Idream media
Idream media
ఈ దేశ రాజకీయాలు నాశనం కావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్. కానీ అది పాతమాట. బిజెపి ఇపుడు కాంగ్రెస్‌నే మించిపోయింది. ఆ పార్టీకి మతతత్వ ముద్ర వున్నప్పటికీ ఎంతోకొంత రాజకీయ హుందాతనం ఒకప్పుడు వుండేది. ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోవడమే దీనికి ఉదాహరణ.
మోడీ, అమిత్‌షాలు ఎత్తుగడల్లో చాణుక్కులు అనిపించుకుంటూ విలువల్లో దిగజారిపోతున్నారు. మొన్న మహారాష్ట్రలో అవమానం ఎదురైనా, నిన్న కర్ణాటకలో విజయం సాధించారు. బిజెపి ఆడిన నెంబర్ గేంలో 15 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగి ప్రజల సొమ్ము కోట్ల రూపాయలు వృథాగా ఖర్చయ్యింది.
కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేవరకూ బిజెపి నిద్రపోలేదు. అయితే ఇప్పుడు ఏర్పడిన యుడియూరప్ప ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో ఎవరికీ తెలియదు. మంత్రి వర్గ విస్తరణ తరువాత కుమ్ములాటలు ప్రారంభమవుతాయి. ఇపుడు గెలిచిన ఫిరాయింపుదారులంతా మంత్రి పదవులు ఆశిస్తారు కాబట్టి మళ్లీ గొడవలు, ఫిరాయింపులు. అయితే కేంద్రంలో వున్న బిజెపి ప్రభుత్వమంటే అందరికీ భయమే కాబట్టి, ఆ ఒక్క కారణంతో ఈ ప్రభుత్వం కొంతకాలం వున్నా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తోకవిప్పిన వాళ్లపైన సిబిఐని, ఐటీ అధికారులని ఎప్పుడు ఉసిగొల్పాలో అమిత్‌షాకి తెలిసినట్టు ఇంకెవరికీ తెలియదు.
మహారాష్ట్రలో కూడా శివసేనకి పొగ పెట్టకుండా బిజెపి ఊరుకోదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆ పార్టీ పప్పులు వుడకడం లేదు. ఎందుకంటే హంగ్ ప్రభుత్వాలని ఇచ్చే అలవాటు తెలుగువాళ్లకి ఎప్పుడూ లేదు. తమిళనాడులో కూడా అంతే. ఎవరికో ఒకరికి పూర్తి మెజార్టీ ఇస్తారు.
జగన్మీదకి పవన్‌ని ఉసిగొల్పడంలో బిజెపి హస్తం వుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. త్వరలో పవన్ మోడీని కలుస్తాడని కూడా అంటున్నారు. జగన్‌కి దొరకని అపాయింట్మెంట్ పవన్‌కి దొరికితే విచిత్రమే.
అయినా ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని పవన్‌తో బిజెపికి ఎలా కుదురుతుందో తెలియదు. విలీనం అంటున్నారు కానీ జనసేన పార్టీలో ఏముంది విలీనం చేయడానికి? నాయకులు, కార్యకర్తలు లేని పార్టీతో విలీనమంటే బిజెపికి బుర్ర చెడిపోయిందని అర్థం. అమిత్‌షా చాణుక్కుడే కావచ్చు. కానీ చాణుక్కుడు కూడా తప్పులు చేస్తాడు. అది మహారాష్ట్రలో రుజువైంది.