iDreamPost
android-app
ios-app

ఆ నేత‌ల నుంచి కరోనా ముప్పు..?

ఆ నేత‌ల నుంచి కరోనా ముప్పు..?

ఇటీవ‌ల ఏపీ, తెలంగాణ‌లో ఉప ఎన్నిక‌ల పోరు హోరాహోరీగా సాగింది. ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన నేత‌లు కూడా ఎన్నిక‌లు జ‌రిగే ప్రాంతాల్లోనే మ‌కాం వేసి మ‌రీ ప్ర‌చారంలో పాల్గొన్నారు. గుంపులు, గుంపులుగా ఆయా ప్రాంతాల‌ను చుట్టి ఇళ్ల‌కు చేరుకున్నారు. వారిలో కొంద‌రికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లుగా బ‌య‌ట‌కు వార్త‌లు వ‌స్తుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. దీంతో వారితో పాటు తిరిగిన వారికి, కుటుంబ స‌భ్యుల‌కు కూడా క‌రోనా సోకే అవ‌కాశాలు ఉన్నాయ‌ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయా నేత‌లు కొన్ని రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండ‌డం మేల‌ని సూచిస్తున్నారు. చాలా మంది పొలిటిక‌ల్ లీడ‌ర్లు కూడా క‌రోనా కేసుల జాబితాలో చేరుతున్నారు. ఇటువంటి నేప‌థ్యంలో అధికారుల ప్ర‌క‌ట‌న చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

తిరుప‌తి ప్ర‌చారంలో పాల్గొని వ‌చ్చిన అనంత‌రం జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కాస్త న‌ల‌త‌గా అనిపించి ప‌రీక్ష‌లు చేయించుకున్న‌ప్ప‌టికీ తొలుత నెగెటివ్ వ‌చ్చింది. అయిన‌ప్ప‌టికీ వైద్యుల సూచ‌న మేర‌కు ఆయ‌న క్వారంటైన్ లో ఉన్నారు. కొద్ది రోజుల అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారు. ఈసారి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీల నేతలూ అక్కడే మకాం వేశారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పార్టీల సహా ఇతరులు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మాడ్గులపల్లి మండల ఇన్‌చార్జి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోదరుడు రాజేశ్వర్‌రెడ్డి, ఆర్మూరు జడ్పీటీసీ సంతోష్‌, నాయకులు తాటిపల్లి గంగారెడ్డి, మల్లారెడ్డి కొంద‌రికి క‌రోనా సోకింది. అయిన‌ప్ప‌టికీ వారు ప్ర‌చారంలో కూడా పాల్గొన్నార‌ని, కరోనా పీడితులతో కలిసి ప్రచారం నిర్వహిస్తూ వ్యాధి వ్యాప్తికి కారకుడైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ పోలీసుల‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆందోళ‌నల్లా క‌రోనా సోకింద‌ని బ‌య‌ట‌కు తెలియ‌ని నేత‌లు ఇంకెంత మంది ఉన్నార‌నేదే.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటువంటి ప‌రిస్థితుల్లో తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్న ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలను తలచుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన చెందుతోంద‌ట‌. ప్రధాన పార్టీలతోపాటు.. చిన్న చితకా పార్టీలకు చెందిన అగ్రనేతలు కూడా అదే పనిగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. తిరుపతి అర్బన్‌లోనూ విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా పరిధిలోనూ అదే పరిస్థితి. చిత్తూరు పర్యటనకు.. ప్రచారానికి వెళ్లిన కొందరు నేతలు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ ప్రొటోకాల్ పాటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భాలు చాలా తక్కువ. అభ్యర్థి సహా ఐదుగురు మాత్రమే ప్రచారంలో పాల్గొనాలని చెప్పినా.. పార్టీలేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. తిరుపతి నుంచి సొంతూళ్లకు చేరుకున్న నేతలు కార్యక్రమాలు.. సమీక్షల పేరుతో బిజీగా ఉంటున్నారు. ఇన్నాళ్లూ నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో తిరుపతి నుంచి వచ్చినవాళ్లు అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కామన్. కేడర్‌ సైతం నాయకుడు వచ్చారంటే చాలు కరోనా భయాన్ని పక్కనపెట్టి వారి దగ్గర వాలిపోతున్నారు. ఈ నిర్లక్ష్యమే కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతుందన్న బెంగ అధికారుల్లో క‌నిపిస్తోంది.