iDreamPost
android-app
ios-app

మహమ్మారి బారిన మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మహమ్మారి బారిన మరో టీఆర్ఎస్  ఎమ్మెల్యే

తెలంగాణ‌లో మరో ఎమ్మెల్యే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. కుత్బుల్లాపూర్ శాసన సభ్యుడు కేపీ వివేకానంద‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. క‌రోనా కాలంలోనూ నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగుతున్న ఆయ‌న‌కు మూడు రోజుల క్రితం కాస్త న‌ల‌త‌గా అనిపించింది. అనంత‌రం ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు అనుమానాలు క‌ల‌గ‌డంతో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. ఫ‌లితాల్లో ఆయ‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింది. ఆయ‌న‌తో పాటు భార్య‌, కుమారుడు, ప‌నిమ‌నిషి కూడా వైర‌స్ బారిన ప‌డ్డారు. అంద‌రూ ఇంట్లోనే వేర్వేరు గ‌దుల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. త‌న‌కు బాగానే ఉంద‌ని, ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాన‌ని వివేకానంద తెలిపారు. ఫోన్ లో అధికారులకు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటాన‌ని చెప్పారు. ఆయ‌న‌కు క‌రోనా రావ‌డంతో అనుచ‌రులు, ఈ మ‌ధ్య కాలంలో అత‌నితో క‌లిసి కారులో తిరిగిన కార్య‌క్త‌లు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ముందు జాగ్ర‌త్త‌గా ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు.

కోలుకుంటున్న ఎమ్మెల్యేలు

ఇప్ప‌టికే తెలంగాణ‌లోని నిజామాబాద్ అర్బ‌న్ ఎమ్మెల్యే బిగాల గ‌ణేశ్ గుప్తా, జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ముత్తిరెడ్డి ఆస్ప‌త్రి నుంచి ఎప్పుడో డిశ్చార్జి అయ్యారు. మ‌రో ఎమ్మెల్యే గ‌ణేశ్ గుప్తా ఇంట్లోనే ఉండి వైద్యుల సూచ‌న మేర‌కు చికిత్స పొందారు. అలాగే.. ఆలేరు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యురాలు గొంగిడి సునీత కూడా హైద‌రాబాద్ లోని య‌శోధ ఆస్ప‌త్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు. వారంద‌రూ ప్ర‌స్తుతం బాగానే కోలుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ ఇంట్లోనే ఉండి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

ఆడియో, వీడియో కాన్ఫ‌రెన్స్ ల ద్వారా అధికారుల‌తో మాట్లాడుతూ అభివృద్ధి ప‌నుల‌పై చ‌ర్చిస్తున్నారు. అలాగే.. హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ కూడా క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రానోకు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, 67 ఏళ్ల వ‌య‌స్సులోనూ క‌రోనాను జ‌యించాన‌ని మ‌హ‌మూద్ అలీ చెబుతున్నారు. వైద్యుల చికిత్స‌తో పాటు వంటింటి చిట్కాలు, తుల‌సి ఆకుల‌తో కాసిన వేడి నీళ్లు తాగాల‌ని సూచిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా శృంగ‌వ‌ర‌పు కోట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యే కె. శ్రీ‌నివాస‌రావు, ఖ‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాక‌ర్, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోస‌య్య తో పాటు మ‌రో ఇద్ద‌రు కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.