iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డను తిరిగి నియమించకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలంట..!!

నిమ్మగడ్డను తిరిగి నియమించకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాలంట..!!

ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు, ఆరోపణలు చేయడం సర్వసాధారణం. దాదాపు ఏ అంశమైన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగానే ప్రతిపక్షాల పయనం ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలో వీరు నిర్థేశిస్తారు. పలు డిమాండ్లు చేసి దీక్షలు, ధర్నాలు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తారు. ఇంత వరకూ పని చేస్తే ప్రతిపక్షాలు తమ పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నాయనే భావన వస్తుంది. అయితే అంతకు మించి ప్రవర్తిస్తే మాత్రం నవ్వులపాలవక తప్పదు. హాస్యాస్పదమైన డిమాండ్లు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహఖ అధ్యక్షడు తులసిరెడ్డి ప్రస్తుతం ఇలానే నవ్వులపాలయ్యారు.

రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ వ్యవహారంపై తాజాగా ఆయన ఓ సరికొత్త డిమాండ్‌ వినిపించారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నియమించాలంటూ డిమాండ్‌ చేశారు. లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని తనదైన శైలిలో స్పందించారు ఈ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు. ఇలాంటి డిమాండ్ల ద్వారా తమ పార్టీ, తాము ఇంకా ఉన్నామనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నట్లుగా తులసి రెడ్డి మాట్లాడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహారంలో ఏమి జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. మార్చి 15వ తేదీ నుంచి ఈ వివాదం నడుస్తోంది. ఓ అధికారి, ప్రభుత్వం మధ్య వివాదం అయితే ఫర్వాలేదు. కానీ ఇందులో రాజకీయాలు మిళితం అయ్యాయని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వ్యవహర తీరు సాక్షాధారాలతో బయటపడింది. అలాంటి ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టుల్లో నడుస్తోంది. ఈ క్రమంలో రాజకీయాలను మించి ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అండ్‌ పార్టీ, ఓ వర్గం మీడియా. రాష్ట్ర ప్రజలనే తప్పుదోప వట్టించేలా కోర్టు వ్యాఖ్యలు, గవర్నర్‌ నిర్ణయాలు అంటూ కథనాలు ప్రచురిస్తున్నారు. జరుగుతున్న వ్యవహారాలను ఆది నుంచి గమనించి, స్పందించాల్సిన ఆవశ్యకత రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్‌ నేత అయిన తులసిరెడ్డి లాంటి వారికి ఎంతో ఉంది. లేదంటే ఇలానే నవ్వులపాలు కావాల్సి వస్తుంది.