iDreamPost
android-app
ios-app

సచిన్ పైలట్ పై వేటు – కాంగ్రెస్ దూకుడు పెంచిందా?

  • Published Jul 14, 2020 | 9:46 AM Updated Updated Jul 14, 2020 | 9:46 AM
సచిన్ పైలట్ పై వేటు – కాంగ్రెస్ దూకుడు పెంచిందా?

రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండదు. నేతల మధ్య బంధాలు గానీ, పార్టీల వ్యవహారాల్లో గానీ అంతగా నిలకడ కనిపించదు. అందుకు తాజా ఉదాహరణ రాజస్తాన్ పరిణామాలే. మూడు నెలల క్రితం మధ్యప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి ఎదురయిన సమయంలో కాంగ్రెస్ తీరుకి, రాజస్తాన్ విషయంలో ఆపార్టీ అధిష్టానం వ్యవహారశైలికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. అప్పట్లో ఆత్మరక్షణ ధోరణిలో సాగింది. ఆఖరికి ప్రభుత్వాన్ని కోల్పోయింది. కానీ రాజస్తాన్ లో మాత్రం దూకుడు ప్రదర్శించింది. చివరకు తిరుగుబాటు జెండా ఎగురవేసిన సచిన పైలట్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి సాగనంపింది.

మధ్యప్రదేశ్ కి, రాజస్తాన్ రాజకీయాలకు వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ బొటాబొటీ మెజార్టీతో గట్టెక్కింది. బీఎస్సీ లాంటి పార్టీల మధ్ధతు కీలకంగా మారింది. కానీ రాజస్తాన్ లో అలాకాదు. కాంగ్రెస్ కి , బీజేపీ కి మధ్య సీట్ల పరంగా దాదాపుగా మూడు పదుల సంఖ్య తేడా ఉంది. అయినప్పటికీ మధ్యప్రదేశ్ లో తనకు సీఎం పీఠం దక్కలేదని రగిలిపోయిన జ్యోతిరాదిత్యా సింధియా జెండా మార్చేస్తే, రాజస్తాన్ లో కూడా తనకు ఆశించిన సీటు దక్కలేదని సచిన్ పైలట్ సమరానికి సిద్ధమయ్యారు. రాజస్తాన్ లో సీట్ల పరంగా ఉన్న సానుకూలతను అవకాశంగా మలచుకున్న కాంగ్రెస్ నాయకత్వం సచిన్ ని కట్టడి చేసేందుకు సిద్ధమయ్యింది. అందుకు తగ్గట్టుగా దూకుడు పెంచి ముందుకెళ్లింది.

అశోక్ గెహ్లాట్ ఇంట్లో నిర్వహించిన బలపరీక్షలో ఆశించిన సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరుకావడం కూడా కాంగ్రెస్ కి ధైర్యాన్నిచ్చింది. ప్రచారం సాగినంత సంఖ్యలో సచిన్ వెంట ఎమ్మెల్యేలు లేరని గ్రహించిన తర్వాత ఆయన్ని రక్షణలోకి నెట్టేసే ప్రయత్నం ప్రారంభించింది. పీసీసీ చీఫ్‌ పదవి నుంచి తొలగించడంతో సరిపెట్టకుండా సచిన్ పై మరిన్ని చర్యలకు పూనుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్వయంగా రాహుల్, ప్రియాంక వంటి వారు రంగంలో దిగి నచ్చజెప్పినా వెనక్కి తగ్గకుండా మొండిగా వ్యవహరించిన నాయకుడిని దారికి తెచ్చుకునే దిశలో కాంగ్రెస్ ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఇతర నేతలంతా వరుసగా పార్టీ అధిష్టానం ముందు తలొగ్గి ఉండేలా చేయడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు అంతా జరుగుతుందనే ధీమా మాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా ఫ్లోర్ టెస్టులో ఎమ్మెల్యేలంతా అశోక్ గెహ్లాట్ వెంట ఉంటారనే ధీమా కనిపించడం లేదు. దాంతో సచిన్ ఎలాంటి ప్రయత్నం చేస్తారన్నది ఆసక్తికరం అవుతోంది.

జ్యోతిరాదిత్య అనుభవాల నేపథ్యంలో సచిన్ విషయంలో ధృఢంగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకత్వానికి సచిన్ తొందరబాటు చర్యల మూలంగానే అవకాశం వచ్చిందని కొందరు అంచనా వేస్తున్నారు. అనువుగాని సమయంలో తన ఆధిక్యం చాటుకోవాలని సచిన ప్రయత్నించడంతోనే ఆయన పట్ల సానుభూతి ఉన్న నేతలు కూడా చివరకు అశోక్ శిబిరంలో కనిపిస్తున్నట్టు సమాచారం. యువ నేతగా గుర్తింపు ఉండి, ఎదిగేందుకు అన్ని రకాలుగా అవకాశాలున్న నేపథ్యంలో సచిన్ నిర్ణయం తొందరపాటు అవుతుందా లేక చివరకు కాంగ్రెస్ కి శిరోభారం అవుతుందా అనే దానికి కాలమే సమాధానం చెబుతుంది. కానీ ప్రస్తుతానికి సచిన్ కి మాత్రం పదవీగండం పెద్ద ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు.