iDreamPost
android-app
ios-app

మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ చరిత్ర.

మత సామరస్యానికి ప్రతీక హైదరాబాద్ చరిత్ర.

కుల‌, మ‌త రాజ‌కీయాల‌కే నేడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు నేత‌లు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటేనే మ‌తమే ఆయుధంగా మారుతోంది కొన్ని పార్టీల‌కు. ప్ర‌జ‌ల్లోనూ కొంత మంది మ‌త‌ప‌ర ప్ర‌ణాళిక‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. ఆ న‌మ్మ‌కం మ‌న వ‌ర‌కే ప‌రిమిత‌మైతే ప‌ర్వాలేదు. స‌మాజంలో విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా మారితేనే ప్ర‌మాద‌క‌రం. మూసీ,ఈసా తెహజీబ్‌కు ఆలవాలమైన నగరంలో ఎన్నికల వేళ రాజకీయం కొత్తరూపు దాల్చింది. అన్నదమ్ముల మధ్య విద్వేష కుంపట్లను రగుల్చుతోంది. మ‌తాల మ‌ధ్య ఇబ్బందులు సృష్టించేలా మారుతోంది. అది ముదిరితే ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి భంగం వాటిల్లిన‌ట్లే. ఈ నేప‌థ్యంలో కుల‌, మ‌త, ప్రాంత తార‌త‌మ్యాలు లేకుండా అంద‌రినీ అక్కున చేర్చుకున్న భాగ్య‌న‌గ‌రంలో సహజీవన వైభవం గ‌తంలో ఎలా ఉందో ఓ సారి గుర్తు చేసుకుంటే.. వ‌హ్వా అనిపిస్తుంది.

భారత్ కు జై హింద్ నినాదం తో పాటు, బోస్ ను నేతాజీగా కీర్తించింది ఎవ‌రో తెలుసా..

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ వెంట నడిచిన మహా యోధుడు అబిద్‌ హసన్‌ సఫ్రానీ పక్కా హైదరాబాదీ. ఆయన తండ్రి అమీర్‌ హసన్‌ నిజాం సంస్థానంలో ఉన్నతాధికారి. తల్లి ఫక్రూల్‌ హాజియా అభీష్టం మేరకు అబిద్‌ ఉన్నత విద్యకు జర్మనీ వెళ్లాడు. అక్కడ నేతాజీ పరిచయంతో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో క్రియాశీలపాత్ర పోషించాడు. బోసుతో కలిసి 1943లో తొంభై రోజుల పాటు జలాంతర్గామిలో ప్రయాణించిన ఏకైక వ్యక్తి అబిద్‌ హసన్‌. నేతాజీ వ్యక్తిగత కార్యదర్శిగా చేశాడు. ఇతనే స్వతంత్ర పోరాటంలో “జైహింద్” అనే రణ నినాధాన్ని మోదట పలికిన వ్యక్తి, అలాగే బోస్‌ను ‘నేతాజీ’గా అభివర్ణించిన తొలి వ్యక్తి అబిదే అని కూడా అంటారు.

రామాలయాన్ని నిర్మించిన నిజాం రాజు

హైదరాబాద్‌లో ఒక్కో దేవాలయానిది ఒక్కో చారిత్రక గాథ. అత్తాపూర్‌లోని రాంబాగ్‌ సీతారాముడు ఆలయం కథ ఎంతో ప్రత్యేకం. రెండు శతాబ్దాల కిందట నిర్మితమైన ఆ గుడిలో సీతారామ, లక్ష్మణ విగ్రహాలను మూడో నిజాం సికిందర్‌ ఝా ప్రతిష్టించాడు. ధూప, దీప నైవేద్యాల కోసం కొంత భూమినీ మాన్యంగా రాసిచ్చాడు. సికిందర్‌ కొలువులో ఉత్తరాదికి చెందిన కాయస్థుడు భవానీ ప్రసాద్‌ ఉన్నతోద్యోగి. ఆయన ఆహ్వానం మేరకే నిజాం ప్రభువు దైవకార్యంలో పాల్గొని, తన రామభక్తిని చాటుకున్నాడు. 1812నాటి రాంబాగ్‌ మందిరం పరమత సహనానికి నిలువెత్తు సాక్ష్యం. అంతకు రెండేళ్లకు ముందే నిజాం సైనికదళపతి జాంసింగ్‌ రాజ్‌పుత్‌ గుడిమల్కాపూర్‌లో శ్రీవెంకటేశ్వరాలయం నిర్మించాడు. నాలుగో నిజాం ఫర్కుందా ఆలీ ఏలికలో రాజస్థానీ గనేరివాలా సీతారాంబాగ్‌ మందిరం కట్టాడు.

స్వామి వివేకానంద న‌గ‌రానికి విచ్చేసిన‌ప్పుడు..

1892, ఫిబ్రవరి10న స్వామి వివేకానంద నగరానికి విచ్చేశారు. నిజాం మంత్రిమండలి నుంచి ఘన స్వాగతం లభించింది. నిజాం బావమరిది నవాబు కుర్షిద్‌ ఝా ఆహ్వానం మేరకు హుస్సేనీ ఆలంలోని ఆయన దేవిడికి వివేకానంద వెళ్లారు. ఇరువురూ కలిసి ‘‘హిందు, ఇస్లాం’’ మతాల ఔన్నత్యంపై రెండు గంటల పాటు చర్చించుకున్నారు. అప్పుడే స్వామి చికాగో పర్యటన గురించి తెలిసి, కుర్షిద్‌ ఆర్థిక సహాయం ప్రతిపాదించాడు. ‘అవసరమైతే తప్పక అడుగుతానని’ వివేకానంద బదులిచ్చారు. నిజాం ప్రధాని ఆస్మాన్‌ ఝా కోరిక మేరకు బషీర్‌బాగ్‌ ప్యాలెస్‌లో వివేకుడు ఆతిథ్యం పొందారు. నిజాం ఏలికలో స్వామి వివేకానందకు లభించిన అరుదైన గౌరవం ఈ నేల భిన్నసంస్కృతుల సజీవతకి సాక్ష్యం.

కలిసిమెలసి న‌డిచిన నేల…‌

మ‌హా న‌గ‌రం హిందూ – ముస్లిం ల ఐక్య‌త‌కు నిద‌ర్శ‌నం. ఒక‌రినొక‌రు స‌హ‌కారాలు, స్నేహ పూర్వ‌క స‌త్కారాలు ఇక్క‌డి సంస్కృతి. ఒక‌రి మ‌తాన్ని వేరొక‌రు గౌర‌వించ‌డం.. విశ్వ‌సించ‌డం ఇక్క‌డ అనాదిగా వ‌స్తోంది. 1908, మూసీ వరదల సమయంలో ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌ గంగమ్మకు శాంతిపూజలు నిర్వహించి స్ఫూర్తిగా మిగిలారు. రామదాసు భక్తికి మెచ్చి, భద్రాది కల్యాణ రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే సంస్కృతికి తానీషా శ్రీకారం చుట్టారు. తర్వాత నిజాం ప్రభువులూ ఆచారాన్ని కొనసాగించారు. తానీషాతో చెలిమి కట్టిన ఛత్రపతి శివాజీ గోల్కొండలో నెలరోజులు బస చేశారు. నిజాం హైకోర్టు న్యాయమూర్తి మీర్జాయార్‌ జంగ్‌ 1936లో శ్రీకృష్ణజన్మాష్టమి ఉత్సవాల్లో పాల్గొని, ‘‘శ్రీకృష్ణుడు-హింద్‌ ప్రవక్త’’ అంశంపై ఉపన్యసించారు. హైదరాబాద్‌ నిర్మాత మహ్మద్‌ కులీ, భాగమతీ ప్రణయగాథ చ‌రిత్ర‌లో నిలిచిపోయింది. బ్రిటీషు ఆరో రెసిడెంట్‌కిర్క్‌ ప్యాట్రిక్‌, నిజాం వంశస్తురాలు ఖైరునిస్సా బేగంల మతాంతర వివాహం ఆనాడొక సంచలనం. మ‌త సామ‌ర‌స్యానికి ఆల‌వాల‌మైన ఇలాంటి ఎన్నో గురుతులు భాగ్య‌న‌గ‌ర పొత్తిళ్ల‌లో నిక్షిప్తం. రాజ‌కీయ వైష‌మ్యాలలో చిక్కుకోకుండా క‌లిసి మెలిసి ముందుకు న‌డుద్దాం.