iDreamPost
android-app
ios-app

కరోనానే ఇప్పుడు వాళ్ళకి కల్పతరువు..

కరోనానే ఇప్పుడు వాళ్ళకి కల్పతరువు..

కరోనా ఇది యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. ప్రజలంతా కరోనా పేరు చెబితే వణికిపోతున్నారు భయపడుతున్నారు కానీ కొందరికి మాత్రం కరోనా కల్పతరువులా మారిపోయింది. కరోనా పేరుతో కాసుల వేటలో పడ్డారు కొందరు.. అడ్డగోలుగా అక్రమార్జనకి తెరతీశారు. మనుషుల్లో మిగిలిన కొద్దిపాటి మానవత్వాన్ని కరోనా అంతం చేసిందన్నా అతిశయోక్తి కాదేమో. కానీ ఇది నిజం.. కరోనా కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల పాలిట వరంగా మారింది. ప్రజల్లో ఉన్న కరోనా భయాలను కొన్ని హాస్పిటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి.

కరోనా వైద్యం పేరుతో ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరోనా లేకున్నా కరోనా వచ్చిందని రిపోర్టులు ఇచ్చి అనేకమంది నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. లక్షల ఫీజులు కట్టినా ప్రాణాలు నిలబడతాయని గ్యారెంటీ కూడా లేదు. వీళ్ళ అక్రమార్జనకి అడ్డు అదుపు లేకుండా పోతుండడంతో ప్రభుత్వానికి ప్రైవేట్ హాస్పిటల్ల అక్రమాలపై అనేక ఫిర్యాదులు అందాయి. దాంతో ఎవరైనా నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేసినట్లు తెలిస్తే సంబంధిత హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటామని హాస్పిటళ్లను సీజ్ చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొన్ని హాస్పిటళ్ల తీరులో మార్పు రావడం లేదు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యవహారం కరోనా కాలంలో కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ల తీరు ఎలా ఉందో బట్టబయలు చేసింది. కరోనా చికిత్సకు అనుమతులు పొందకుండానే కరోనా రోగులనుండి వైద్యం పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేయడం వంటి ఆరోపణలు రావడంతో మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను తనిఖీలు చేయగా హాస్పిటల్ బండారం వెల్లడైంది.

కరోనా చికిత్సకు అనుమతి పొందకుండానే చికిత్స అందించారని ఇప్పటికే 11 మంది చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించినా ఆ వివరాలు బయటకు వెల్లడించలేదని కరోనా లేకున్నా ఉందని లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని అధికారులు నిర్వహించిన సోదాల్లో వెల్లడైన కొన్ని నిజాలు. కనీసం వెంటిలేటర్స్ సౌకర్యం లేకున్నా కరోనా చికిత్స పేరుతో వేలల్లో లక్షల్లో బిల్లులు వేసి రోగుల నుండి వసూలు చేసారని తెలిసింది. అంతేకాదు ఏకంగా రూ.10లక్షల విలువైన రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు అనధికారికంగా నిల్వ చేసినట్లు తేలడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. ఇది ఒక హాస్పిటల్ వ్యవహారం మాత్రమే.. ఇలాంటి హాస్పిటల్స్ ఉదంతాలు ఎన్నో వెలుగులోకి రాలేదన్నది కాదనలేని సత్యం.

కర్నూలు జిల్లాలో ఒక వ్యక్తి సాధారణంగా మృతి చెందినా కరోనా సోకి మృతి చెందాడని కుటుంబ సభ్యులతో అంబులెన్స్ సిబ్బంది వెల్లడించారు. అంతేగాక ఎన్నారై నుంచి 85వేలు ఫోన్ పే ద్వారా వసూలు చేయడం కరోనా దోపిడీకి పరాకాష్టగా చెప్పుకోవచ్చు.. ఈ విషయం వెలుగులోకి రావడంతో కలెక్టర్ వీరపాండియన్ సీరియస్ అయ్యారు.అంబులెన్స్ నిర్వాహకుడు జయరాజ్‌తో పాటు అంబులెన్స్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇప్పటికే కరోనా సాకుతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసిన తర్వాత వ్యక్తి మృతిచెందితే ఫీజు కట్టేవరకు మృతదేహాలను అప్పగించకుండా మృతుల సంబంధీకులను ఎన్నో ప్రైవేట్ హాస్పిటళ్లు ఇబ్బంది పెట్టిన ఉదంతాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం ఎంతగా హెచ్చరిస్తున్నా హాస్పిటళ్ల తీరు మారడం లేదు. కరోనా పేరుతో సాగుతున్న ప్రైవేట్ దోపిడీని అడ్డుకట్ట వేయాలంటే అన్ని హాస్పిటల్లలో కరోనా చికిత్సను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని రోగులకు చికిత్స అందించాలని పలువురు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే ఈ ప్రైవేట్ దోపిడీకి అంతం ఉండదని చెప్పడం సత్యదూరం కానీ విషయమే.