Idream media
Idream media
పోయిందనుకుంటే మళ్లీ వచ్చింది. వెయ్యి చేతులతో తిరిగొచ్చింది. డాక్టర్లు మొత్తుకుంటూనే వున్నారు. సెకండ్ వేవ్ ఉందని. మనమే వినలేదు, పెళ్లిళ్లు , పార్టీలు, ఉత్సవాలు. డ్యాన్సులు చేస్తూ మరీ పిలిచాం. కరోనాని రెచ్చగొట్టాం. ఎగతాళి చేశాం. మాస్క్‌లు తీసేశాం. శానిటైజేషన్ మానేశాం. థియేటర్‌లో ఒకర్నొకరు తోసుకున్నాం. ఏం పీక్కుంటావో పీక్కో అన్నాం. ముక్కుల్లోని గాలిని పీకేస్తా ఉంది.
సమూహంలో కలవకుండా ఉండలేం, అది మన బలహీనత, కరోనా బలం. ప్రజలు ఎలా ఉంటారో ప్రభుత్వాలు అలాగే వుంటాయి. ఎన్నికలు, ర్యాలీలు, కుంభమేళాలు. ఇలాంటి ముప్పు వస్తుందని గత ఏడాదే తెలిసింది కదా, సంవత్సర కాలంలో ఆస్పత్రుల్ని మెరుగు పరచి, ఆక్సిజన్‌ని అందుబాటులోకి తెచ్చామా? లేదు. ఫలితాన్ని కళ్లతో చూస్తున్నాం.
టీవీ పెడితే భయం, పేపర్ తెరిస్తే భయం. ఫోన్ మోగితే ఎవరి గురించి వింటామో తెలియదు. పోయిన వాళ్లని ఇంకా మరిచిపోలేదు. కొత్తగా మరి కొందరు వెళుతున్నారు. అంబులెన్స్‌లు, పోలీస్ సైరన్‌లు మళ్లీ వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి.
అంతా సర్దుకుందనే ఆశతో పట్టణాలకి వచ్చిన జనం , దిగులుగా ఊళ్లకి వెళ్లిపోతున్నారు. గతంలోని గాయాల్ని ఎవరూ మరిచిపోలేదు. అనంతపురం రోడ్లన్నీ సాయంత్రం 6 గంటలకి ఖాళీ అయిపోతున్నాయి. స్ట్రీట్ ఫుడ్ అమ్మకాలపై జీవించే వాళ్లంతా భారాన్ని ఎలా మోయాలో తెలియక నిరాశగా ఉన్నారు. సంచారం తగ్గడంతో ఆటోవాళ్లు పస్తుల్లోకి జారుకుంటున్నారు. గత ఏడాది హఠాత్తుగా లాక్‌డౌన్ చీకటి పడింది. ఈ సారి మెల్లిగా వస్తోంది.
Also Read : విపత్తులోనూ రాజకీయ విషమేనా..? బాబు రెండు నాలుకల ధోరణి..!
సెకండ్ వేవ్ చాలా మంది జర్నలిస్టులని తీసుకెళ్లింది. ప్రెస్‌క్లబ్‌లో ఎప్పుడు కనిపించినా ఊరి మనిషిలా పలకరించే అమర్నాథ్ సార్ లేడు. కడపకి వెళితే రైతుల సమస్యలపై ఆగకుండా మాట్లాడే అగ్రికల్చర్ రిపోర్టర్ ప్రభాకర్‌రెడ్డి లేడు. చాలా మంది మిత్రులు ఆస్పత్రుల్లో ఉన్నారు.
అద్భుతమైన హాస్యనటుడు వివేక్ వెళ్లిపోయాడు. యూట్యూబ్‌లో బాలు ప్రోగ్రామ్స్ చూస్తున్నప్పుడు కరోనా రాకపోతే ఈ మనిషి ఇంకో పదేళ్లు పాడేవాడు కదా అనిపిస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవరి వంతు ఎప్పుడో తెలియదు.
ఫస్ట్ వేవ్‌లో కొంచెం భరోసా వుండేది. గవర్నమెంట్ తీసుకెళ్లి ఆస్పత్రిలో పడేసేది. ఈ సారి ఎవడి చావు వాడిదే. ప్రైవేట్ వాళ్లు పిండేస్తున్నారు.
ఉగాదితో కొత్త సంవత్సరం వచ్చింది. ప్లవలో అన్నీ శుభాలే అని పంచాంగ కర్తలు చెబితే నిజమే అనుకున్నాం. కరోనా అంత సులభంగా లొంగదు. గ్రహాలు, నక్షత్రాలు కూడా మాస్క్‌లేసుకుని పారిపోతున్నాయి.
జాగ్రత్తగా వుందాం. బతుకుదాం. భూమి మీద చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.
Also Read : లాక్ డౌన్ ప్రకటనలు.. అంత రహస్యమెందుకు..?