iDreamPost
android-app
ios-app

సచిన్ పైలట్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..!

సచిన్ పైలట్ తో పాటు 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..!

కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ కాంగ్రెస్ నెలకొన్న రాజకీయ సంక్షోభం ముగింపు దశకు చేరింది. సచిన్ పైలట్ వర్గంపై కాంగ్రెస్ వేటుకు సిద్ధపడింది. తొలిత సచిన్ పైలట్ కు ఉన్న కీలక పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులను పీకేశారు. పిసిసి పదవి నుంచి సచిన్ పైలట్ ను తొలగించి…వెంటనే ఆగమేఘాల‌ మీద ఆ పదవిని గోవింద్ సింగ్ కు కట్టబెట్టింది. అలాగే డిప్యూటీ సిఎం, వివిధ మంత్రిత్వ శాఖలను తొలగించారు. సచిన్ తో పాటు ఆయన సన్నిహిత ఇద్దరు మంత్రులపై కూడా వేటుపడింది. దీనిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా కలిసి నివేదించారు. వారి తొలిగింపుపై వెనువెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది.

సచిన్ తిరుగుబాటుపై కాంగ్రెస్ వేగంగా చర్యలు చేపట్టింది. తాజాగా సచిన్ పైలట్ తో సహా 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత తీర్మానం ప్రవేశపెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పాల్పడినందుకు సచిన్ పైలట్, ఇతర అసమ్మతి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే చర్యలను కాంగ్రెస్ ప్రారంభించింది. తిరుగుబాటుదారులకు అసెంబ్లీ స్పీకర్ నోటీసు జారీ చేసి శుక్రవారం నాటికి స్పందించాలని కోరారు.

తిరుగుబాటు ఎమ్మెల్యేలను తొలగించడం వల్ల అసెంబ్లీలో విశ్వాస పరీక్ష (ఫ్లోర్ టెస్ట్‌)లో మెజారిటీ మార్కును తగ్గించడం వల్ల అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ప్రయోజనం ఉంటుంది. తిరుగుబాటుదారులను కాంగ్రెస్‌ పక్కన పెట్టడంతో సచిన్ పైలట్ ఈ రోజు ప్రసంగించనున్న విలేకరుల సమావేశాన్ని విరమించుకున్నారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందు వల్ల అనర్హులుగా ఎందుకు వేటు వేయకూడదని సచిన్ పైలట్, ఇతర తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రెండు సిఎల్పీ సమావేశాలను హాజరుకాలేదని అందులో పేర్కొన్నారు. వారు సమాధానం ఇవ్వడంలో విఫలమైతే, వారిపై చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.

సచిన్ పైలట్‌ను మంగళవారం ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. ఆయనతో చేరిన మరో ఇద్దరు మంత్రులను కూడా తొలగించారు. “సత్యాన్ని వేధించవచ్చు కాని ఓడించలేము” అని సచిన్ పైలట్ ఒక ట్వీట్ లో స్పందించారు. సచిన్ పైలట్, సహచర ఇద్దరు మంత్రులను తొలగించడంతో ఖాళీ అయిన స్థానాలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ రోజు భర్తీ చేయడానికి, తన మద్దతుదారులను ఐక్యంగా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తుంది.

కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 200 మంది సభ్యుల ఉన్న అసెంబ్లీలో హాఫ్ మార్క్ 101. సచిన్ పైలట్ వైపు కనీసం 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 17 మంది కాంగ్రెస్, ముగ్గురు స్వతంత్ర శాసన సభ్యులు ఉన్నారు. గెహ్లాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రిసార్ట్ లో ఉంచారు. సోమవారమే ముఖ్యమంత్రి ఇంటి వద్ద నుంచే తన బలాన్ని చూపించారు. ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఇప్పుడు పోలీసు ఎస్కార్ట్ ఉంది.

సచిన్ పైలట్ తిరుగుబాటుకు ముందు 13 మంది స్వతంత్రులు, బిటిపి, సిపిఎం ఆర్ఎల్డీ పార్టీలకు చెందిన ఐదుగురు సభ్యుల మద్దతుతో పాటు కాంగ్రెస్‌కు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సంఖ్య ఇప్పుడు 90 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర సభ్యులు మరియు ముగ్గురు సిపిఎం, ఆర్ఎల్డీకి చెందిన ఎమ్మెల్యే మద్దతు ఉంది.

రాజస్థాన్ అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలను కలిగి ఉన్న భారతీయ గిరిజన పార్టీ (బిటిపి) ప్రభుత్వం నుండి మద్దతును ఉపసంహరించుకుంది. ఎమ్మెల్యేలు రెండు వీడియోలను షేర్ చేసుకున్నారు. పోలీసులు జైపూర్ నుండి బయలుదేరకుండా వారిని ఆపారు. వారి కారు “కీ”లను కూడా లాక్కున్నారని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జోక్యం తరువాత ఆ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ సంక్షోభంపై జాగ్రత్తగా ఉన్న బిజెపి ఇప్పుడు చురుకుగా ఉంది. కానీ ఈ రోజు జరగాల్సిన సమావేశాన్ని బిజెపి రద్దు చేసింది. 72 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న బిజెపికి రాజస్థాన్‌లో అధికారం చేపట్టడానికి మరో 30 మంది మద్దతు అవసరం.

మూడు నెలల క్రితం జ్యోతి రాధిత్య సింధియా నిష్క్రమించిన తరువాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పతనానికి దోహదపడింది. సచిన్ పైలట్‌ను చేరుకోవడానికి పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై కొంత మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు విచారం వ్యక్తం చేశారు. పైలట్ తాను బిజెపిలో చేరటం లేదని స్పష్టం చేశారు. ఆ వార్తాలను ఖండించారు. కానీ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తిరుగుబాటుకు ప్రయత్నించడానికి బిజెపి ఆయనను ఉపయోగిస్తోందని అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.