్వాతంత్య్రం తరువాత కూడా తమ దేశంలో మరో రాష్ట్రంగా కలిపేసుకోవాలని అమెరికాలోని రాజకీయ నాయకులు ప్రతిపాదనలు చేసి, కాంగ్రెస్ లో ఓటింగ్ కూడా జరిగి, వీగిపోవడం జరిగింది.

1924లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన గెరార్డో మచాడో పాలనలో క్యూబాలో అమెరికన్లకు చెందిన చెరకు తోటలు, షుగర్ ఫ్యాక్టరీలు, క్యాసినోలు, రిసార్టులు పెరిగిపోయి, అమెరికన్లకు విలాసవంతమైన విడిది క్షేత్రంలా మారిపోయింది క్యూబా. జూదం, వ్యభిచారం, మద్యం లాంటి వ్యసనాలు పెరిగిపోయినా వాటి ద్వారా వచ్చే డబ్బులు క్యూబన్ల గొంతులు నొక్కేశాయి. 1929లో అమెరికా స్టాక్ మార్కెట్ కూలిపోవడంతో ఈ ధన ప్రవాహం ఆగిపోయింది. దాంతో క్యూబా ప్రజల్లో అశాంతి, ఆందోళనలు మొదలయ్యాయి.

1933 ఆగస్టులో జరిగిన తిరుగుబాటులో మచాడోని కూలదోసి కార్లోస్ సెస్పెడెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఆ మరుసటి నెలలో ఆ ప్రభుత్వాన్ని కూల్చి ఫుల్జెన్షియో బటిస్టా అధికారంలోకి వచ్చాడు. 1944లో అధికారం కోల్పోయిన బటిస్టా 1952వరకూ అమెరికాలోని ఫ్లోరిడాలో తల దాచుకుని, 1952లో అమెరికా సహకారంతో తిరిగివచ్చి, సైనిక తిరుగుబాటు ద్వారా అధికారం చేజిక్కించుకున్నాడు.

బటిస్టా అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించి నియంతృత్వ పాలన మొదలుపెట్టాడు. అంతులేని అవినీతితో తనకు వ్యతిరేకంగా ఎవరు గొంతు పాదంతో అణచివేసి ప్రజలలో వ్యతిరేకతను కూడగట్టుకున్నాడు.

విప్లవ సంఘాల నాయకుడు కాస్ట్రో

ప్రజల్లో వెల్లువెత్తిన ఆందోళన నుంచి అనేక విప్లవ సంఘాలు అవిర్భవించాయి. వాటికి కేంద్ర బిందువుగా ఫిడెల్ కాస్ట్రో అవిర్భవించాడు. సాయుధ పోరాటమే మార్గమని భావించిన కాస్ట్రో మొదటిసారి 1953లో 120 మంది సహచరులతో ఒక మిలిటరీ బ్యారక్స్ మీద ఆయుధాల కోసం దాడి చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో కాస్ట్రోని పట్టుకుని అతని సహచరులని చాలా మందిని సైన్యం కాల్చి చంపింది. జైలు శిక్ష అనుభవించిన కాస్ట్రో విడుదల తరువాత క్యూబాలో తనకు ప్రాణాపాయం ఉందని భావించి, మెక్సికోకు పారిపోయాడు. మూడు సంవత్సరాల తర్వాత నవంబర్ 1956లో 81మందితో బోటులో వచ్చిన కాస్ట్రో బృందం మీద ప్రభుత్వ దళాలు దాడి చేసి చాలా మందిని చంపేశారు. ప్రాణాలతో మిగిలిన 18 మందిలో ఫిడెల్ కాస్ట్రో, అతని సోదరుడు రాల్ కాస్ట్రో, సహచరుడు చే గెవారా ఉన్నారు. ఈ బృందం దక్షిణ క్యూబాలోని పర్వత శ్రేణులలోకి పారిపోయి తమ బలాన్ని క్రమంగా పెంచుకున్నారు.

ఈ మధ్య కాలంలో ప్రజల్లో బటిస్టా ప్రభుత్వం పట్ల అసంతృప్తి బాగా పెరిగిపోవడంతో అమెరికా కూడా అతనికి మద్దతు ఇవ్వడం అపివేసింది. ఇలాంటి సమయంలో 1958 డిసెంబర్ 31 న తమ సాయుధ బృందంతో వచ్చిన కాస్ట్రోకి క్యూబా ప్రజలు స్వాగతం పలికారు. తన సహచరులతో కలిసి 1959 జనవరి1న బటిస్టా తను అధికారంలో ఉండగా దోచిన సంపద దాచిన స్పెయిన్ దేశానికి పారిపోయాడు. జనవరి 7న కాస్ట్రో క్యూబా నాయకుడు అయ్యాడు.

అమెరికా పక్కలో బల్లెం

నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన దేశంలో ఉన్న అమెరికన్ల ఆస్తులన్నింటినీ జాతీయం చేశాడు కాస్ట్రో. దీంతో క్యూబా మీద అనేక రకాలైన ఆంక్షలు విధించింది అమెరికా. దీంతో ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో అమెరికాకి వ్యతిరేక కూటమికి నాయకత్వం వహిస్తున్న సోవియట్ యూనియన్ వైపు తిరిగాడు కాస్ట్రో. దానినుంచి దౌత్య, సైనిక, ఆర్థిక సహకారం లభించడంతో క్యూబాని తొక్కివేయాలనుకున్న అమెరికా పన్నాగం ఫలించలేదు.

అమెరికా తన మిత్రుల ద్వారా, తన గూఢాచారి సంస్థ అయిన సిఐఏ ద్వారా కాస్ట్రో మీద అనేక హత్యా ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు. 2008 ఫిబ్రవరి వరకూ ఏకధాటిగా క్యూబాలో అధికారంలో ఉండి ఆ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అధికారం తన సోదరుడు రాల్ కాస్ట్రోకి అప్పగించి, నవంబర్ 25,2016న మరణించాడు ఫిడెల్ కాస్ట్రో. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాతో సంబంధాలు పునరుద్ధరణ చేసింది క్యూబా ప్రభుత్వం.

కమ్యూనిజానికి పుట్టినిల్లు అయిన రష్యాలో కమ్యూనిస్టు పాలన అంతమైనా క్యూబాలో మాత్రం కమ్యూనిస్టు పాలన కొనసాగుతోంది. అయితే భవిష్యత్తులో పెట్టుబడిదారీ వర్గాల దాడులు, స్వేచ్ఛా మార్కెట్ ఆకర్షణ తట్టుకుని నిలుస్తుందా లేదా అన్నది కాలమే చెప్పాలి.