iDreamPost
android-app
ios-app

పూజ చేస్తూనే ప్రాణాలు విడిచిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

పూజ చేస్తూనే ప్రాణాలు విడిచిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే

వాన రాకడ-ప్రాణం పోకడ ఎవరికెరుక అని తెలుగులో ఒక సామెత ఉంది.. ఆధునిక పరిజ్ఞానంతో వాన రాకడ అయినా కనిపెట్టొచ్చేమో కానీ ప్రాణం పోకడను మాత్రం కనిపెట్టలేం. తాజాగా మాజీ ఎమెల్యే వినోద్ డాగా ఆలయంలో పూజలు చేస్తూనే ప్రాణాలు కోల్పోయిన విషాదాంత ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మెహగావ్‌కు అసెంబ్లీ ఉపఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ అధిష్టానం వినోద్ డాగాకు అప్పగించింది. మధ్యప్రదేశ్ ఉపఎన్నికల ఫలితాల గురించి సమీక్షించేందుకు భోపాల్ నుంచి బేతుల్ వచ్చారు.అనంతరం బేతుల్ లోని జైన దేవాలయం దాదావాడి వద్ద పూజ చేయడానికి వెళ్ళారు. ప్రధాన విగ్రహం ముందు ప్రార్థనలు చేస్తుండగానే కుప్పకూలిపోయారు. వినోద్ డాగా చనిపోయిన ఉదంతం అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యింది.

వినోద్ డాగా కుప్పకూలిన విషయాన్ని ఒక బాలుడు గమనించి ఆలయ పూజారికి తెలపడంతో పూజారితోపాటు అక్కడున్నవారంతా ఆయనను లేపే ప్రయత్నం చేశారు. అనంతరం ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందారని వైద్యులు స్పష్టం చేశారు. కాగా ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని పలువురు వ్యాఖ్యానించారు.

వినోద్ డాగా కాంగ్రెస్ రాష్ట్ర కోశాధికారి మరియు సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడితో సహా పలు ముఖ్యమైన పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన మరణించిన సీసీ టీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.