iDreamPost
android-app
ios-app

మానవత్వాన్ని దూరం.. దూరం..

  • Published Jul 23, 2020 | 3:35 PM Updated Updated Jul 23, 2020 | 3:35 PM
మానవత్వాన్ని దూరం.. దూరం..

ప్రకృతిలోని ఇతర జంతువులకు, మనిషికి మధ్య తేడా ‘బుద్ధి’ ఒక్కటే. అడవులు బట్టి బ్రతికే కాలం తరువాత, సామూహిక/ సమాజ జీవనానికి అలవాటు పడేందుకు ఈ బుద్దే తోడ్పడింది. పుర్రెపుర్రెకో బుద్ది ఉన్నప్పటికీ ఎక్కువ మందిని ఏకం చేసి ఉంచేందుకు ‘మానవత్వం’ అనేది కూడా కీలకంగానే మారింది. అయితే మహమ్మారి కరోనా వైరస్‌ మనుషల మధ్య భౌతిక దూరంతో పాటు మానవత్వానికి– మనిషికి మధ్య కూడా దూరాన్ని పెంచుతోంది. ఒకప్పుడు ఎవరైనా అపస్మారక స్థితిలో రోడ్డుమీద పడితే అయ్యోపాపం అంటూ వాళ్ళకు సపర్యలు చేసే వాళ్ళం. ‘మద్యం’ మొదలయ్యాక ఈ సపర్యలకు కొంత దూరమై తాగేసిపడుంటాడులే అన్న భావనొచ్చింది.

ఇప్పుడు ‘కరోనా టైం..’ ఎవడు పడిపోయాని పట్టించుకునే ధైర్యం లేకుండా పోయింది. రోడ్డు మీద అనాథలా మృతి చెందితే ఎవరో మహానుభావుడు అంత్యక్రియలు చేస్తే ‘చాలా పెద్ద మనసండీ’ అనుకునే రోజుల నుంచి అటువంటి మృతదేహం వైపు కూడా చూడకుండా ముఖానికి మాస్కు అడ్డంపెట్టుకుని వెళ్ళిపోవాల్సి దుస్థితి వచ్చింది. కరోనా పుణ్యమాని ఒకటా.. రెండా.. ఎన్నెన్నో ఘటనలు, ప్రతి ఘటన మనిషి మానవత్వం మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నప్పటికీ ‘స్పందించమని’ కనీసం బ్రతిమలాడలేని పరిస్థితిని ఇప్పుడు మానవాళి ఎదుర్కొంటోంది.

నా అన్నవాళ్ళెవ్వరూ కనీసం మృతదేహాన్ని ముట్టుకోవడానికి కూడా ముందుకు రాని పరిస్థితులను దేశ వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఇటువంటి ఘటనలు రోజుకొకటికంటే ఎక్కువే బైటకు వస్తున్నాయి. వరంగల్‌ ఆసుపత్రి ఎదుట స్ట్రెచర్‌పైనే మృతదేహాన్ని వదిలేసారు. రాజమహేంద్రవరం నగరంలో అంత్యక్రియలకు స్థానికులు అడ్డుపడడంతో మూడు రోజులు పట్టింది. మరో చోట పాజిటివ్‌ వచ్చి మరణించిందేమోనన్న అనుమానతంతో బంధువులెవరూ దగ్గరకు రాకపోతే ఆల్రెడీ పాజిటివ్‌ వచ్చి ఐసోలేషన్‌లో ఉన్న మనుమడు పీపీఈ కిట్‌ ధరించి వచ్చి తన నానమ్మకు అంత్యక్రియలు చేసుకున్నాడు. మృతదేహాల పట్ల ఇటువంటి దారుణాలను వింటుండగా ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ పట్ల కూడా సాటి మనుషులు దయ చూపకపోవడం హృదయాలను కలిచివేస్తోంది. పాజిటివ్‌ వచ్చిన భర్తను తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం బస్టాండు వద్దే వదిలేసి భార్య ఇంటికి వెళ్ళిపోయిన ఘటనను కూడా వినాల్సి వచ్చింది.

ఇదంతా ఒకెత్తయితే కరోనా వారియర్లుగా ముందుండి సేవలను చేస్తున్న ఆరోగ్య సిబ్బంది పట్ల తోటి మనుషులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత జుగుప్స కలిగించే రీతికి చేరుకుంది. రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్‌లో నివాసం ఉంటున్న ఒక ఏఎన్‌యం భర్తకు పాజిటివ్‌ వచ్చింది. ఈమెకు నెగటివ్‌. కానీ ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి వారు ఆమెను ఇంట్లోకి రావొద్దని చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం కల్పించుకోవడం ఆమెకు అదే ఇంట్లో హోం క్వారంటైన్‌ ఉండేందుకు వీలు కలిగింది.

అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. కరోనా వచ్చింది మొదలు అందరూ ఇంట్లో దాక్కుంటుంటే ఆరోగ్య, పోలీసు సిబ్బంది మాత్రమే దానికి ఎదురెళ్ళారు. ఎక్కడొచ్చిందంటే అక్కడికిచేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. వాళ్ళకు వైద్య పరీక్షలు చేసి, చుట్టుపక్కల వాళ్ళకు వైరస్‌ వ్యాపించకుండా అక్కడే టెంట్లు వేసుకుని కాపలా కాసారు. వాళ్ళ ఇళ్ళలోనూ కుటుంబాలున్నాయి, చిన్నారులు, వృద్ధులు ఉన్నారన్న విషయాలను పట్టించుకోకుండా పోరాటంలో ముందున్నారు. కానీ వాళ్ళే బాధితులైతే మాత్రం తమ సేవలు పొందిన జనం నుంచే ఇటువంటి చిన్నచూపును ఎదుర్కొవడం దారుణాతిదారుణమైన పరిస్థితిగానే చెప్పుకోవాలి. బంధాలకు, అనుబంధాలుకు విలువనివ్వడంతో పాశ్చాత్య దేశాలకు, మన దేశానికి మధ్య తేడాను ప్రధానంగా చెబుతుంటారు. అయితే ఇటువంటి విషయాలు విన్నప్పుడు ఆ తేడా ఏంటా? అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి.