iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ విభజన పాపాన్ని మూటగట్టుకుని ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జవసత్వాలు నింపి గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. గతంలో ఒకటిరెండుసార్లు అటువంటి ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. కాంగ్రెస్ పూర్తిగా అచేతనావస్థలో ఉండటమే దానికి కారణం. ఎన్నికల్లో వరుస ఓటములు, నేతల వలసలు, కార్యకర్తల కొరత పార్టీ ఉనికినే దెబ్బతీశాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం మరో ప్రయత్నం చేసేందుకు సిద్ధం అవుతోంది. అందులో భాగంగా ఈ 21, 22 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం అందింది.
నానాటికీ తీసికట్టు
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికార శక్తిగా ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ మెజారిటీ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఏపీని విభజించింది. దాంతో నవ్యాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురైంది. 2014 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. నాయకులు, కార్యకర్తలు సైతం ఇతర పార్టీల్లోకి వలసపోవడంతో కాంగ్రెస్ ఖాళీ అయిపోయింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో మరింత చితికిపోయింది. ఇక ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే పోటీ చేసేందుకు అభ్యర్థులే లేక సోదిలోకి లేకుండా పోయింది. ఇటీవల జరిగిన బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 6235 ఓట్లు మాత్రమే దక్కడం పార్టీ నేతలను తీవ్రంగా కుంగదీసింది. నడిపించే నాయకులు.. జెండా మోసే కార్యకర్తలు లేక పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.
నిలబెట్టే ప్రయత్నం
ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీకి మళ్లీ ఊపిరి పోసి నిలబెట్టేందుకు అధిష్టానం సిద్ధం అవుతోంది. ఈ నెల 21, 22 తేదీల్లో విజయవాడలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. నాయకులందరూ హాజరుకావాలని ఆదేశించింది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమన్ చాందీ, కార్యదర్శులు మయప్పన్, కృష్టఫర్ తిలక్ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పార్టీ తాజా పరిస్థితి తెలుసుకోవడంతోపాటు మళ్లీ గాడిలో పెట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, నాయకత్వ మార్పు తదితర అంశాలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగుతారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ వ్యవహరిస్తున్నారు. ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా నియమించిన తర్వాత ఆ రాష్ట్ర పార్టీలో ఎంతో కొంత జోష్ వచ్చింది. ఏపీలోనూ చురుకైన నేతను నియమిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని అంటున్నారు. అటువంటి నాయకులు దొరుకుతారా.. విశ్వాసం నింపి చెదిరిపోయిన కార్యకర్తలను మళ్లీ పార్టీ వైపు ఆకర్షించగలరా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.