iDreamPost
android-app
ios-app

ఇదేనా మన బాధ్యత..?

  • Published Jul 28, 2020 | 3:25 AM Updated Updated Jul 28, 2020 | 3:25 AM
ఇదేనా మన బాధ్యత..?

హక్కుల గురించి పోరాడే వాళ్ళు ముందుగా తమ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. మన రాజ్యాంగంలో హక్కులు, బాధ్యతలకు సమాన ప్రాధాన్యతనే ఇచ్చారు. ప్రజారోగ్యం విషయంలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం తన వనరుల మేరకు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదు. అందులోనూ కరోనా లాంటి మహమ్మారులు దండెత్తి ప్రజల మీద పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెనకడుగు వేసేందుకు కూడా సిద్ధంగా ఉండదు. ఎంతకంటే అప్పుడు జరిగే ప్రాణ, ఆర్ధిక నష్టం సదరు ప్రభుత్వానికి మాయని మచ్చగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనైనా ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఆయా ప్రభుత్వాలకు ఉంటుంది. అయితే ప్రభుత్వం చెప్పిన సూచనలను పాటించాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంటుంది.

కరోనాకు దేశ వ్యాప్తంగా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో తగిన ధృవీకరణ పత్రాలను మాత్రం అడుగుతున్నారు. తద్వారా రోగిని గుర్తించేందుకు యంత్రాంగానికి సులభమై, మరింత మెరుగైన సేవలు అందించే వీలుంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన సమాచారం ఇచ్చి ప్రభుత్వ యంత్రాగాలకు సహకరించడం అత్యంత ఆవశ్యకమైన బాధ్యత. అయితే ఈ బాధ్యతను కొందరు నిర్లక్ష్యం చేస్తుండడం ఇప్పుడు యావత్తు ప్రజానీకాన్ని ప్రమాదం అంచున నిలబెడుతోంది. బెంగళూరు మహానగరంలో 11వేల మంది, హైదరాబాదు నగరంలో సుమారు 3వేల మంది వరకు కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్న వారు తప్పుడు అడ్రస్‌లు, పనిచేయని ఫోన్‌ నంబర్లు ఇచ్చారన్న వార్త దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అంటే వీరంతా ఇప్పుడు ఆయా నగరాల్లో ఎటువంటి నియంత్రణ లేకుండా యధేచ్ఛగానే సంచరిస్తున్నారన్న అనుమానాలు ప్రభుత్వ యంత్రాంగం వ్యక్తం చేస్తుంది. ఈ లెక్కన వారు ఎంత మందికి ఈ వైరస్‌ను అంటించి ఉంటారన్న అంచనాలు వేసుకుంటున్న యంత్రాంగం తీవ్రమైన భయాందోళనలు వ్యక్తం చేస్తోంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని ఆసుపత్రులను వినియోగించుకుంటేనే కరోనా వైద్య సేవలు విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. తమకు తగిన సేవలు అందడం లేదని మీడియా, సోషల్‌ మీడియా ద్వారా తమ బాధలను వెళ్లబోసుకుంటున్నారు. అంటే ఇప్పుడున్న వైద్య వ్యవస్థ తన సామర్ధ్యానికి మించి సేవలందిస్తుండడంతో పలు చోట్ల ఫిర్యాదులకు ఆస్కారం ఏర్పడుతోందన్నది పరిశీలకుల భావన. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తులు తమ ఉనికి దాచిపెట్టి విచ్చలవిడిగా జనంలో తిరిగేసి, అమాయకులకు ఆ వైరస్‌లను అంటిస్తే ఆయా నగరాల్లో పరిస్థితి ఇంకెంత దిగజారిపోతుందో ఊహిస్తేనే వెన్నులో నుంచి వణుకు రాకమానదు.

వైద్య పరీక్షల సమయంలో ఇచ్చిన అడ్రస్‌లకు క్షేత్రస్తాయి సిబ్బంది వెళ్ళి పరిశీలిస్తే అక్కడ వారు ఉండడం లేదు,అలాగే ఫోన్‌ నంబర్లు కూడా స్విచ్చాప్‌ వస్తోందని పోలీసు, వైద్య వర్గాలు వాపోతున్నాయి. దీంతో వారిని గుర్తించి క్వారంటైన్‌ చేసే, ఇతరులకు ఆ వైరస్‌ అంటుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉండడం లేదు. సదరు పాజిటివ్‌ వ్యక్తులు కూడా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా జనంలోకి వచ్చేస్తే వారి ద్వారా మరింత మందికి వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడుతోంది. కేవలం ఒక్కో వ్యక్తి ద్వారానే కొన్ని వందల మందికి వైరస్‌ వ్యాపించిన ఉదాహరణలు దేశ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. అటువంటిది ఇన్ని వేల మంది బాధ్యతారాహిత్యంతో చేస్తున్న పనికి ఇంకెంత మంది దీని భారిన పడతారోనన్నది ఊహకే అందడం లేదు.

వ్యాధినిగురించి మొదట్లో ఉన్న భయాందోళనల నేపథ్యంలో రోగుల పట్ల పలు చోట్ల అనుచితంగా వ్యవహరించిన మాట వాస్తవం. అయితే రాన్రాను ప్రభుత్వాలు, యంత్రాంగం చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా పలు చోట్ల వ్యాధి భారిన పడ్డ వారికి సహాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ, చిన్నచితకా కాలనీల్లో పాజిటివ్‌లుగా వచ్చిన వ్యక్తులకు ఆహారం, ఇతర సదుపాయాలు అందజేసేందుకు ఇరుగుపొరుగు వారు ముందు వస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు వచ్చింది, తరువాత ఇంకెవరికైనా రావొచ్చు అన్న భావన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళింది. దీంతో ముందులో ఉన్నంత వివక్ష ఇప్పుడు లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తప్పుడు చిరునామాలతో వైద్య పరీక్షలకు వస్తున్నవాళ్ళు తాము చేస్తున్న తప్పుడు గుర్తించాలి. తోటి వారి పట్ల తమ బాధ్యతనుగుర్తెరి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాల్సిన అవసరంఎంతైనా ఉంది. లేకపోతే తమ నిర్లక్ష్యం ఎదుటి వారి ప్రాణాలకు ప్రమాదం తెస్తుందన్నది వారు గుర్తించుకోవాలి.