iDreamPost
iDreamPost
బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే సక్సెస్ చాలా ముఖ్యం. అది దక్కనంత కాలం ఎవరు సపోర్ట్ ఇచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఫ్యామిలీ బ్రాండ్ కేవలం కొంత కాలానికే పనికొస్తుంది తప్ప చిరకాలం దాని మీదే ఆధారపడలేం. ఉదాహరణకు చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ రేంజ్ ని అంతకంటే ముందు ఎంట్రీ ఇచ్చిన నాగబాబు సాధించలేకపోయారు. ఎస్వి రంగారావు మనవడు ఒక్క సినిమాతోనే ఆగిపోవాల్సి వచ్చింది. ఇలా ఎందరో ఉన్నారు. అయితే వీళ్ళలో కొందరికి అడపాదడపా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒకటి క్లిక్ కాకపోతుందా అనే నమ్మకమూ అలా నడిపిస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు.
ఒకరు నారా రోహిత్. నటుడిగా ఎన్ని విలక్షణమైన ప్రయోగాలు చేస్తున్నా సరే ఇప్పటికీ సరైన మార్కెట్ సంపాదించుకోలేకపోయిన ఈ హీరో తాజాగా నాని చేయబోయే శ్యాం సింగ రాయ్ లో ఓ ప్రత్యేకమైన పాత్ర చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ టాక్సి వాలా ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ కీలకమైన ఎపిసోడ్ లో నారా రోహిత్ రోల్ ఉంటుంది. ఇప్పటికే కథ చర్చలు జరిగాయని త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని సమాచారం.
ఇక ఇలాంటి ఆఫర్ వచ్చిన మరో హీరో నందమూరి తారకరత్న. బాలకృష్ణ బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందబోయే సినిమాలో తనకో కీలక పాత్ర ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఎంఎల్ఏగా నెగటివ్ షేడ్ గా సాగుతుందట. గతంలో నారా రోహిత్ రాజా చెయ్యి వేస్తేలో తారకరత్నే ప్రతినాయకుడిగా నటించాడు. ఇప్పుడు స్వయానా బాబాయ్ మూవీలో అవకాశం అంటే వద్దంటాడా. డెబ్యూ చేసినప్పుడు ఒకేసారి తొమ్మిది సినిమాల ఓపెనింగ్ రికార్డు సాధించిన తారకరత్న వరస పరాజయాల తర్వాత నిలదొక్కులేకపోయాడు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గట్టిగానే ట్రై చేస్తున్నాడు కానీ కాలం కలిసి రావడం లేదు. మరి ఇదైనా బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి