iDreamPost
iDreamPost
దేశమంతా అస్తవ్యస్త పరిస్థితుల్లో అనేకమందిని ఆదుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అందుకు పార్టీలు, సంస్థలు బేధం లేకుండా అంతా ముందుకు వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారి ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా చేయూతనిస్తున్నారు. అందులో భాగంగా కేంద్రం ప్రకటించిన 1.76లక్షల కోట్ల సహాయం అమలులోకి వచ్చింది. ఇప్పటికే జన్ ధన్ ఖాతలకు ఒక్కొక్కరికీ నెలకు రూ.500 చొప్పున బదిలీ చేసే ప్రక్రియ చేపట్టారు. కొందరు లబ్దిదారులు వాటిని స్వీకరిస్తున్నారు. ఇక ఈఎంఐల వ్యవహారం బ్యాంకులకు వదిలేయడంతో అస్పష్టత తప్ప కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించిన మిగిలిన కార్యక్రమాల అమలుకు పూనుకున్నారు.
అదే సమయంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమవంతుగా సహాయాన్ని అందించడానికి సన్నద్దమయ్యాయిం. అందులో భాగంగా ఏపీలో ఉచితంగా రేషన్ సరుకుల పంపిణీ ఇప్పటికే జరిగింది. మార్చి నెలాఖరున ఒకసారి ఏప్రిల్ 15, నెలాఖరులో మరో రెండు విడతులుగా ఉచితంగా రేషన్ అందించేందుకు జగన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వాటితో పాటుగా బియ్యం కార్డు కలిగిన వారికి ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. దానిని నేరుగా ఇంటింటికీ తీసుకెళ్లి లబ్దిదారులకు అందించే ప్రక్రియ చేపట్టింది. దాంతో ఇదిప్పుడు రాజకీయ అంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే కరోనా వ్యవహారం కూడా రాజకీయంగా కలకలం రేపుతోంది. చంద్రబాబు పదే పదే లేఖలు ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉన్నారని అధికార పార్టీ విమర్శిస్తోంది. అందుకు తోడుగా టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా కూడా అదేపరంపరలో సాగుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అలాంటి ట్వీట్లు చేయడం విశేషం. కేంద్రం ఇస్తున్న నిధులు పంచుతూ బిల్డప్ ఇవ్వడమే తప్ప ఏపీలో జగన్ సర్కారు ఏమీ ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి నారా లోకేశ్ హైదరాబాద్ లో ఉండిపోవడంతో ఏపీలో పరిణామాలు పూర్తిగా అర్థమవుతున్నట్టు లేదని కొందరు వ్యాఖ్యానించడం గమనిస్తే ఈ ట్వీట్లు చూసిన తర్వాత ఆ వ్యాఖ్యలు నిజమే అనిపిస్తాయి. ఇప్పటికే బియ్యం, కందిపప్పు ఒక విడత పంపిణీ జరిగినా లోకేష్ గమనించకపోవడమే దానికి కారణం.
వాటికి తోడుగా ఇప్పుడు లబ్దిదారులకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం చుట్టూ టీడీపీకి తోడుగా జనసేన, బీజేపీ కూడా క్రెడిట్ గేమ్ మొదలెట్టేశాయి. ఏపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖ తరుపున జీవో ఎంఎస్ నెం.7ని విడుదల చేసి 1300 కోట్ల సహాయం పంపిణీ చేపడితే దానిని కూడా కేంద్రం నుంచి వచ్చిన సహాయంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తరుపున పేదలకు ప్రయోజనం లేదని చెప్పేందుకు ప్రయత్నిస్తూ క్రెడిట్ కేంద్రానిదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. వాస్తవానికి కేంద్రం నుంచి ఇప్పటి వరకూ విపత్తుల సహాయ నిధి కింద రెండు విడతలుగా సహాయం ప్రకటించారు. తొలుత రూ.450 కోట్లు విడుదల చేశారు. తాజాగా మరో రూ.550 కోట్లు ప్రకటించారు. ప్రకృతి విపత్తుల సహాయ నిధి అనేది సహజంగానే ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి కేంద్రం నుంచి నిధులు వస్తూ ఉంటాయి. అందులో భాగంగానే ఏపీకి కూడా నిధులు ఇచ్చారు. ఆ నిధులను రాష్ట్రంలో పరిస్థితులను బట్టి వినియోగించుకుంటారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం మాత్రం పేదలకు తొలుత ప్రకటించిన రీతిలో రూ.1300కోట్లను పంపిణీ చేసింది. అయినప్పటికీ బీజేపీ, జనసేన కార్యకర్తలు మాత్రం జగన్ ప్రభుత్వం మీద విమర్శలతో సరిపెట్టకుండా ఏకంగా కేంద్రానికి క్రెడిట్ కట్టబెట్టాలని ప్రయత్నం చేయడం విస్మయకరంగా మారింది.
విపత్తుల వేళ ప్రజలకు సహాయం అందించేందుకు, నిజంగా లబ్దిదారులకు చేరకపోతే దానికి తగ్గట్టుగా ప్రయత్నించేందుకు పనిచేయాల్సిన పరిస్థితి నుంచి ఇలాంటి క్రెడిట్ గేమ్ ప్రారంభించడం వింతగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఏపీ ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు తీవ్రంగా ఉన్న తరుణంలో నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే పెద్ద మొత్తం కేటాయించాలే తప్ప ఇలా అరకొరగా నిధులు కేటాయిస్తే దానిని కూడా రాజకీయంగా వాడుకోవాలని చూడడం బీజేపీ ఏపీ నేతలకు తగదనే అభిప్రాయం వినిపిస్తోంది. అవకాశం ఉంటే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా మరిన్ని నిధులకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు.