Idream media
Idream media
కొన్ని వందల మంది తత్వవేత్తలు నేర్పలేని వేదాంతాన్ని కరోనా కొద్దిరోజుల్లో మనకు నేర్పించింది.
ఈ ప్రపంచాన్ని ఎవరైనా సృష్టించారా? లేక తనంతట తానే సృష్టి అయిందా? చాలా మంది రుషులు ఈ ప్రశ్న వేసుకున్నారు.
ఇపుడు కరోనానే మన ప్రపంచం. దీన్ని ఎవరైనా సృష్టించారా? లేక స్వయంగా పుట్టిందా?
కళ్లు మూసుకుని విశ్వసించు అంటే మతం
కళ్లు తెరిచి ప్రశ్నించు అంటే తత్వశాస్త్రం
కళ్లు మూసినా, తెరిచినా అర్థం కానిది కరోనా. ఇది సర్వాంత్వర్యామి. కనపడదు, కానీ మన పక్కనే ఉంటుంది. మనిషిలో దేవున్ని చూడమన్నారు. ఇప్పుడు ప్రతి మనిషిలో వైరస్ కనిపిస్తోంది. ఎవరిలో ఉందో తెలియదు. కానీ ఉంది.
“నేను ఆలోచిస్తున్నాను, కనుక నేను ఉన్నాను” డెకార్త్ అనే ఫిలాసఫర్ అన్నాడు. నా గురించి ఆలోచిస్తున్నావు కనుక నేను ఉన్నాను అంటుంది కరోనా. పుస్తకం చదివినా, టీవీ చూసినా, ఫోన్లో మాట్లాడినా దాని జపమే కదా!
జంతువులు ప్రశ్నలు వేయవు, మనిషి వేస్తాడు. అందుకే జంతువులకి కరోనా రాలేదు. ప్రశ్నించక పోవడం వల్ల మనిషి జంతువు కావచ్చు. ప్రశ్నించినంత మాత్రాన జంతువు మనిషి కాలేదు. ఇలాంటి పనికిమాలిన తర్కం వల్ల ఆకలి పెరుగుతుంది తప్ప , లాక్‌డౌన్ ముగియదు.
ఒక వేదాంతి రోడ్డు మీద కనిపిస్తే పోలీస్ ఆపాడు.
“నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్తాను” అన్నాడు వేదాంతి.
“నువ్వు ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వచ్చావు. ఇక్కడి నుంచి జైలుకెళ్తావు” అన్నాడు పోలీస్.
“ఇపుడు ఇల్లు కూడా జైలే కదా?” తర్కం లేవదీశాడు వేదాంతి.
“నిజమే, ఖైదీలు తప్పించుకుంటే చూస్తూ ఊరుకోం” అని పోలీస్ జీపు ఎక్కించాడు.
ఈ ప్రపంచమంతా అంకెలమయం అని పైథాగరస్ అంటే అర్థం కాలేదు. ఇప్పుడు అన్నీ అంకెలే. కేసులు, కోలుకున్న వారు, మరణాలు నిద్రలో కూడా ఈ నెంబర్లే కనిపిస్తున్నాయి.
స్థిరమైనది ఏదీ లేదు. ఒక వస్తువు తాను అయి ఉండి , తాను కాకుండా పోతుంది. తాను తానుగానే ఉంటూ , తాను కాకుండా పోతుంది అంటాడు హెరాక్లిటస్. అర్థం కాలేదా? కరోనా కూడా ఇంతే అర్థం కాదు. అన్నీ తెలుసుకునే అమెరికా కూడా అర్థం కాక జుత్తు పీక్కుంటూ ఉంది. అర్థమైనా కాకపోయినా మూసుకుని కూచుంటే మిగులుతాం. లేదంటే ఫొటోకి దండ పడుతుంది. దినం కూడా ఎవరూ చేయరు. చేస్తే వాడికి దినం కాబట్టి.
నాకు తెలిసింది ఒకటే, నాకు ఏమీ తెలియదని అంటాడు సోక్రటీస్. అందుకే విషమిచ్చి చంపారు. ఈ ప్రపంచం ప్రత్యేకత ఏమంటే మనకు తెలుసు అంటే ఒప్పుకోదు. తెలియదు అంటే కూడా ఒప్పుకోదు.
కరోనా కూడా అంతే. నీకు తెలిసింది ఎంతో దానికి అనవసరం. అది ఒక విషపాత్రతో ఎదురు చూస్తూ ఉంటుంది. సోక్రటీస్‌లా నిన్నెవరూ గుర్తు పెట్టుకోరు.
అంతా మాయ, ప్రపంచం ఒక భ్రాంతి, స్వప్నం, ఉన్నది ఒకటే అది కరోనా.
శంకరుడి మాయావాదం కూడా కొత్తగా అర్థమవుతోంది. ఉత్సవాలు, రథోత్సవాలు, వాహన సేవలు చేయించుకున్న దేవుళ్లు కూడా అర్చనలు, అభిషేకాలు, నైవేద్యాలు లేకుండా ఆకలి దప్పులతో శిలలై పోతే, ఇక బ్రహ్మం గురించి ఎందుకు వెతుకులాట.
వలస కూలీల నడక, పేదవాళ్ల బతుకు పోరాటం , ఆకలితో ఉన్న పసిబిడ్డ ఏడుపు…ఇది మాయ కాదు. నిజం. పరీక్షలన్నీ ఎపుడో రాసేశాం అనుకుంటాం కానీ, కాలం ప్రతి మనిషికి ఇపుడు కామన్ ఎగ్జామ్ పెట్టింది.
మనుషులు కుక్కల వలే బతకాలి అని సినిక్ ఫిలాసఫర్ డైయోజెనిస్ అన్నాడు. ఇపుడు కుక్కలే మనుషుల్లాగా బతుకుతున్నాయి. బాగా బతుకుతున్నాయి. వాటికి మాస్కులు లేవు. శానిటైజర్లు లేవు. కర్రలతో బాదే పోలీసులు లేరు. డస్ట్‌బిన్ల దగ్గర వేదాంతుల్లా కూచుని వెనుక కాలుతో ముక్కు గీరుతూ, చెవులు టపటపలాడిస్తూ అదృశ్యంగా తచ్చాడుతున్న మనుషుల గురించి కుక్కలు ఆలోచిస్తున్నాయి.
ఈ డైయోజెనిస్ ఏథేన్స్ వీధుల్లో పగటి పూట కాగడా పట్టుకుని నిజమైన మనిషి కోసం వెతికేవాడట!
కరోనా కాలంలో మనం మనలోని మనిషిని వెతుక్కోవాలి. ఈ కష్ట కాలంలో కొందరు తమ ఆత్మల్ని పాతి పెట్టేశారు. కానీ ఎందరో మహానుభావులు సాటి మనిషి జీవిక కోసం పోరాడుతున్నారు, కాపాడుతున్నారు. వాళ్లకి కులం లేదు, మతం లేదు. రాజకీయాలు తెలియవు. వేదాంత జ్ఞానం లేదు. ఇవేమీ లేకుండా కూడా మనుషులుంటారు.
వాళ్ల మీద గౌరవంతో, భక్తితోనైనా కరోనా తప్పుకుని పక్కకి వెళ్లిపోతుంది.