Idream media
Idream media
కరోనాతో అందరూ ఇళ్లలో ఉంటే రైతులు రోడ్డున పడ్డారు. పంట చేతికొస్తే కొనేవాళ్లు లేరు. అనంతపురం జిల్లా గుత్తి టవున్‌కి సమీపంలో ఒక రైతు కర్బూజ సాగు చేశాడు. 2 లక్షల పెట్టుబడి, శ్రమ కలిస్తే పంట చేతికొచ్చింది. సీజన్ కదా నాలుగు డబ్బులు మిగులుతాయని ఆశ పడ్డారు. కరోనాతో అన్నీ బంద్. పంట కోయకుండా ఉండటానికి వీల్లేదు. రవాణా లేదు కాబట్టి ఎక్కడికీ పంపలేడు.
చివరికి పక్కనున్న గుత్తికి తీసుకెళ్లి కుప్పలు పోసి అరిచి అరిచి అమ్మితే రూ.15 వేలు దక్కింది. వడ్డీలకి కూడా చాలదు. ఎలా బతికేది?
వచ్చేది మ్యారేజీ సీజన్, ఉగాది పండగ కూడా ఉందని కనకాంబర రైతులు సంబరంగా ఉన్నారు. కోత కోసిన కూలీలకి కూడా డబ్బులు రాని స్థితి. అరటి రైతులు దివాళాలో ఉన్నారు.
కూరగాయలు కొంటే ఖరీదు కానీ, రైతుకి దక్కిందేమీ లేదు. తోటల దగ్గరే హోల్‌సేల్‌గా పుచ్చకాయలు, జామకాయలు తెచ్చుకున్న వ్యాపారులకి కన్నీళ్లు ఒకటే తక్కువ. రోడ్డు మీద ఉండనీయరు. అమ్మకపోతే పండ్లు కుళ్లిపోతాయి. పిల్లలకి సెలవులు, ఉగాది కూడా వస్తోంది, బిజినెస్ జరుగుతుందని బేకరీ యజమానులు కేకులు, బిస్కెట్లు బాగానే తయారు చేశారు. హఠాత్తుగా షాప్ క్లోజ్ అయ్యింది. ఇప్పుడు ఊరికే ఇచ్చినా తీసుకోడానికి జనం భయపడుతున్నారు.
విషాదం ఏమంటే ఒకవైపు కరోనా కత్తితో కోసేస్తుంటే ప్రపంచ పోకడ తెలియని ఒక ముసలాయన సానరాయి చక్రాన్ని మోస్తూ కత్తులకి సాన పెడతాం అని అరుస్తూ అనంతపురం వీధిలో కనిపించాడు.