iDreamPost
android-app
ios-app

Madagula TDP – ఆ కొత్త ఇంఛార్జి మాకొద్దు

  • Published Oct 16, 2021 | 6:45 AM Updated Updated Oct 16, 2021 | 6:45 AM
Madagula TDP – ఆ కొత్త ఇంఛార్జి మాకొద్దు

ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు తెలుగుదేశం ఇంఛార్జీలను నియమిస్తోంది. గత కొన్ని నెలలుగా ఇంఛార్జీల నియామకాలకు పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తున్నా సరైన నేతలు దొరక్క.. ఉన్న నేతలు బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో నియామక ప్రక్రియలో పార్టీ నానాపాట్లు పడుతోంది. ఆ క్రమంలో ఇటీవల రాష్ట్రంలో ఆరు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించింది. అయితే విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గానికి పీవీజీ కుమార్ ను నియమించడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పాత ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడినే కొనసాగించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా ఎలా నియమిస్తారని కార్యకర్తలు, నేతలు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.

రాజీనామాల హెచ్చరిక.. 

ఇప్పటివరకు ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు స్థానంలో పీవీజీ కుమార్ నియామకాన్ని పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి. రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన వ్యక్తిని ఇంఛార్జిగా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నాయి. దేవరాపల్లి, చీడికాడ మండలాల పార్టీ నాయకులు, ఎంపీటీసీలు కుమార్ ను తప్పించి గవిరెడ్డినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం దేవరాపల్లి మండలం పార్టీ నేతలు సమావేశమై కుమార్ నియామకాన్ని వ్యతిరేకించగా.. ఆ మరుసటి రోజే చీడికాడ మండల నేతలు ప్రత్యేకంగా సమావేశమై పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. మాజీ ఎంపీపీ రమణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండలంలోని 23 పంచాయతీల టీడీపీ నేతలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కుమార్ ను ఇంఛార్జిగా కొనసాగిస్తే పదవులకు, పార్టీకి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా నియమించడాన్ని తప్పుపట్టారు.

మూడు ముక్కలాట.. 

గతంలో ఒకసారి ఎమ్మెల్యే అయిన గవిరెడ్డి రామానాయుడు 2014, 19 ఎన్నికల్లో వరుసగా ఓటమిపాలయ్యారు. పార్టీ కూడా అధికారంలో లేకపోవడంతో పార్టీని, నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకుండా విశాఖలోనే ఉంటున్నారు. కాగా ఆయనకు పోటీగా పైలా ప్రసాద్, జీవీ కుమార్ లు నియోజకవర్గంలో తిరుగుతూ గవిరెడ్డికి పోటీగా మారారు. ఎవరికివారు గ్రూపులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాన్ని రామానాయుడు పట్టించుకోవడంలేదన్న ఫిర్యాదుల మేరకు పార్టీ అధిష్టానం అతన్ని ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పించింది. అయితే సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన నేతకు బాధ్యతలు కట్టబెట్టడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

Also Read : సత్తెనపల్లిని బాబు పట్టించుకోవట్లేదా.. పట్టు దొరకడం లేదా?