iDreamPost
iDreamPost
సినిమాల కోసం దర్శకులు తీసుకునే కథల వల్ల కొన్నిసార్లు వివాదాలు చెలరేగుతాయి. ఇప్పుడంటే సోషల్ మీడియా లాంటి ఆన్ లైన్ వేదికలు ఉన్నాయి కాబట్టి విషయాలు త్వరగా తెలుస్తున్నాయి కానీ ఒకప్పుడు ఇవేవి లేని రోజుల్లో అయితే కోర్టుకు వెళ్లడం లేదా రోడెక్కి నిరసన ప్రకటించడం. ఇలా తక్కువ మార్గాలు ఉండేవి. 1991లో ప్రసిద్ధ రచయిత సత్యమూర్తి గారు మెగాబ్రదర్ నాగబాబు హీరోగా ‘దాదర్ ఎక్స్ ప్రెస్’ అనే సినిమా తీశారు. ఆ పేరుతో నడిచే ట్రైన్ లో అమ్మాయిల మీద జరిగిన గ్యాంగ్ రేప్ ని ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించినట్టు అప్పట్లో ప్రకటించారు. టైటిల్ తోనే ఇది కాంట్రావర్సికి దారి తీసింది.
అసలు ఆ సంఘటనే జరగలేదని, కేవలం పబ్లిసిటీ కోసం ఆ పేరుని వాడుకుని ఇలా ప్రచారం చేస్తున్నారని రైల్వే సంఘాలు భగ్గుమన్నాయి. దీని వల్ల ప్రయాణికులు అందులో ఎక్కాలంటే భయపడతారని కొందరు న్యాయవాదులు కేసులు కూడా వేశారు. షూటింగ్ నిర్విరామంగా జరిగిపోయింది కానీ విడుదల దగ్గరపడే కొద్దీ వివాదాలు ఎక్కువయ్యాయి. దీంతో సూపర్ ఎక్స్ ప్రెస్ అని మార్చాల్సి వచ్చింది. అప్పటికే ప్రింట్ అయిన పబ్లిసిటీ మెటీరియల్ లో కూడా కొట్టేసి మరీ చేంజ్ చేయాల్సి వచ్చింది. దర్శకులు కం రచయిత సత్యమూర్తి ఇప్పటి సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ గారి తండ్రి. కథను బాగానే సెట్ చేసుకున్నారు. దాదర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో అమ్మాయిలను మానభంగం చేసిన ఐదుగురు రౌడీలు బాగా పలుకుబడి ఉన్నవాళ్లు. విచారణ కోసం నియమింపబడ్డ ఆఫీసర్ నాగబాబు. కానీ వాళ్లకు భయపడి ఎవరూ సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు రారు. వచ్చిన ఒకరిద్దరిని ఆ గ్యాంగ్ చంపేస్తుంది.
అక్కడితో ఆగకుండా నాగబాబు ప్రియురాలిని చంపి అతని కాళ్ళు విరగొట్టి మంచానికి పరిమితం చేస్తారు. చట్టంతో వాళ్ళను శిక్షించడం సాధ్యం కాదని గుర్తించిన నాగబాబు ఉద్యోగం లేకపోయినా ఒక్కొక్కరిని పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి మరీ చంపుకుంటూ పోతాడు. చివరికి తను ఏమయ్యాడో సినిమాలోనే చూడాలి. ఇంటరెస్టింగ్ పాయింట్ ఉన్నప్పటికీ నాగబాబు సినిమా మొత్తం మరీ డల్ గా కనిపించడం ప్రేక్షకులకు నచ్చలేదు. అందులోనూ మూవీ చాలా సీరియస్ టోన్ లో సాగుతుంది. ఆ గ్యాంగ్ లో ఒక సభ్యుడిగా రియల్ స్టార్ శ్రీహరి నటించడం విశేషం. రాజ్ కోటి సంగీతం సమకూర్చారు. అంచనాలు బాగానే ఉన్నప్పటికీ సూపర్ ఎక్స్ ప్రెస్ ని జనం రిసీవ్ చేసుకోలేకపోయారు. ఫలితం ఫ్లాప్ మూటగట్టుకోవాల్సి వచ్చింది. వివాదాలు ఆసక్తిని రేపుతాయి కానీ వసూళ్లు తెచ్చిపెట్టవు అని చెప్పడానికి సూపర్ ఎక్స్ ప్రెస్ మంచి ఎగ్జాంపుల్