iDreamPost
iDreamPost
ఇటీవల కేంద్రం రూపొందించిన వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ విశాఖలో సీపీఐ ఆధ్వర్యంలో నిన్న ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టం వాటిల్లే విధంగా చట్టం చేస్తే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మాట్లాడట్లేదు అన్నారు . ఆనాడు తమతో పొత్తు పెట్టుకొన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు మోడీ కాళ్ళు మొక్కుతున్నారని , వ్యక్తిత్వం లేని పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకొన్నందుకు ఇప్పుడు లెంపలేసుకొంటున్నామని పవన్ ని తీవ్రంగా దుయ్యబట్టారు .
నారాయణ చేసిన విమర్శల్లో కొత్తదనం ఏమి లేకపోయినా,అవన్నీ పవన్ మీద మొదటి నుంచి ఉన్న విమర్శలే అయినా ఇప్పుడు నారాయణ చేయడంతో “చేతులు కాలాక ఆకులు పట్టుకొని ఉపయోగం ఏముంది నారాయణా…”అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఏమి చూసి పవన తో పొత్తుపెట్టుకున్నారు?
2009 లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ విభాగం యువరాజ్యంకి అధ్యక్షుడిగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ ఆ రోజు కాంగ్రెస్ పైనా , టీడీపీ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు . తర్వాతి కాలంలో ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయ్యాక 2014 ఎన్నికలకు కొద్ది కాలం ముందు జనసేన స్థాపించి పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణ ప్రయత్నాలు ఏమీ లేకుండా ఆ ఎన్నికలలో టీడీపీ-బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ఇచ్చాడు .
నాడు టీడీపీ పార్టీ హామీలకు తనది పూచీ అన్న పవన్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా ధాటిగా ప్రశ్నించకుండా టీడీపీకి నష్టం వాటిల్లుతుందని అనుకొన్న ప్రతిసారి వైసీపీని ప్రశ్నిస్తూ టీడీపీ తరుపున డైవెర్షన్ పాలిటిక్స్ నడిపారు . 2018 నాటికి హోదా విషయంలో , హామీల అమలు విషయంలో టీడీపీ ప్రాభవం తగ్గిపోయిందని గమనించి బాబుతో విభేదించిన పవన్ చివరికి కొన్ని ఆందోళనలు , పోరాటాల నిర్వహణ తర్వాత సీపీఐ , సీపీఎం లతో పొత్తుతో 2019 ఎన్నికల బరిలో దిగారు . ఆ ఎన్నికల్లో కూడా పలు చోట్ల టీడీపీ విజయానికి అనుకూలంగా జనసేన అభ్యర్థులను నిలిపారని జనసేన నుండే ఆరోపణలు వెల్లువెత్తాయి . తర్వాతి కాలంలో ఓ టివి ఇంటర్వ్యూలో జనసేన అభ్యర్థి బి ఫార్మ్ నాకిచ్చారని నేనే ఓ అభ్యర్థిని నిలుపుకొన్నానని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పారు .
రాజకీయ జీవిత ఆరంభం నుండి నిలకడ లేకుండా మూడు ఎన్నికల్లో మూడు స్టాండ్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ ని కమ్యూనిస్ట్ పార్టీలు ఎలా నమ్మాయో , ఏ ప్రాతిపదికన పొత్తు కుదుర్చుకొన్నాయో ప్రజలెవరికి అంతుబట్టలేదు కానీ అసలు అతనితో ఎందుకు ఎలా పొత్తు పెట్టుకొన్నారో కమ్యూనిస్ట్ నాయకులకు కూడా అర్ధం కాలేదని నిన్న నారాయణ వ్యాఖ్యల్ని బట్టి అనిపించడంలో తప్పులేదు .
బహుశా చేగువేరా ఆదర్శం అని ప్రకటించుకొన్నాడనో , ఎర్రకండువా భుజానికి తలకు చుట్టుకోవడమే ,చెమటతో తడిచిన సిపిఎం మధు చొక్కాను చేతబట్టుకొని వెనక నడిచాడనో తమకి మరో కమ్యూనిస్ట్ యువ కెరటం దొరికింది అనుకోని పొత్తు కలుపుకొన్నట్లు ఉన్నారు .
చివరికి నేడు మధూ చొక్కా పారేసి , ఎర్ర తుండు మడతేసి , చేగువేరా టోపి పక్కనేసి కాషాయంబరధారిగా మారి జటాజూటాలు విరబోసుకొని కమలం చెంతన అమాయకంగా ఒదిగి మతబోధకుడిలా మారిన పవన్ ని వెఱ్ఱిగా చూడటం నారాయణ వంతయ్యింది పాపం .
అనేక ప్రజా ఉద్యమాల్లో ఒక్క పిలుపుతో సామాన్య జనం చేత కదం తొక్కించి ప్రభుత్వాలని గడగడలాడించిన కమ్యూనిస్టుల ప్రాభవం నేడేమయ్యిందో కానీ చివరికి పవన్ కళ్యాణ్ వంటి నిలకడ లేని నాయకుడి చేతిలో తెల్లబోయి ఈ రోజు మూడు పెళ్లిళ్లు అని విమర్శిస్తున్న నారాయణ మర్చిపోయాడేమో కానీ వాళ్ళు పొత్తు పెట్టుకొనే సమయానికే పవన్ కి మూడు పెళ్లిళ్లయ్యాయి . ఆనాడు పొత్తు పెట్టుకొనేప్పుడు అది తప్పుగా కనిపించకుండా నేడు తప్పుగా కనిపించడం చూస్తే మాత్రం సుమతీ శతకం లోని ఓ పద్యం గుర్తురాక మానదు .
కూరిమి గల దినములలో
నేరములెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ..!
పొత్తు మీద నాడే విమర్శలు ….
2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తో పొత్తుపెట్టుకోవాలని ఉభయకమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలు ఎక్కువమంది కోరుకున్నారు. కానీ నాయకత్వం మాత్రం చిరంజీవి భవిష్యత్తు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ సానుభూతిపరుడంటూ తిరిగి చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నారు. అంతకు పది సంవత్సరాల ముందు చంద్రబాబు మీద చేసిన పోరాటం. ఐదు సంవత్సరాల ముందు 2004 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమిని ఎంత గొప్ప విజయంగా చిత్రీకరించారో అన్ని మర్చిపోయి ముఖ్యంగా బషీర్ భాగ్ కాల్పుల్లో చనిపోయిన ఖమ్మం జిల్లా సిపిఎం నేత రామకృష్ణ భార్య చేసిన విమర్శలను కూడా పట్టించుకోకుండా టీడీపీ, తెరాస లతో కూటమి కట్టి చిత్తయ్యారు.
చేగువేరా బొమ్మతో గద్దర్ స్నేహంతో వామపక్ష సానుభూతిపరులలో అభిమానులను సాధించుకున్న పవన్ కళ్యాణ్ 2014లో బీజేపీ గెలుపుకోసం పనిచేసినా 2019 నాటికి కమ్యూనిస్టులు అతన్ని నమ్మటానికి ప్రాతిపదిక ఏమిటో నారాయణ లాంటి వారు చెప్పాలి.
నాడు చిరంజీవి కాంగ్రెస్తో కలుస్తాడేమో అని పొత్తు పెట్టుకోని కమ్యూనిస్టులు బీజేపీని సమర్ధించిన పవన్ కళ్యాన్తో ఎందుకు పొత్తుపెట్టుకున్నట్లో?
కుడి ఎడమైతే పర్లేదన్న సినిమా డైలాగ్ నిజమనేలా చేగువేరా స్థానంలో వీర్ సావర్కర్ ను తీసుకురావటానికి పవన్ కళ్యాణ్ కు ఎక్కువ రోజులు పట్టలేదు.. పవన్ తీరులో మార్పు ఎవరిని ఆశ్చర్యపరిచాడూ ఎవరూ ఆశ్చర్యపోలేదు. అతని తీరే అంత. ఎత్తుగడల పేరుతో ప్రతిసారి పొరపాట్లు చేయటం అలవాటయిన కమ్యూనిస్టులు ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకుంటారా లేక మరోసారి చంద్రబాబుతో జట్టుకడతారా? చూడాలి…!