iDreamPost
iDreamPost
రాజస్థాన్ కాంగ్రెసులో ఏడాదికి పైగా నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి కొత్త రాజీ సూత్రాన్ని ఆ పార్టీ అధిష్టానం ప్రతిపాదించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసులో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్, మరో నేత సచిన్ పైలట్ మధ్య ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. దీన్ని పరిష్కరించేందుకు అధిష్టానం నడుం బిగించింది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ పిలుపు మేరకు అసమ్మతి నేత సచిన్ పైలట్ ఢిల్లీలో సోనియాను కలిశారు. 45 నిమిషాలకుపైగా వారిద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఈ భేటీలోనే కొత్త రాజీ సూత్రాన్ని సోనియా తెరపైకి తెచ్చారు. సచిన్ కూడా దానికి దాదాపు అంగీకరించినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
కేబినెట్ విస్తరణలో సచిన్ వర్గానికి ప్రాధాన్యం
సచిన్ డిమాండ్ మేరకు రాష్ట్ర కేబినెట్ విస్తరణలో సచిన్ వర్గానికి ప్రాధాన్యత ఇస్తామని సోనియా హామీ ఇచ్చారు. 30 మంది ఉండాల్సిన రాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 21 మంది ఉన్నారు. అదే కాకుండా ఒకరికి ఒకటే పదవి అన్న నియమాన్ని అనుసరిస్తే మరో మూడు స్థానాలు ఖాళీ అవుతాయి. విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దొతస్రా పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆరోగ్యశాఖ మంత్రి రఘు శర్మ ఏఐసీసీ గుజరాత్ వ్యవహారాల ఇంఛార్జిగా, రెవెన్యూ మంత్రి హరీష్ చౌదరి పంజాబ్ ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఆ ముగ్గురు మంత్రి పదవులను వీడాల్సి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. దీంతో త్వరలోనే కేబినెట్ విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈలోగానే సచిన్ పైలట్, సీఎం గెహ్లాట్ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించి.. సచిన్ వర్గానికి ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒకేసారి విస్తరణ జరపాలని అధిష్టానం భావిస్తోంది.
ఈ విషయమై ఇప్పటికే సీఎం గెహ్లాట్ అధిష్టాన పెద్దలు సోనియాగాంధీ, ప్రియాంకలతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి అజయ్ మాకెన్ లతో చర్చలు జరిపారు. దానికి కొనసాగింపుగా సచిన్ తో సోనియా చర్చలు జరిపి దాదాపు కొలిక్కి తెచ్చారు. గత ఏడాది జూలైలో సీఎం గెహ్లాట్ పై సచిన్ పైలట్ తిరుగుబాటు చేసి తన మద్దతుదారులైన 18 మంది ఎమ్మెల్యేలతో బయటకు వచ్చేయడం.. పార్టీ సీనియర్ నేతల బుజ్జగింపులతో వెనక్కి తగ్గిన తర్వాత పైలట్ తో సోనియా భేటీ కావడం ఇదే తొలిసారి.
పార్టీ ఏం చెబితే అది చేస్తా..
కేబినెట్ విస్తరణలో సచిన్ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేందుకు సీఎం గెహ్లాట్ అంగీకరించినా.. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు మాత్రం ఇష్టపడలేదు. దాంతో మధ్యేమార్గంగా సచిన్ కు ఢిల్లీకి తీసుకొచ్చి పార్టీ జాతీయ కార్యవర్గంలో కీలక పదవి ఇవ్వాలని సోనియా భావిస్తున్నారు. ఇదే విషయం సచిన్ కు చెప్పగా ఆయన అంగీకరించారు. సోనియాతో చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన పైలట్ రాజస్థాన్ కేబినెట్ విస్తరణ త్వరలో ఉంటుందని. ఖాళీల భర్తీతోపాటు అన్ని రకాలుగా సమతూకం పాటించాల్సి ఉంటుందన్నారు. 20 ఏళ్లుగా పార్టీ ఏ పని అప్పగించినా చేస్తున్నానని.. ఇకముందు కూడా అలాగే చేస్తానని వ్యాఖ్యానించారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి కృషి చేస్తానని చెప్పారు.
Also Read : Railway To Drop ‘Special Train’ Tag – స్పెషల్ దోపిడీకి రెడ్ సిగ్నల్